Pegasus:పెగాసస్‌తో నిఘా పెట్టడం ఎలా?.. జనాల ఆసక్తి !

23 Jul, 2021 11:16 IST|Sakshi

కోలికోడ్‌ (కేరళ): ఓవైపు పెగాసస్‌ స్పై వేర్‌ పార్లమెంటులో ప్రకంపనలు సృష్టిస్తుంటే... మరోవైపు ఆ సాఫ్ట్‌వేర్‌ ఉపయోగించి ఇతరుల ఫోన్లపై నిఘా వేయాలనుకునే వారి సంఖ్య పెరిగిపోతుంది. ఆన్‌లైన్‌లో, యాప్‌స్టోర్‌లో పెగసెస్‌ అని కనిపిస్తే చాలు డౌన్‌లోన్‌ చేసేస్తున్నారు. ఇతరుల ఫోన్లు, వారి ఆంతరంగిక విషయాల్లో తలదూర్చేందుకు తెగ ప్రయత్నిస్తున్నారు.

స్టడీ మెటీరియల్‌ యాప్‌
కేరళలోని కోజికోడ్‌లో పెగాసస్‌ పేరుతో ఓ కోచింగ్‌ సెంటర్‌ ఉంది. దీని నిర్వాహకులు కేరళ పబ్లిక్‌ సర్వీస్‌ పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యే విద్యార్థుల కోసం చాన్నాళ్ల కిందట పెగసెస్‌ అనే పేరుతో ఓ ఆన్‌లైన్‌ యాప్‌ని రూపొందించారు. ఉద్యోగార్థులు ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని పరీక్షలకు ప్రిపేర్‌ అయ్యేవారు. అయితే గత నాలుగు రోజులుగా ఈ పెగసెస్‌ యాప్‌ డౌన్‌లోడ్‌లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. అంతకు ముందు వారానికి వెయ్యి డౌన్‌లోడ్‌లు ఉంటే పెగసెస్‌ వివాదం తెరపైకి వచ్చిన తర్వాత మూడు రోజుల్లోనే వేల మంది ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. కేరళలోనే కాదు సౌత్‌, నార్త్‌ తేడా లేకుండా ఇండియా అంతటా ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ పెరిగిపోయింది. 

నిఘా ఎలా ?
పెగాసస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నదే ఆలస్యం... వెంటనే తమ టార్గెట్‌ వ్యక్తుల ఫోన్లపై ఎలా నిఘా వేయాలా అని డౌన్‌లోడ్‌ చేసుకున్న వారు అనేక ప్రయత్నాలు చేశారు. అయితే ఆ యాప్‌లో కేవలం పబ్లిక్‌ సర్వీస్‌ ఎగ్జామ్స్‌ ప్రిపరేషన్‌ మెటీరియల్‌ ఉండటంతో వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో ఏకంగా యాప్‌ రూపొందించిన కోచింగ్‌ సెంటర్‌ నిర‍్వహకులకే ఫోన్లు చేయడం మొదలుపెట్టారు డౌన్‌లోడర్లు. పెగాసెస్‌ యాప్‌ను ఎలా మేనేజ్‌ చేయాలో... ఎలా నిఘా వేయాలో చెప్పాలంటూ ఒకరి తర్వాత ఒకరుగా కోచింగ్‌ సెంటర్లకు ఫోన్ల పరంపర పెరిగిపోయింది.

సంబంధం లేదు
దేశం నలుమూలల నుంచి ఒక్కసారిగా ఫోన్లు పెరిగిపోవడంతో... అందరికీ సమాధానం చెప్పలేక కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు మీడియా ముందుకు వచ్చారు. ఇజ్రాయిల్‌ స్పై వేర్‌ పెగాసస్‌కు తమకు ఎటువంటి సంబంధం లేదని, తమది కేవలం ఎగ్జామ్‌ మెటీరియల్‌ యాప్‌ మాత్రమే నంటూ వివరణ ఇచ్చారు. ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, ఇన్‌స్టాగ్రామ్‌ తదితర వేదికల్లోనూ ఇదే విషయాన్ని తెలియజేశారు. పెగసెస్‌ పేరు, యాప్‌ లోగోగా రెక్కల గుర్రం ఉండటంతో చాలా మంది తమది స్పై వేర్‌గా పొరపడినట్టు కోచింగ్‌ సెంటర్‌ నిర్వాహకులు తెలిపారు.


ప్రభుత్వాల మధ్యనే
టార్గెట్‌ పర్సన్‌ ఫోన్‌లోకి అత్యంత చాకచక్యంగా చొరబడి.. నిఘా ఉంచే సాఫ్ట్‌వేర్‌ పెగాసస్‌. ఇజ్రాయిల్‌ దేశానికి చెందిన ఈ సాఫ్ట్‌వేర్‌ లావాదేవీలు సార్వభౌమత్వం కలిగిన రెండే దేశాల మధ్యనే జరుగుతున్నాయి తప్పితే ప్రైవేటు వ్యక్తులు, సం‍స్థలకు ఈ సాఫ్ట్‌వేర్‌ యాక్సెస్‌ ఇవ్వలేదు. అయినా పెగాసస్‌తో ఇతరుల ఫోన్‌పై నిఘా వేయోచ్చు అనే ఒకే ఒక్క కారణంతో నెట్‌లో పెగాసెస్‌ గురించి మన వాళ్లు వెతికేస్తున్నారు. పెగాసెస్‌ పేరు కనిపిస్తే చాలు డౌన్‌లోడ్‌ చేసేస్తున్నారు.

మరిన్ని వార్తలు