ఆస్పత్రికి డబ్బుల్లేక చందాలు.. క్రికెటర్‌ క్రిస్‌ కెయిన్స్‌ జీవితం నేర్పే పాఠాలివే!

12 Aug, 2021 17:04 IST|Sakshi

ఇప్పుడు న్యూజిల్యాండ్‌ అంటే కెయిన్‌ విలియమ్సన్‌ గుర్తొస్తాడు. ముఖ్యంగా మన తెలుగు వాళ్లయితే ముద్దుగా కెన్‌ మామ అని పిలుస్తారు. కానీ కెయిన్‌ కంటే ముందే ఇండియన్ల మనసు దోచుకున్న క్రికెటర్‌ మరొకరు ఉన్నారు అతనే క్రిస్‌ కెయిన్‌. ఇండియాతో జరిగిన మ్యాచుల్ల్లో బ్యాటు, బాల్‌తో అద్భుత ప్రదర్శన చేసిన కెయిన్స్‌ మనకు ఓటమి రుచి చూపించాడు, కానీ నిజ జీవితంలో ఆర్థిక పాఠాలు నేర్చుకోలే తానే ఓటమి అంచున ఉన్నాడు. 

సాక్షి, వెబ్‌డెస్క్‌: ఓడలు బండ్లు.. బండ్లు ఓడలు అవ్వడం సహజమే. కానీ, దానికి కారణమయ్యే పరిస్థితులు మాత్రం మన చేతుల్లోనే ఉంటాయన్నది గుర్తుంచుకోవాల్సిన విషయం. సాధారణంగా డౌన్‌ టు హై సక్సెస్‌ స్టోరీలు మనిషికి ఒక ఊపుని ఇస్తే... హై టు డౌన్‌ స్టోరీలు గుణపాఠాలు నేర్పుతుంటాయి. క్రికెట్‌లో మంచి ఆల్‌రౌండర్‌గా పేరు తెచ్చుకున్న క్రిస్‌ కెయిన్స్‌ కథ.. రెండో కేటగిరీకి చెందిందే. రిటైర్‌ అయ్యాక విలాసాలకు బానిసై.. చివరికి రోడ్డున బస్సులు కడిగే స్థాయికి చేరుకుని వార్తల్లో నిలిచింది ఈ మాజీ ఆల్‌రౌండర్‌ జీవితం. 

న్యూజిల్యాండ్‌ స్టార్‌
హాలీవుడ్‌ హీరో లాంటి రూపం, రింగుల జుత్తు.. మీడియం పేస్‌తో తనకంటూ ఓ ప్రత్యేకమైన శైలిని ఏర్పరుచుకున్నాడు న్యూజిలాండ్‌ ఆల్‌రౌండర్‌ క్రిస్‌ కెయిన్స్‌. గాయాలు ఆయన కెరీర్‌ను కిందకి లాగేశాయి. దీంతో ఆడే వయసులో ఉండగానే 2006లో రిటైర్‌మెంట్‌ ప్రకటించాడు. అప్పటికే ఇటు టెస్టులు, వన్డేల్లో న్యూజిల్యాండ్‌ స్టార్‌ ఆటగాడు కెయిన్స్‌. ఆల్‌రౌండర్‌ ఇయాన్‌ బోథమ్‌ తర్వాత ఆ స్థాయిని అందుకున్న రెండో కివీస్‌ క్రికెటర్‌ తను ఎదిగాడు. 

పైసల్లేక
ఎలాంటి ఆర్థిక ప్రణాళిక లేకుండా గడిపేయడం క్రిస్‌ కెయిన్స్‌ జీవితాన్ని నిండా ముంచేసింది. ఒకప్పుడు నలుగురి మధ్య హుందాగా బతికిన కెయిన్స్‌ చివరకు బస్సులు కడిగే క్లీనర్‌ స్థాయికి చేరుకున్నాడు. గంటకు 17 డాలర్లు సంపాదించే జీవితంలో కొన్నాళ్లు గడిపాడు. క్రికెటర్‌గా రిటైర్‌మెంట్‌ ప్రకటించి డైమండ్‌ ట్రేడర్‌గా కొత్త మలుపు తీసుకున్న క్రిస్‌ కెయిన్స్‌ కెరీర్‌ దశాబ్దం తిరగకుండానే బస్సు డ్రైవర్‌ స్థాయికి చేరుకోవడం అప్పట్లో చర్చనీయాంశంగానే మారింది. ఈ క్రమంలో గుండెపోటుతో ఆస్పత్రిలో చేరి... ట్రీట్‌మెంట్‌ కోసం దాతల వైపు చూడాల్సిన దీనస్థితికి చేరుకున్నాడు. ఒకప్పుడు మూడున్నర క్యారెట్ల వజ్రాల రింగుతో తనకు ప్రపోజ్‌ చేసిన భర్త, ఆస్పత్రి ఖర్చులకు పైసా లేక ఇబ్బంది పడుతున్న తీరుని చూసి కెయిన్స్‌ భార్య మెలనీ కన్నీటి పర్యంతం అవుతోంది. 

అదుపులేని ఖర్చులతో
కెయిన్స్‌ వజ్రాల వ్యాపారిగా న్యూజిలాండ్‌లో ఓక్టగాన్‌ కంపెనీని సక్సెస్‌ఫుల్‌గానే నడిపించాడు. కానీ, డబ్బుని పొదుపు చేయడంలో ఘోరంగా విఫలం అయ్యాడు. వస్తున్న రాబడి చేస్తున్న ఖర్చులకు పొంతన లేని జీవితానికి అలవాటు పడ్డాడు. ముఖ్యంగా ఆకర్షణ మోజులో పడి అవసరం లేనివి కొనడం అతనికి వ్యసనంగా మారింది. చివరకు అదే కెయిన్స్‌ జీవితాన్ని నిండా ముంచింది. విలాసాలకు అలవాటుపడి అడ్డగోలుగా ఖర్చు పెట్టాడు. చివరకు రాబడి తక్కువ అప్పులు ఎక్కువ అయ్యే పరిస్థితి ఎదురైనా అతని తీరులో మార్పు రాలేదు. చివరకు భారీ నష్టాలతో డైమండ్‌ కంపెనీ మూసేయాల్సి వచ్చింది. ఇదంతా ఐదేళ్ల వ్యవధిలోనే జరిగిపోయింది. ఒక క్రీడాకారుడిగా గెలుపోటముల గురించి కెయిన్స్‌కి కొత్తగా చెప్పక్కర్లేదు. ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటే గెలుపును తన వశం చేసుకునేవాడు. కానీ అవసరాలు మించి ఖర్చు చేసే నైజం అతడిలోని స్పోర్ట్స్‌మన్‌ స్పిరిట్‌ని కూడా నాశనం చేసింది. అందువల్లే చిన్నాచితకా పనులు చేస్తూ సంపాదించిన డబ్బును నిర్లక్ష్యంగానే ఖర్చు చేశాడు. ఫలితంగా కనీసం ఇన్సురెన్స్‌ కూడా చేయించుకోలేదు. చివరకు ప్రాణాపాయ స్థితిలో మరొకరిపై ఆధారపడాల్సిన దుస్థితిలోకి తనంతట తానుగా వెళ్లి పోయాడు. 


 
 అవనసర ఖర్చులు వద్దు
అనవసర ఖర్చులకు తగ్గించుకోవడం ఎంతో అవసరం. ఆకర్షణల మోజులో పడి అనవసరమైన వస్తువులపై మన డబ్బులు వెచ్చించడం వల్ల తాత్కాలిక ప్రయోజానాలు తీరుతాయే తప్ప పెద్దగా ఉపయోగం ఉండదు. అందువల్లే మన ఆదాయం ఎంత, ఖర్చులు ఎంత, ఏ అంశాలపై ఎంత ఖర్చు చేస్తున్నామనే దానికి సంబంధించి స్పష్టమైన ప్రణాళిక వేసుకోవాలి. అనవసర ఖర్చులను సాధ్యమైనంతగా తగ్గించాలి. ఇది లోపించడం వల్ల క్రిస్‌ కెయిన్స్‌ దుర్భర పరిస్థితిల్లోకి జారుకున్నాడు.

ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు
ప్రముఖ ఆర్థిక నిపుణుడు రాబర్ట్‌ కియోసాకి అభిప్రాయం ప్రకారం మనం ఎంత సంపాదిస్తున్నామనేది ముఖ్యం కాదు. మనం ఎంత మిగుల్చుతున్నాం, సమయానికి అది మనకు ఎలా ఉపయోపడుతుంది, ఎన్ని తరాలకు సరిపడ డబ్బు మనదగ్గర ఉందని అనేదే ముఖ్యం. డబ్బును ఎక​‍్కువ కాలం పొదుపు చేయడం, జాగ్రత్త దాచడం అనేది డబ్బు సంపాదించడం కంటే ఎంతో కష్టమైన పని అని కియోసాకి అంటారు. కెయిన్స్‌ విషయంలో ఈ పొరపాటు నూటికి నూరుపాళ్లు జరిగింది. డబ్బు సంపాదిస్తున్నానే భ్రమలో పడి పొదుపు, చేయడం భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా దాచుకోవడంపై నిర్లక్షం చేశాడు. అందువల్లే పదేళ్లలోనే ఆకాశం నుంచి అథఃపాతాళానికి చేరుకున్నాడు.

ఖర్చులు కాదు పెట్టుబడి కావాలి
డబ్బును పెట్టుబడిగా మార్చితే డబ్బుని డబ్బే సంపాదిస్తుంది. అందుకు కావాల్సింది ఓపిక, సహానం. వెనువెంటనే లాభాలు వచ్చి పడాలి అన్నట్టుగా ఖర్చు పెట్టడం కాకుండా క్రమ పద్దతిలో పొదుపు చేసిన లేదా అందుబాటులో ఉన్న డబ్బును పెట్టుబడిగా మార్చితే లాంగ్‌ రన్‌లో ఆర్థికంగా దన్నుగా నిలుస్తుంది. వారెన్‌ బఫెట్‌ మొదలు ఎందరో కుబేరులు ఈ సూత్రం ఆధారంగానే కోటీశ్వరులు అయ్యారు. ఉదాహరణకు 12 శాతం రిటర్నలు వస్తాయనే నమ్మకంతో ప్రతీనెల రూ.5000 వంతున మార్కెట్‌లో పెట్టుబడిగా పెడితే 20 ఏళ్లు తిరిగే సరికి 12 లక్షల పెట్టుబడి మీద 37 లక్షల రిటర్న్‌ దక్కుతుంది. మొత్తంగా ఇరవై ఏళ్లు పూర్తయ్యే సరికి 50 లక్షల రూపాయలు మనకు అండగా ఉంటాయి. అయితే కెయిన్స్‌ పెట్టుబడులు పెట్టకుండా ఖర్చులు పెట్టుకుంటూ పోయాడు. దీంతో రివర్స్‌ పద్దతిలో పదేళ్లు పూర్తవకముందే చేతిలో చిల్లిగవ్వ లేని స్థితికి చేరుకున్నాడు.

ఆలోచన ధోరణి మారాలి
డబ్బు సంపాదించాలంటే ఏళ్లు పట్టవచ్చు, కానీ దాన్ని కోల్పోవడానికి క్షణాలు చాలు. కాబట్టి డబ్బు కంటే ముఖ్యమైంది మన ఆలోచనా ధోరణి. పేదరికం, డబ్బు పట్ల మనకున్న దృక్పథం. మన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చలేము అనుకుంటూ అలానే ఉండిపోతాం. అలా కాకుండా ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకోవాలంటే అన్ని విషయాలు మనకే తెలియక్కర్లేదు. ఆర్థిక నిపుణులను కలిస్తే మన ఆదాయానికి తగ్గట్టుగా  పెట్టుబడి ఎలా పెట్టాలో చెబుతారు. వాటిని పాటించినా చాలా వరకు ఆర్థిక ఇబ్బందులు తప్పించుకోవచ్చు. క్రీడాకారుడిగా అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కెయిన్స్‌ అడిగితే ఆర్థిక సలహాలు ఇచ్చే వారు కోకొల్లలు. కానీ తన చుట్టూ ఉన్న పరిస్థితులు మార్చాలని అతను బలంగా కోరుకోలేదు. అందుకే స్టార్‌ క్రికెటర్‌ నుంచి  క్లీనర్‌గా, ట్రక్‌ డ్రైవర్‌గా దిగజారిపోతూనే వచ్చాడు.
 

మరిన్ని వార్తలు