జీడీపీలో వ్యక్తిగత ఆదాయపు పన్ను నిష్పత్తి 3% అప్‌

9 May, 2023 04:59 IST|Sakshi

2014–15లో ఈ నిష్పత్తి 2.11 శాతం

సీబీడీటీలో ఆర్థికమంత్రి సమీక్షా సమావేశం

న్యూఢిల్లీ: భారత్‌ వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు దేశ 2021–22  స్థూల దేశీయోత్పత్తిలో 2.94 శాతానికి చేరాయి. 2014–15లో ఈ నిష్పత్తి  2.11 శాతంగా ఉంది. ఆర్థిక శాఖ ఒక ప్రకటనలో ఈ విషయాన్ని తెలిపింది.  ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ప్రస్తుత ప్రభుత్వం తీసుకున్న చర్యల ఫలితంగా పన్ను చెల్లింపుదారుల సంఖ్య విస్తరిస్తున్నట్లు ఈ గణాంకాలు సూచిస్తున్నాయని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.

  పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడానికి తీసుకున్న వివిధ చర్యల ప్రభావం గురించి ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డ్‌  (సీబీడీటీ)తో జరిగిన సమీక్షా సమావేశంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు వివరించినట్లు ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఆర్థిక మంత్రిత్వశాఖ ప్రకటన ప్రకారం, 2014–15లో వ్యక్తిగత ఆదాయపు పన్ను వసూళ్లు (సెక్యూరిటీస్‌ లావాదేవీల పన్ను) రూ.2.65 లక్షల కోట్లుకాగా,  ఈ పరిమాణం రూ.6.96 లక్షల కోట్లకు చేరింది.

ఇక తాజాగా ‘న్యూ ట్యాక్స్‌ డిడక్టెడ్‌ యట్‌ సోర్స్‌ (టీడీఎస్‌) కోడ్స్‌ తీసుకురాడంతో ఈ లావాదేవీ సంఖ్య దాదాపు రెట్టింపై 70 కోట్ల నుంచి (2015–16 ఆర్థిక సంవత్సరంలో)144 కోట్లకు (2021–22 ఆర్థిక సంవత్సరం) ఎగసింది.

సత్వర నిర్ణయాలు అవసరం: సీతారామన్‌
పన్ను చెల్లింపుదారుల సంఖ్యను పెంచడం, పెండింగులో ఉన్న న్యాయ వివాదాల పరిష్కారం, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని కొన్ని సెక్షన్ల కింద రాయితీల మంజూరు వంటి పలు అంశాలపై  సీబీడీటీ అధికారులతో ఆర్థిక మంత్రి సమీక్షా సమావేశం చర్చించింది.   పన్ను చెల్లింపుదారులు దాఖలు చేసిన అన్ని దరఖాస్తులపై సీబీడీటీ సకాలంలో తగిన చర్యలను, నిర్ణయాలను తీసుకోవాలని, ఆయా దరఖాస్తులను పరిష్కరించడానికి తగిన కాలపరిమితిని నిర్దేశించుకోవాలని ఆర్థిక మంత్రి ఉద్ఘాటించారు. ప్రత్యక్ష పన్ను చట్టాలు, నియమ–నిబంధనలకు సంబంధించి పన్ను చెల్లింపుదారుల్లో అవగాహనను పెంచడానికి  ప్రయత్నాలను విస్తరించాలని కూడా సీబీడీటీకి ఆమె సూచించారు.  ఆర్థిక మంత్రితో జరిగిన సీబీడీటీ సమీక్షా సమావేశంలో రెవెన్యూ కార్యదర్శి సంజయ్‌ మల్హోత్రా, బోర్డ్‌ చైర్మన్‌ నితిన్‌ గుప్తా తదితర సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు