ఆల్‌టైం గరిష్టానికి పెట్రో ధరలు

24 Jan, 2021 04:56 IST|Sakshi

లీటర్‌ పెట్రోల్‌ ఢిల్లీలో రూ.85.70: ముంబైలో రూ.92.28

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్‌ ధరలు భగ్గుమంటున్నాయి. ఈ వారంలో వరుసగా నాలుగోసారి మునుపెన్నడూ లేనంత గరిష్ట స్థాయికి చేరాయి. శనివారం పెట్రోల్, డీజిల్‌ ధరలు లీటర్‌పై 25 పైసల చొప్పున ఎగబాకాయి. చమురు సంస్థల నోటిఫికేషన్‌ ప్రకారం..లీటర్‌ పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.85.70 కాగా, ముంబైలో 92.28కి చేరింది. అదేవిధంగా, లీటర్‌ డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.75.88, ముంబైలో రూ.82.66గా ఉంది. ధరలు ఇలా పైకి ఎగబాకటం వరుసగా నాలుగో వారంలో రెండో రోజు. ఈ వారంలో పెట్రో ధరలు లీటర్‌కు రూ.1 చొప్పున పెరిగాయి.

విదేశీ మారక ద్రవ్యం రేట్లు, అంతర్జాతీయ బెంచ్‌మార్క్‌ ధర ఆధారంగా ప్రభుత్వ రంగ ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ జనవరి 6 నుంచి పెట్రో ధరలను ఏరోజుకారోజు సవరిస్తున్నాయి. అప్పటి నుంచి లీటర్‌కు పెట్రోల్‌ ధర రూ.1.99, డీజిల్‌ ధర రూ.2.01 మేర పెరిగాయి. సేల్స్‌ ట్యాక్స్, వ్యాట్‌ల కారణంగా ఇంధన ధరలు రాష్ట్రానికో విధంగా ఉంటున్నాయి. సౌదీ అరేబియా చమురు ఉత్పత్తిలో విధించడమే ధరల్లో పెరుగుదలకు కారణమని ఆరోపిస్తున్న చమురు శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌..పన్నుల్లో కోత విషయమై ఎలాంటి భరోసా ఇవ్వకపోవడం గమనార్హం. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ పంపిణీ ప్రారంభమయ్యాక డిమాండ్‌ తిరిగి పుంజుకోవడంతో భారత్‌తోపాటు అంతర్జాతీయంగా చమురు ధరలు ఎగబాకుతున్నాయి. 

మరిన్ని వార్తలు