Fuel Rates 29, 2022: పెట్రో బాదుడు.. ఎనిమిది రోజుల్లు రూ.6కి పైగా పెంపు.. ఇక్కడితో ఆగేలా లేదు

29 Mar, 2022 09:18 IST|Sakshi

అంతర్జాతీయ ధరల పేరు చెప్పి చమురు కంపెనీలు షాకుల మీద షాకులు ఇస్తున్నాయి. వరుసగా ఎనిమిది రోజుల్లో ఏడోసారి పెట్రోల్‌, డీజిల్‌ రేట్లు పెంచాయి. 2022 మార్చి 29న లీటరు పెట్రోలుపై 90 పైసలు, డీజిల్‌పై 76 పైసల వంతున ధరను పెంచాయి. తాజాగా సవరణలతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ. 113.61కి చేరుకోగా డీజిల్‌ ధర రూ.99.83ని టచ్‌ చేసింది. రేపోమాపో డీజిల్‌ ధర హైదరాబాద్‌లో వంద రూపాయలను క్రాస్‌ చేయడం ఖాయమనే పరిస్థితి నెలకొంది.

ఐదు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో 2021 నవంబరు రెండో వారం నుంచి 2022 మార్చి మూడో వారం వరకు పెట్రోలు, డీజిల్‌ ధరలను ప్రభుత్వం పెంచలేదు. అప్పటికే అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగినా ప్రభుత్వం ఆ భారాన్ని ప్రజలపై మోపలేదు. ఇక ఉక్రెయిన్‌ యుద్ధం తర్వాత ఓ దశలో బ్యారెల్‌ క్రూడ్‌ ఆయిల్‌ ధర 139 డాలర్లకు చేరుకున్నా.. ప్రభుత్వం మిన్నకుండిపోయింది. పెరిగిన ముడి చమురు ధర భారాన్ని బల్క్‌ డీజిల్‌పైకి మోపి సర్థుబాటు చేసింది. 

ఇక ఎన్నికలు ముగిసిన తర్వాత నుంచి పెట్రో బాదుడు మొదలైంది. కేవలం ఎనిమిది రోజుల వ్యవధిలో ఏకంగా ఏడు సార్లు పెట్రోలు , డీజిల్‌ ధరలను పెంచింది. పెట్రోలుపై ప్రతీ రోజు సగటున 90 పైసల వంతున ఏడు సార్లు పెంచడంతో కేవలం వారం రోజుల వ్యవధిలో లీటరు పెట్రోలు ధర రూ.6.30 వంతున పెరిగింది.

చైనాలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత రెండు రోజులుగా అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ ఆయిల్‌ ధర తగ్గుతోంది. వారం క్రితం బ్యారెల్‌ ధర 120 డాలర్లు ఉండగా చైనా పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం 108 డాలర్ల దగ్గర కొనసాగుతోంది. ఐనప్పటికీ గతంలో వచ్చిన నష్టాలను పూడ్చుకునేందుకు చమురు సంస్థలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి.

మరిన్ని వార్తలు