రెండో రోజూ పెట్రో ధరల వడ్డింపు

21 Nov, 2020 13:32 IST|Sakshi

లీటర్‌ పెట్రోల్‌పై 15-20 పైసల పెంపు

15-25 పైసలు పెరిగిన డీజిల్‌ లీటర్‌ ధర

న్యూఢిల్లీ, సాక్షి: వరుసగా రెండో రోజు పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగాయి. దేశంలోని ప్రధాన మెట్రో నగరాలలో సగటున 15-25 పైసల మధ్య ధరలు ఎగశాయి. తాజాగా న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 15 పైసలు పెరిగి 81.38ను తాకింది. ఈ బాటలో డీజిల్‌ ధరలు సైతం లీటర్‌కు 20 పైసలు అధికమై 70.88కు చేరాయి. ఇదే విధంగా ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ 17 పైసలు పెరిగి రూ. 88.09కు చేరగా.. డీజిల్‌ 23 పైసలు పెరిగి రూ. 77.34ను తాకింది. చెన్నైలో పెట్రోల్‌ ధర 15పైసలు బలపడి రూ. 84.46కాగా.. డీజిల్ 20 పైసలు పెరిగి రూ. 76.37కు చేరింది. ఇక కోల్‌కతాలో పెట్రోల్‌ ధర 16 పైసలు బలపడి రూ. 82.95ను తాకగా.. డీజిల్‌ 21 పైసలు హెచ్చి రూ. 74.45కు చేరింది. ముందు రోజు సైతం పెట్రోల్‌, డీజిల్‌ ధరలు లీటర్‌కు 17-28 పైసల స్థాయిలో ఎగసిన విషయం విదితమే. వ్యాట్‌ తదితరాల నేపథ్యంలో రాష్ట్రాలవారీగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలలో వ్యత్యాసాలు నమోదవుతుంటాయి. పెట్రోల్‌, డీజిల్‌ ధరల్లో వివిధ పన్నులే 70 శాతం వరకూ వాటాను ఆక్రమిస్తుంటాయని ఈ సందర్భంగా పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. సుమారు 48 రోజులపాటు నిలకడను ప్రదర్శించిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తిరిగి శుక్రవారం నుంచి పెరుగుతూ వస్తున్నాయి!

విదేశీ ఎఫెక్ట్
విదేశీ మార్కెట్లో ముడిచమురు ధరల ఆధారంగా దేశీయంగా పెట్రో ఉత్పత్తుల ధరలను ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు సవరిస్తుంటాయి. రెండు వారాల సగటు ధరలు, రూపాయి మారకం తదితర అంశాలు ఇందుకు పరిగణిస్తుంటాయి. కాగా.. శుక్రవారం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ దాదాపు 2 శాతం జంప్‌చేసి 45 డాలర్ల చేరువలో ముగిసింది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ సైతం 1 శాతం ఎగసి 42.15 డాలర్ల వద్ద స్థిరపడింది. డాలరుతో మారకంలో రూపాయి విలువ, దేశీయంగా పన్నులు తదితర పలు అంశాలు ఇండియన్‌ క్రూడ్‌ బాస్కెట్‌ ధరలను ప్రభావితం చేసే సంగతి తెలిసిందే. ఈ అంశాల ఆధారంగా పెట్రోల్‌, డీజిల్‌ ధరలను చమురు పీఎస్‌యూలు.. బీపీసీఎల్‌, హెచ్‌పీసీఎల్‌, ఐవోసీ సవరిస్తుంటాయి.

>
మరిన్ని వార్తలు