వాహనదారులకు షాకింగ్‌ న్యూస్‌...!

18 Sep, 2021 17:26 IST|Sakshi

న్యూఢిల్లీ:  ఆకాశమే హద్దుగా పెరుగుతున్న ఇంధన ధరలతో సామన్యుడికి చుక్కలు కన్పిస్తున్నాయి. గత పన్నెండు రోజుల నుంచి ఇంధన ధరల్లో ఎలాంటి మార్పులు లేవు.దీంతో వాహనదారులకు కాస్త ఉపశమనం లభించింది. తాజాగా అంతర్జాతీయ మార్కెట్లలో ముడి చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. దీంతో రానున్న రోజుల్లో వాహనదారులకు మరోసారి ఇక్కట్లు మొదలుకానున్నాయి. పెట్రోల్‌, డిజీల్‌ ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మార్కెట్లలో చమురు ధరల పెరుగుదల ఇంధన రిటైల్ విక్రయ ధరల పెరుగుదలకు దారితీస్తుంది.  
చదవండి: మిస్డ్‌ కాల్‌తో గ్యాస్‌ కనెక్షన్‌

భారీగా పెరిగిన బారెల్‌ ధరలు...!
అంతర్జాతీయ మార్కెట్లో ప్రస్తుత పెట్రోల్ , డీజిల్ ధరలు ఆగస్టు సగటు ధరలతో పోలిస్తే బ్యారెల్‌కు సుమారు 4-6 డాలర్లు ఎక్కువగా ఉన్నాయి. కాగా, రిటైల్ ధరల పెరుగుదలపై ఇప్పటివరకు చమురు కంపెనీలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. ఒకవేళ అంతర్జాతీయ మార్కెట్లలో ఇంధన ధరలు ఇదే స్థాయిలో ఉంటే..ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు (ఓఎమ్‌సీ) పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాల్సి ఉంటుందని నిపుణులు భావిస్తున్నారు. ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు చివరగా ఈ ఏడాది జూలై 15, 17 తేదిల్లో పెట్రోల్, డీజిల్ రిటైల్ ధరలను పెంచాయి. 

ఢిల్లీలో పెట్రోల్‌, డిజీల్‌ ధరలు వరుసగా రూ.101.19, రూ. 88.62 గా ఉన్నాయి. గత నెలతో పోలిస్తే సగటు అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఆగస్టులో బ్యారెల్‌కు మూడు డాలర్లకంటే తక్కువగా నమోదయ్యాయి. యుఎస్, చైనా మిశ్రమ ఆర్థిక డేటా, వేగంగా విస్తరిస్తున్న డెల్టా వేరియంట్  కారణంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ఇంధన ధరలు భారీగా తగ్గాయి. దీని ప్రకారం, జూలై 18 నుంచి చమురు మార్కెటింగ్ కంపెనీలు భారత మార్కెట్లో పెట్రోల్ , డీజిల్ రిటైల్ ధరలను వరుసగా లీటరుకు రూ. 0.65,రూ. 1.25 కు తగ్గించాయి. అంతర్జాతీయ మార్కెట్లోని తాజా పరిణామాలతో ముడి చమురు ధరలు ఆగస్టు చివరి వారం నుంచి స్థిరంగా పెరుగుతున్నాయి. దీంతో ఇంధన ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు నిపుణులు భావిస్తున్నారు. 
చదవండి: సామాన్యుడికి షాక్‌​.. మళ్లీ పెరిగిన గ్యాస్‌ ధర.. ఏడాదిలో ఐదోసారి

మరిన్ని వార్తలు