జూన్‌లో ఇంధన అమ్మకాలు జూమ్‌..

4 Jul, 2022 04:16 IST|Sakshi

కరోనా పూర్వ స్థాయికి పెట్రోల్, డీజిల్‌ డిమాండ్‌

న్యూఢిల్లీ: పంటల సీజన్, ప్రయాణాలు, ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్న నేపథ్యంలో ఇంధన విక్రయాలు పెరుగుతున్నాయి. జూన్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు భారీగా పెరిగాయి. పరిశ్రమ గణాంకాల ప్రకారం.. పంటల సీజన్‌ ప్రారంభ దశ కావడంతో డీజిల్‌ విక్రయాలు కరోనా ముందు స్థాయికి ఎగిశాయి. రెండంకెల స్థాయి వృద్ధి నమోదు చేశాయి. జూన్‌లో డీజిల్‌ అమ్మకాలు (2021 జూన్‌తో పోలిస్తే) 35.2 శాతం పెరిగి, 7.38 మిలియన్‌ టన్నులకు చేరాయి.

2019 జూన్‌తో (కరోనా పూర్వం) పోలిస్తే ఇది 10.5 శాతం, 2020 జూన్‌తో పోలిస్తే 33.3 శాతం ఎక్కువ. అలాగే ఈ ఏడాది మేలో నమోదైన 6.7 మిలియన్‌ టన్నులతో పోలిస్తే 11.5 శాతం అధికం. వ్యవసాయం, రవాణా రంగాల్లో వినియోగం పెరగడం వల్ల డీజిల్‌కు డిమాండ్‌ ఎగిసిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. మరోవైపు, ప్రభుత్వ రంగ రిటైల్‌ సంస్థల్లో పెట్రోల్‌ విక్రయాలు జూన్‌లో 29 శాతం పెరిగి 2.8 మిలియన్‌ టన్నులకు చేరాయి.

2020 జూన్‌తో పోలిస్తే ఇది 36.7 శాతం, 2019 అదే నెలతో పోలిస్తే 16.5 శాతం అధికం. నెలవారీగా చూస్తే 3.1 శాతం ఎక్కువ. గతేడాది ఇదే వ్యవధిలో బేస్‌ తక్కువగా నమోదు కావడం కూడా జూన్‌లో గణాంకాలు మెరుగ్గా ఉండటానికి కారణమని పరిశ్రమ వర్గాలు వివరించాయి. అటు, గత నెల వంట గ్యాస్‌ అమ్మకాలు స్వల్పంగా 0.23 శాతం పెరిగి 2.26 మిలియన్‌ టన్నులకు చేరాయి. విమానయాన రంగం రెండేళ్ల తర్వాత పూర్తి స్థాయిలో కార్యకలాపాలు ప్రారంభిస్తుండటంతో విమాన ఇంధనం (ఏటీఎఫ్‌) విక్రయాలు రెట్టింపై 5,35,900 టన్నులుగా నమోదయ్యాయి.

విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌తో సుంకాల నష్టం దాదాపు భర్తీ ..
దేశీయంగా ఉత్పత్తయ్యే, విదేశాలకు ఎగుమతి చేసే చమురుపై విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ విధించడం ద్వారా ప్రభుత్వ ఖజానాకు భారీగానే దఖలు పడనుంది. దీంతో పెట్రోల్, డీజిల్‌పై సుంకాల తగ్గింపు వల్ల వాటిల్లే సుమారు రూ. 1 లక్ష కోట్ల నష్టాన్ని నాలుగింట మూడొంతుల మేర ప్రభుత్వం భర్తీ చేసుకోనుందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కంపెనీలు ప్రత్యేకంగా ఎటువంటి పెట్టుబడులు పెట్టకుండా, ధరలు అనూహ్యంగా పెరగడం వల్ల పొందే భారీ లాభాలపై విధించే పన్నును విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌గా పరిగణిస్తారు. విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌ను ఈ ఆర్థిక సంవత్సరం ఆఖరు దాకా కొనసాగించిన పక్షంలో ఖజానాకు కనీసం రూ. 72,000 కోట్ల మేర ఆదాయం రావచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి.  

మరిన్ని వార్తలు