రెండంకెల స్థాయిలో ఇంధన విక్రయాల వృద్ధి

2 Dec, 2022 06:15 IST|Sakshi

నవంబర్‌లో పెట్రోల్‌ అమ్మకాలు 12 శాతం, డీజిల్‌ విక్రయాలు 28 శాతం అప్‌

న్యూఢిల్లీ: పండుగల సీజన్‌లో కార్యకలాపాలు మరింత పుంజుకోవడం, వ్యవసాయ రంగంలో డిమాండ్‌ పెరగడంతో నవంబర్‌లో దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు గణనీయంగా వృద్ధి చెందాయి. రెండంకెల స్థాయిలో పెరిగాయి. గతేడాది నవంబర్‌తో పోలిస్తే ఈసారి పెట్రోల్‌ అమ్మకాలు 11.7 శాతం పెరిగి 2.66 మిలియన్‌ టన్నులకు, డీజిల్‌ విక్రయాలు 27.6 శాతం వృద్ధి చెంది 7.32 మిలియన్‌ టన్నులుగా నమోదయ్యాయి. కోవిడ్‌ కష్టకాలమైన 2020 నవంబర్‌తో పోలిస్తే పెట్రోల్‌ అమ్మకాలు 10.7 శాతం, కోవిడ్‌ పూర్వం 2019 నవంబర్‌తో పోలిస్తే 16.2 శాతం పెరిగాయి. అటు డీజిల్‌ విక్రయాలు 17.4 శాతం (2020 నవంబర్‌తో పోలిస్తే), 9.4 శాతం (2019 నవంబర్‌తో పోలిస్తే) పెరిగాయి.

జూన్‌ నుండి పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలు భారీగా పెరుగుతున్నాయి. పంటల సీజన్‌ కావడంతో డీజిల్‌కు డిమాండ్‌ గణనీయంగా ఉంటోందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. సాగు నీటి పంపులు, ట్రక్కుల్లో ఇంధనాల వినియోగం ఎక్కువగా పెరిగిందని వివరించాయి.   విమాన ప్రయాణాలు కూడా పుంజుకుంటూ ఉండటంతో విమాన ఇంధన (ఏటీఎఫ్‌) విక్రయాలు సైతం గత నవంబర్‌తో పోలిస్తే ఈసారి 21.5 శాతం పెరిగి 5,72,200 టన్నులకు చేరాయి. అయితే, కోవిడ్‌ పూర్వం నవంబర్‌ (2019)తో పోలిస్తే మాత్రం 13.3 శాతం తక్కువగా నమోదయ్యాయి. దేశీయంగా విమాన ప్రయాణాలు కోవిడ్‌ పూర్వ స్థాయులకు చేరినప్పటికీ కొన్ని దేశాల్లో ఇంకా ఆంక్షలు కొనసాగుతుండటంతో అంతర్జాతీయ ప్రయాణాల ట్రాఫిక్‌ కాస్త తక్కువగానే ఉంటోందని పరిశ్రమ వర్గాలు వివరించాయి.  

ఏటీఎఫ్‌ ధర తగ్గింపు ..
అంతర్జాతీయంగా క్రూడాయిల్‌ రేట్లు తగ్గడంతో ప్రభుత్వ రంగ చమురు రిటైల్‌ కంపెనీలు ఏటీఎఫ్‌ రేటును గురువారం 2.3 శాతం తగ్గించాయి. అయితే, పెట్రోల్, డీజిల్‌ రేట్లను మాత్రం వరుసగా ఎనిమిదో నెలా సవరించకుండా, యథాతధంగా ఉంచాయి. తాజా తగ్గింపుతో ఏటీఎఫ్‌ రేటు ఢిల్లీలో కిలోలీటరుకు రూ. 2,775 తగ్గి రూ. 1,17,588కి చేరింది. గత నెల కూడా ఆయిల్‌ కంపెనీలు విమాన ఇంధనం రేటును 4.19 శాతం (రూ. 4,842) తగ్గించాయి. విమానయాన కంపెనీల నిర్వహణ వ్యయా ల్లో 40 శాతం వాటా ఇంధనానిదే ఉంటుంది. ఈ నేపథ్యంలో తాజా తగ్గింపులు వాటికి కొంత ఊరటనివ్వనున్నాయి. ఏటీఎఫ్‌ రేటును ఆయిల్‌ కంపెనీ లు ప్రతి నెలా 1వ తారీఖున సమీక్షిస్తాయి. పెట్రో ల్, డీజిల్‌ రేట్లను అవి ఏప్రిల్‌ 6 నుండి సవరించలేదు.   
విండ్‌ఫాల్‌ లాభాలపై పన్ను సగానికి తగ్గింపు

డీజిల్‌ ఎగుమతుల లెవీపై ఊరట
అంతర్జాతీయంగా రేట్ల అనూహ్య పెరుగుదలతో, దేశీ చమురు ఉత్పత్తి దారులకు వచ్చే భారీ లాభాలపై (విండ్‌ఫాల్‌ ట్యాక్స్‌) పన్నును కేంద్ర ప్రభుత్వం సగానికి తగ్గించింది. అలాగే, డీజిల్‌ ఎగుమతులపైనా లెవీని తగ్గిస్తూ నిర్ణయం తీసు­కుంది. ఓఎన్‌జీసీ తదితర సంస్థలు ఉత్పత్తి చేసే టన్ను చమురుపై ప్రస్తుతం రూ.10,200గా ఉన్న పన్నును రూ.4,900కు తగ్గించింది. లీటర్‌ డీజిల్‌ ఎగుమతిపై లెవీని 10.5 నుంచి 8కి తగ్గించింది. ఏటీఎఫ్‌పై అదనపు ఎక్సైజ్‌ డ్యూటీ లీటర్‌కు రూ.5గా కొనసాగనుంది. మొదట పెట్రోల్‌ ఎగుమతులైనా కేంద్రం లెవీ విధించగా, తర్వాత దాన్ని ఎత్తివేయడం గమనార్హం. ఉక్రెయిన్‌పై రష్యా యు ద్ధం తర్వాత అంతర్జాతీయంగా చమురు ఉత్పత్తి, సరఫరా తగ్గిపోయి, ధరలు గణనీయంగా పెరిగిపోవడం తెలిసిందే. ఈ పరిణా మం దేశీ చమురు ఉత్పత్తి కంపెనీలకు అనూహ్య లాభాలు వచ్చేందుకు దారితీసింది. దీంతో కేంద్ర ప్రభుత్వం విండ్‌ఫాల్‌ పన్నును ప్రవేశపెట్టడం తెలిసిందే.

>
మరిన్ని వార్తలు