ఢిల్లీలో లీటరు పెట్రోలుపై రూ.8 తగ్గింపు.. కారణం ఇదే

1 Dec, 2021 12:37 IST|Sakshi

Petrol Price In Delhi NCR to get cheaper by Rs.8 per litre: ఢిల్లీ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి అర్వింద్‌ కేజ్రీవాల్‌ తీపి కబురు చెప్పారు. పెరిగిన ఫ్యూయల్‌ ధరలతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకున్నారు. పెట్రోవాత నుంచి ఉపశమనం కలిగించే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్‌ (వాల్యూ యాడెడ్‌ ట్యాక్స్‌) తగ్గించాలని బుధవారం జరిగిన కేబినేట్‌ సమావేశంలో ఢిల్లీ సర్కారు నిర్ణయం తీసుకుంది.

లీటరుపై రూ. 8 వరకు తగ్గింపు
పెట్రోల్ ధరలపై ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌పై ప్రస్తుతం ఢిల్లీ సర్కారు అమలు చేస్తోన్న వ్యాట్‌ను  30 శాతం నుంచి 19.40 శాతానికి తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. దీని వల్ల లీటరు పెట్రోలు ధర ఇంచుమించు రూ.8 వరకు తగ్గనుంది. 2021 డిసెంబరు 1 అర్థరాత్రి 12 గంటల నుంచి ఈ కొత్త తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయని ఢిల్లీ సర్కారు తెలిపింది. 

వారి వల్లే
ఢిల్లీ నగర పరిధిలో హర్యాణా, ఉత్తర్‌ప్రదేశ్‌ రాష్ట్రాలు కూడా ఉన్నాయి. ఇటీవల కేంద్రం పెట్రోలు, డీజిల్‌లపై ఎక్సైజ్‌ డ్యూటీని రూ.5 తగ్గించింది. ఆ తర్వాత వ్యాట్‌ తగ్గించుకోవాలంటూ రాష్ట్రాలకు సూచించింది. దీంతో బీజేపీ ఏలుబడిలో ఉన్న ఉత్తరప్రదేశ్‌ , హర్యాణా రాష్ట్రాలు వ్యాట్‌ను తగ్గించాయి. దీంతో ఢిల్లీ నేషనల్‌ క్యాపిటల్‌ రీజియన్‌ పరిధిలో పెట్రోలు, డీజిల్‌ ధరలు ఒక్కో ప్రాంతంలో ఒక్క రకంగా ఉంటున్నాయి. లీటరు పెట్రోలు ధర ఢిల్లీలో రూ. 103.97 ఉండగా నోయిడా (యూపీ)లో రూ.95.51, గురుగ్రామ్‌ (హర్యాణా)లో రూ. 95.90లుగా ఉంది. దీంతో పెట్రోలు రేటులో ఏకరూపత తెచ్చేందుకు ఆప్‌ సర్కారు ఈ నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.94 దగ్గరగా ఉండనుంది.

చదవండి‘ఇలా చేస్తే పెట్రోలు ధరలు తగ్గుతాయి’ కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు