పండగనాడు వదల్లేదు.. మళ్లీ బాదేశారు

15 Oct, 2021 10:27 IST|Sakshi

Petrol Prices : పండగ పబ్బం అనే తేడా లేకుండా చమురు కంపెనీలు ప్రజలపై భారం మోపుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో చీమ చిటుక్కుమంటే చాలు ఆ ప్రభావం ఇక్కడి ప్రజలపై కనిపించేలా నిర్ణయాలు తీసుకుంటుంది. లీటరు పెట్రోలుపై 36 పైసలు, లీటరు డీజిల్‌పై 38 పైసల వంతున ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో హైదరాబాద్‌లో లీటరు పెట్రోలు ధర రూ.109.33కి చేరుకోగా డీజిల్‌ ధర రూ.102.38 పైసలుగా నమోదు అయ్యింది.

15 రోజులు 13 సార్లు
అక్టోబరు నెల వచ్చింది మొదలు పెట్రోలు ధర పిడుగులు సామాన్యుల నెత్తిపై పడుతూనే ఉన్నాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరగడం సాకుగా చూపుతూ గడిచిన 15 రోజుల్లో 13 సార్లు పెట్రోలు ధరలను చమురు కంపెనీలు పెంచాయి. దీంతో ఈ నెలలోనే దాదాపు లీటరు పెట్రోలు ధర ఐదు రూపాయలు, డీజిల్‌ ధర నాలుగు రూపాయల వరకు పెరిగినట్టయ్యింది. కేవలం అక్టోబరు 12, 13 తేదీల్లోనే పెట్రోలు ధరల పెంపు నుంచి సామాన్యులు తప్పించుకున్నారు.

ఐదు నెలల్లో రూ.12 
బెంగాల్‌ ఎన్నికలు ముగిసినప్పటి నుంచి ఇప్పటి వరకు గడిచిన ఐదు నెలల్లో చమురు కంపెనీలు పెట్రోలు ధరలు పెంచుతూ పోతున్నాయి. ఒక్క సెప్టెంబరు నెలలలోనే రెండు వారాల పాటు ఈ ధరాఘాతం నుంచి విముక్తి లభించింది. మిగిలిన ఐదు నెలల కాలంలో రోజు విడిచి రోజు లేదా వారానికి రెండు మూడు సార్లయినా ధరలు పెంచాయి చమురు కంపెనీలు. మొత్తంగా గడిచిన ఐదు నెలల్లో లీటరు పెట్రోలు ధర రూ.11.44 పెరగగా లీటరు డీజిల్‌ ధర రూ.9.14 పెరిగింది.
 

మరిన్ని వార్తలు