Petrol Diesel:రాకెట్‌లా పెట్రోల్‌,డిజీల్‌ ధరలు..రూ.15 నుంచి రూ.20కి పెరిగే ఛాన్స్‌!

26 Mar, 2022 12:31 IST|Sakshi

న్యూఢిల్లీ: అంతర్జాతీయ మార్కెట్‌కు అనుగుణంగా ఎప్పటికప్పుడు ధరలను పెంచనందుకు ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలైన హెచ్‌పీసీఎల్, ఐవోసీ, బీపీసీఎల్‌ ఏకంగా 2.25 బిలియన్‌ డాలర్ల (రూ.16,875 కోట్లు) ఆదాయాన్ని నష్టపోయాయి. ఈ మూడు సంస్థల ఎబిట్డాలో ఇది 20 శాతానికి సమానం. ఐదు రాష్ట్రాల ఎన్నికల ముందు నాలుగు నెలల పాటు పెట్రోల్, డీజిల్‌ ధరలను ఆయిల్‌ కంపెనీలు సవరించకుండా ఒకే ధరను కొనసాగించడం తెలిసిందే. 137 రోజుల పాటు ధరలను సవరించలేదు. బ్యారెల్‌ క్రూడ్‌ 82 డాలర్ల వద్ద చివరిగా ధరలను సవరించగా.. 120 డాలర్లకు పెరిగిపోయినా కానీ, అవే రేట్లను కొనసాగించాయి. 

నిత్యం రూ.525 కోట్ల నష్టం.. 
‘‘ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు బ్యారెల్‌ చమురుపై 25 డాలర్ల ఆదాయాన్ని, పెట్రోల్, డీజిల్‌ విక్రయంపై 24 డాలర్ల నష్టాన్ని చూస్తున్నాయి. ఒకవేళ చమురు ధరలు బ్యారెల్‌కు సగటున 111 డాలర్ల వద్ద కొనసాగితే, పెరిగిన ధరల మేరకు విక్రయ రేట్లను సవరించకపోతే.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ రోజువారీగా పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలపై 65–70 మిలియన్‌ డాలర్లు (రూ.525 కోట్లు) నష్టాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది’’ అని మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తెలిపింది. మూడున్నర నెలల విరామం తర్వాత మార్చి 22 నుంచి ప్రభుత్వరంగ ఆయిల్‌ కంపెనీలు పెట్రోల్, డీజిల్‌ ధరలను రోజువారీగా సవరించాన్ని ప్రారంభించడం తెలిసిందే.  

మరింత పెంచాల్సిందే..! 
‘‘ముడి చమురు బ్యారెల్‌ ధర 110–120 డాలర్ల మధ్య కొనసాగితే ఆయిల్‌ కంపెనీలు లీటర్‌ డీజిల్‌పై రూ.13.10–24.90 మేర.. లీటర్‌ పెట్రోల్‌పై 10.60–22.30 చొప్పున ధరలను పెంచాల్సి వస్తుంది’’ అని కోటక్‌ ఇనిస్టిట్యూషనల్‌ ఈక్విటీస్‌ తెలిపింది. క్రిసిల్‌ రీసెర్చ్‌ విశ్లేషణ ప్రకారం చూసినా.. ముడి చమురు బ్యారెల్‌ 100 డాలర్ల వద్ద సగటున ఉంటే పెట్రోల్, డీజిల్‌కు లీటర్‌పై రూ.9–12 మేర, 110–120 డాలర్ల మధ్య ఉంటే రూ.15–20 మధ్య పెంచాల్సి వస్తుంది. ఇండియన్‌ ఆయిల్‌ (ఐవోసీ) ఒక్కటే 1–1.1 బిలియన్‌ డాలర్ల మేర ఆదాయాన్ని నష్టపోగా, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్‌ 55–560 మిలియన్‌ డాలర్ల మేర 2021 నవంబర్‌ – 2022 డిసెంబర్‌ మధ్యకాలంలో నష్టాన్ని చవిచూసినట్టు మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ అంచనా. ‘‘ఆదాయంలో ఈ మేరకు నష్టం స్వల్పకాల రుణ భారాన్ని పెంచుతుంది. చమురు ధరలు గరిష్ట స్థాయిల్లో ఉన్నంత వరకు మూలధన నిధుల నుంచి సర్దుబాటు చేసుకోవాల్సి వస్తుంది. కొంత కాలానాకి చమురు ధరలు దిగివస్తే అప్పుడు ఆయిల్‌ కంపెనీలు కొంత మేర నష్టాలను సర్దుబాటు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది’’ అని మూడిస్‌ ఇన్వెస్టర్‌ సర్వీసెస్‌ తన నివేదికలో తెలిపింది.

మరిన్ని వార్తలు