ధరలకు ఇంధన సెగ!

15 Jun, 2021 09:19 IST|Sakshi

మేలో టోకు ద్రవ్యోల్బణం 12.94 శాతం

‘లో బేస్‌’కుతోడయిన ఇంధన ధరల తీవ్రత

రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.3 శాతం 

న్యూఢిల్లీ: అటు టోకుగా ఇటు రిటైల్‌గా భారత్‌లో సామాన్యునిపై ధరా భారం తీవ్రంగా ఉంది. మే నెలలో టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం ఏకంగా 12.94 శాతంగా నమోదయ్యింది (2020 మే నెల ధరతో పోల్చితే) లో బేస్‌కు తోడు తాజాగా  ఇంధన, తయారీ ఉత్పత్తుల ధరల తీవ్రత ఇందుకు ప్రధాన కారణం. ‘పోల్చుతున్న నెలలో’  అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో  ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్‌ ఎఫెక్ట్‌. ఇక్కడ 2020 మే నెలలో,  కరోనా సవాళ్లు, కఠిన లాక్‌డౌన్‌ నేపథ్యంలో టోకున అసలు ధరలు పెరక్కపోగా ప్రతి ద్రవ్యోల్బణం (–3.37%) నమోదయ్యింది. 2021 ఏప్రిల్‌ నెలతో పోల్చినా (10.49%) టోకు ద్రవ్యోల్బణం మరింత పెరగడం గమనార్హం. ఇంధనం, విద్యుత్‌ ధరలు 37.61% పెరిగాయి. ఏప్రిల్‌లో ఈ పెరుగుదల రేటు 20.94 శాతం. సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ ఉత్పత్తుల ధరలు మేలో 10.83 శాతం పెరిగిగే, ఏప్రిల్‌లో 9.01 శాతం ఎగశాయి. అయితే ఆహార ధరల తీవ్రత 4.31%గా ఉంది.

ట్రోలియం ఉత్పత్తులు జీఎస్‌టీ పరిధిలోకి తేవాలి  

ద్రవ్యోల్బణంపై ప్రధానంగా అధిక ఇందన ధరల ప్రభావం పడుతోంది. ఇది సామాన్యుని నుంచి పరిశ్రమ వరకూ ధరా భారం మోపుతోంది. దేశీయ ఉత్పత్తులకు భారత్‌తోపాటు అటు అంతర్జాతీయంగానూ పోటీ పరంగా తీవ్ర సమస్యలు తలెత్తుతున్నాయి. ఇంధన ధర ల్లో హేతుబద్దత తీసుకువచ్చు, ద్రవ్యోల్బణాన్ని అదుపులోనికి తీసుకుని రావడానికి పెట్రోలి యం ప్రొడక్టులను వస్తు సేవల పన్ను (జీఎస్‌టీ) పరిధిలోనికి తీసుకుని రావాలి.  ఈ విషయాన్ని పరిశీలించమని కేంద్రాన్ని కోరుతున్నాం.  – సంజయ్‌ అగర్వాల్, పీహెచ్‌డీసీసీఐ ప్రెసిడెంట్‌  

చదవండి: పుకార్లు షికార్లు,అదానీ ‘ఫండ్స్‌’ కలకలం!

మరిన్ని వార్తలు