జీఎస్‌టీలోకి పెట్రోలియం ఉత్పత్తులు! ఆర్థిక మంత్రి ఏం చెప్పారంటే..

16 Feb, 2023 08:30 IST|Sakshi

న్యూఢిల్లీ: రాష్ట్రాలు అంగీకరిస్తే పెట్రోలియం ఉత్పత్తులను వస్తు, సేవల పన్నుల (జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకురావచ్చని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ చెప్పారు. ఇందుకు సంబంధించి ఒక ప్రొవిజన్‌ ఇప్పటికే ఉందని బుధవారం వివరించారు. పరిశ్రమల సమాఖ్య పీహెచ్‌డీసీసీఐ సభ్యులతో బడ్జెట్‌ అనంతర సమావేశంలో పాల్గొన్న సందర్భంగా మంత్రి ఈ విషయాలు తెలిపారు.

ప్రస్తుతం ముడి పెట్రోలియం, పెట్రోల్, హై స్పీడ్‌ డీజిల్, సహజ వాయువు, విమాన ఇంధనాలను తాత్కాలికంగా జీఎస్‌టీ నుంచి మినహాయించారు. వాటిని ఎప్పటి నుంచి ఈ పరిధిలోకి తేవాలనేది జీఎస్‌టీ మండలి నిర్ణయం తీసుకోనుంది. 2023 ఫిబ్రవరి 18న జీఎస్‌టీ మండలి 49వ సమావేశం జరగనుంది. ఒకవేళ మొత్తం మండలి ఈ ప్రతిపాదనకు అంగీకరిస్తే ఏ రేటు వర్తింపచేయాలనే దానిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని మంత్రి చెప్పారు.

రేటును నిర్ధారించి తనకు తెలియజేస్తే పెట్రోలియం ఉత్పత్తులను సత్వరం జీఎస్‌టీ పరిధిలోకి చేర్చగలమన్నారు. మరోవైపు, వృద్ధికి ఊతమిచ్చే దిశగా కేంద్రం గత మూడు–నాలుగేళ్లుగా పెట్టుబడి వ్యయాలను గణనీయంగా పెంచుతూనే ఉందని మంత్రి వివరించారు. ఒకే దేశం ఒకే రేషన్‌ కార్డు స్కీమును, విద్యుత్‌ తదితర రంగాల్లో సంస్కరణలను ముందుకు తీసుకెళ్లాలంటూ రాష్ట్రాలకు కేంద్రం సూచిస్తోందన్నారు.

(ఇదీ చదవండి: ఈవీ జోరుకు భారత్‌ రెడీ..  ప్లాంటు యోచనలో వోల్వో!)

మరిన్ని వార్తలు