పీఎఫ్‌ విత్‌ డ్రా: ఐదేళ్లుగా ఒకే చోట పని చేస్తున్నారా?

23 Jun, 2021 18:37 IST|Sakshi

చాలా మంది ప్రైవేట్ ఉద్యోగులు వారి అవసరాల కోసం పీఎఫ్ ఖాతా నుంచి భారీ మొత్తంలో నగదు తీసుకుంటారు. అలా తీసుకున్న నగదుపై ఈపీఎఫ్ఓ పన్ను విధిస్తుంది. అయితే, కొందరికి మాత్రం ఈ పన్ను నుంచి మినహాయింపు లభిస్తుంది. అది ఎలానో ఒక ఉదాహరణ ద్వారా తెలుసుకుందాం. రమేష అనే వ్యక్తి ఒక కంపెనీలో 8 సంవత్సరాలు పనిచేశాడు. ఆ కంపెనీ అతనికి ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ (ఈపీఎఫ్) సౌకర్యాన్ని అందించింది. కొన్ని అనివార్య కారణాల వల్ల అతను మరో కంపెనీలో 14 నెలలు పనిచేశాడు. ఈ కంపెనీ అతనికి ఈపీఎఫ్ సౌకర్యం కల్పించలేదు. ఆ తర్వాత కొన్ని నెలలు కాలిగానే ఇంట్లో ఉన్నాడు.

ఇంట్లో ఒత్తిడి పెరగడంతో మరో కంపెనీలో చేరాడు. ఈపీఎఫ్ సౌకర్యం ఉన్న పెద్ద కంపెనీలో 5 సంవత్సరాలు పైగా పని చేశాడు. అయితే, అతను తన అవసర నిమిత్తం మొత్తం ఒకేసారి విత్‌డ్రా చేస్తే ప‌న్ను మిన‌హాయింపు ఉంటుందా? అని సందేహం కలిగింది. ప్రస్తుత పీఎఫ్ నిబందనల ప్రకారం.. ఇలా అతను విత్ డ్రా చేసిన మొత్తంపై ఎటువంటి పన్ను ఉండదు. ఒక ఉద్యోగి ఒక సంస్థలో 5 ఏళ్లు అంత‌కన్నా ఎక్కువ స‌మ‌యం పాటు ప‌నిచేస్తే వారు పీఎఫ్ సౌకర్యం కల్పిస్తే పీఎఫ్‌ను విత్‌డ్రా చేసిన నగదుపై ఎటువంటి ప‌న్ను చెల్లించాల్సిన ప‌నిలేదు. 5 ఏళ్ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ప‌నిచేస్తేనే ప‌న్ను వ‌ర్తిస్తుంది. 

పైన తెలిపిన ఉదాహ‌ర‌ణ‌లో రమేష్ 8 ఏళ్ల పాటు ఒక కంపెనీలో ప‌నిచేశాడు. 5 ఏళ్ల క‌న్నా ఎక్కువగా ఒకే కంపెనీలో చేసిన అనుభ‌వం, అన్ని ఏళ్ల పాటు నిరంత‌రాయంగా పీఎఫ్ కట్టాడు. కాబ‌ట్టి అత‌ను మొద‌టి కంపెనీతోపాటు చివ‌రి కంపెనీలోనూ పీఎఫ్ విత్‌డ్రా చేస్తే ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. మధ్యలో రమేష్ 14 నెలలు పనిచేసిన కంపెనీలో ఎలాగో పీఎఫ్ సౌకర్యం లేదు కాబట్టి అతను మొదటి, చివరి సంస్థలో 5 ఏళ్లకు పైగా పనిచేశాడు. అందుకని అతను విత్‌డ్రా చేసిన నగదుపై టాక్స్ ఫ్రీ లభిస్తుంది. ఎవరైనా ఏదైనా కంపెనీలో 5 ఏళ్ల కంటే తక్కువగా పనిచేస్తే పీఎఫ్ విధించే టాక్స్ చెల్లించాలి.

చదవండి: ఈపీఎఫ్ఓ ఖాతాదారులకు శుభవార్త!

మరిన్ని వార్తలు