వ్యాక్సిన్‌తో తగ్గని కరోనా.. ఫైజర్‌ సీఈవోకి చుక్కలు చూపించిన జర్నలిస్ట్‌లు!

20 Jan, 2023 11:56 IST|Sakshi

దావోస్‌లో జరుగుతున్న వరల్డ్‌ ఎకనామిక్‌ ఫోరంకు హాజరయిన ఫైజర్‌ సీఈవో అల్బర్ట్‌ బౌర్లకు చేదు అనుభవం ఎదురయింది. కరోనా కట్టడి విషయంలో .. ఫైజర్‌ వ్యాక్సిన్‌ తీసుకున్నా.. ఫలితం మాత్రం అంత గొప్పగా లేదంటూ కొందరు మీడియా ప్రతినిధులు అల్బర్ట్‌ను ప్రశ్నించారు. వరల్డ్‌ ఎకనామిక్‌ సదస్సు నుంచి బయటకు వచ్చి రూం వైపు అడుగులు వేస్తుండగా అల్బర్ట్‌ను చుట్టుముట్టారు మీడియా ప్రతినిధులు.

మానవాళిని తప్పుదోవ పట్టించి.. అసత్యాలు, అబద్దాలతో తప్పుడు ప్రచారం చేశారని, వ్యాక్సిన్ల విక్రయించేముందు ఎంతో భరోసా ఇచ్చినా అవేవీ అమలు కాలేదని ప్రశ్నించారు. ఫైజర్‌ కంపెనీని నమ్మి వ్యాక్సిన్లు తీసుకున్న ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇంత జరిగినా.. అల్బర్ట్‌ మాత్రం నోరు మెదపలేదు. వ్యాక్సిన్‌ వల్ల వైరస్‌ సంక్రమణ పూర్తిగా ఉండదని ముందుగానే తెలిసినా.. దాన్ని రహస్యంగా ఉంచారా అని విలేకరులు ప్రశ్నించారు. 

కరోనా వల్ల చనిపోయిన వారికి ఏం సమాధానం చెబుతావని నిలదీశారు.నీ మీద ఎందుకు క్రిమినల్‌ కేసులు పెట్టకూడదని అడిగినా..అల్బర్ట్‌ మాత్రం మౌనంగా ఉండిపోయారు. కరోనా విక్రయాల ద్వారా 2.3 బిలియన్‌ డాలర్లు ఫైజర్‌కు వచ్చాయని, అసలు ఈ మొత్తం వ్యాక్సిన్‌ తతంగం వెనక ఎవరు కమీషన్లు ఇచ్చారని అడిగారు.

కరోనా వ్యాప్తిని అడ్డుకుని మానవుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశ్యంతో 2020 ఏప్రిల్‌లో వ్యాక్సిన్‌ను తీసుకొచ్చింది ఫైజర్‌. అమెరికా ప్రభుత్వం ఆమోదించిన తొలి కోవిడ్‌ కట్టడి వ్యాక్సిన్‌ కూడా ఇదే. ప్రపంచవ్యాప్తంగా.. ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలు ఫైజర్‌ను మాత్రమే ఎంపిక చేసుకున్నాయి. దాదాపు ఒకటిన్నర బిలియన్‌ డోసులను ఫైజర్‌ విక్రయించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. వ్యాక్సిన్లు తీసుకున్న కొందరిలో గుండెపోటు సమస్యలు తలెత్తాయని ఫిర్యాదులు వచ్చినా.. అవి వ్యాక్సిన్‌ వల్లే వచ్చాయని శాస్త్రీయంగా పూర్తి స్థాయిలో నిరూపితం కాలేదు.

మరిన్ని వార్తలు