పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌గా దీపక్‌ మొహంతీ

17 Mar, 2023 00:34 IST|Sakshi

న్యూఢిల్లీ: పెన్షన్‌ ఫండ్‌ రెగ్యులేటరీ అండ్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (పీఎఫ్‌ఆర్‌డీఏ) చైర్మన్‌గా దీపక్‌ మొహంతీను ప్రభుత్వం నియమించింది. జనవరిలో పదవీకాలం ముగిసిన సుప్రతిమ్‌ బంద్యోపాధ్యాయ స్థానంలో ఆయన నియామకం జరిగింది. ప్రస్తుతం పీఎఫ్‌ఆర్‌డీఏ సభ్యునిగా ఆయన పనిచేస్తున్నారు.  మొహంతీ ఆగస్టు 2020లో మూడేళ్ల కాలానికి లేదా 62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు పీఎఫ్‌ఆర్‌డీఏ మెంబర్‌గా (ఎకనామిక్‌) గతంలో నియమితులయ్యారు.

  రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేసిన అపార అనుభవం కూడా ఆయనకు ఉంది. తాజా నియామకానికి సంబంధించి  వెలువడిన ప్రభుత్వ నోటిఫికేషన్‌ ప్రకారం,  ఇళ్లు, కారు సౌకర్యం లేకుండా మొహంతీ నెలకు రూ.4.50 లక్షల కన్సాలిడేటెడ్‌ వేతనం  పొందుతారు.  పదవి బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి 65 ఏళ్లు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు ఈ బాధ్యతల్లో ఆయన పనిచేస్తారు.

మెంబర్‌గా...మమతా శంకర్‌
మొహంతీ తాజా నియామకం నేపథ్యంలో ఆయన స్థానంలో పీఎఫ్‌ఆర్‌డీఏ మెంబర్‌గా (ఎకనామిక్‌) మమతా శంకర్‌ నియమితులయ్యారు. ఇండియన్‌ ఎకనమిక్‌ సర్వీస్‌ (1993)లో ఉన్న ఆమె ప్రస్తుతం ఆహార, ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖలో సీనియర్‌ ఎకనమిక్‌ అడ్వైజర్‌గా పనిచేస్తున్నారు.  మూడేళ్ల కాలానికి లేదా  62 ఏళ్ల వయస్సు వచ్చే వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు (ఏది ముందుగా అయితే) ఆమె ఈ బాధ్యతల్లో కొనసాగుతారని  ప్రత్యేక నోటిఫికేషన్‌ పేర్కొంది.  

పెన్షన్‌ నిధులు ఇలా...
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌) అలాగే అటల్‌ పెన్షన్‌ యోజన కింద నిర్వహణలో ఉన్న మొత్తం ఆస్తుల (ఏయూఎం) విలువ 2023 మార్చి 4వ తేదీ నాటికి రూ. 8.81 లక్షల కోట్లు. దేశంలోని పెన్షన్‌ పరిశ్రమను ప్రోత్సహించడం, నియంత్రించడం,  అభివృద్ధి చేయడం లక్ష్యంగా 2003లో పీఎఫ్‌ఆర్‌డీఏ ఏర్పాటయ్యింది. దీనిని మొదట్లో ప్రభుత్వ ఉద్యోగుల కోసం ప్రత్యేకంగా నిర్దేశించడం జరిగింది.  అయితే తదుపరి  స్వయం ఉపాధి పొందుతున్న వ్యక్తులు, ఎన్‌ఆర్‌ఐలుసహా అన్ని భారత పౌరులు అందరికీ అథారిటీ సేవలను విస్తరించడం జరిగింది. వ్యవస్థీకృతంగా పెన్షన్‌ నిధుల ప్రోత్సాహం, అభివృద్ధి, నియంత్రణ వంటి కీలక కార్యకలపాలాను అథారిటీ నిర్వహిస్తుంది. ప్రజల వృద్ధాప్య ఆదాయ అవసరాలను, వనరులను స్థిర ప్రాతిపదికన అందించడంలో ఎన్‌పీఎస్‌ కీలక పాత్ర పోషిస్తోంది.

మరిన్ని వార్తలు