కనీస రాబడులతో వినూత్న పెన్షన్‌ పథకం

13 Mar, 2021 06:16 IST|Sakshi

ప్రవేశపెట్టాలనుకుంటున్న పీఎఫ్‌ఆర్‌డీఏ

ముంబై: వినూత్నమైన పెన్షన్‌ ప్లాన్లను తీసుకురావడం దిశగా పనిచేస్తున్నట్టు పింఛను నిధి నియంత్రణ, అభివృద్ధి సంస్థ (పీఎఫ్‌ఆర్‌డీఏ) ప్రకటించింది. ఇందులో కనీస రాబడుల హామీతో ఒక పథకం ఉంటుందని పీఎఫ్‌ఆర్‌డీఏ చైర్మన్‌ సుప్రతిమ్‌ బంధోపాధ్యాయ అన్నారు. పీఎఫ్‌ఆర్‌డీఏ నియంత్రణలో ప్రస్తుతం ఎన్‌పీఎస్, అటల్‌ పెన్షన్‌ యోజన (ఏపీవై) పథకాలు కొనసాగుతుండగా.. మరింత మంది చందాదారులను ఆకర్షించేందుకు వినూత్నమైన పెన్షన్‌ ఉత్పత్తులను తీసుకురావడంపై దృష్టి పెట్టామని బంధోపాధ్యాయ చెప్పారు. ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ యాక్చుయరీస్‌ ఆఫ్‌ ఇండియా నిర్వహించిన వర్చువల్‌ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆయన మాట్లాడారు.

నూతన పెన్షన్‌ ఉత్పత్తి తీసుకువచ్చే విషయంలో యాక్చుయరీలు సాయమందించాలని బంధోపాధ్యాయ కోరారు. యాక్చుయరీల నుంచి వచ్చే సూచనలకు ఎంతో ప్రాధాన్యం ఉంటుందన్నారు. ఎన్‌పీఎస్‌ నుంచి వైదొలిగే సమయంలో సభ్యులకు అధిక రేట్లతో కూడిన పెన్షన్‌ లేదా యాన్యుటీ ప్లాన్‌ను అందించే అంశంపై దృష్టి సారించినట్టు చెప్పారు. మార్కెట్‌ ఆధారిత బెంచ్‌మార్క్‌ రేట్లకు అనుగుణంగా ఉండే భిన్నమైన యాన్యుటీ ఉత్పత్తుల అవసరం ఉందన్నారు. క్రమానుగతంగా కావాల్సినంత వెనక్కి తీసుకునే ప్లాన్‌ (ఎస్‌డబ్ల్యూపీ) మాదిరి యాన్యుటీ ప్లాన్లు కావాలన్నారు. పెన్షన్‌ ఎంత రావచ్చన్న అంచనాలను ప్రస్తుత, నూతన చందాదారులకు అందుబాటులోకి తీసుకురావడంపై  పనిచేస్తున్నట్టు బంధోపాధ్యాయ చెప్పారు.  

మరిన్ని వార్తలు