సూచీలకు స్వల్పలాభాలు

23 Mar, 2023 06:32 IST|Sakshi

ఫెడ్‌ ప్రకటనకు ముందు అప్రమత్తత

సెన్సెక్స్‌ లాభం 140 పాయింట్ల

ముంబై: ట్రేడింగ్‌ ఆద్యంతం పరిమిత శ్రేణిలో కదలాడిన స్టాక్‌ సూచీలు బుధవారం స్వల్పలాభాలతో గట్టెక్కాయి. అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ ద్రవ్య విధాన వైఖరి వెల్లడికి ముందు ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరించారు. ప్రపంచ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న దేశీయ సూచీలు ఉదయం లాభాలతో మొదలయ్యాయి. సెన్సెక్స్‌ 170 పాయింట్లు పెరిగి 58,245 వద్ద, నిఫ్టీ 71 పాయింట్లు లాభంతో 17,177 వద్ద ప్రారంభమయ్యాయి.

తొలి దశలో కొనుగోళ్ల మద్దతు లభించడంతో సెన్సెక్స్‌ 344 పాయింట్లు ఎగసి 58,418 వద్ద, నిఫ్టీ 100 పాయింట్లు బలపడి 17,207 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. అయితే దేశీయ మార్కెట్‌ నుంచి విదేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండటంతో సూచీలు ఆరంభ లాభాల్ని కోల్పోయాయి. ఫలితంగా సెన్సెక్స్‌ 140 పాయింట్ల స్వల్పలాభంతో 58,215 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 44 పాయింట్ల పెరిగి 17,152 వద్ద నిలిచింది.  ఫార్మా, ఫైనాన్స్, బ్యాంకింగ్, ఐటీ కమోడిటీ షేర్లు రాణించడంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్‌ క్యాప్‌ సూచీలు వరుసగా 0.50%, 0.18 శాతం చొప్పున లాభపడ్డాయి. మెటల్, మీడియా, రియల్టీ షేర్లలో లాభాల స్వీకరణ చోటు చేసుకుంది.

>
మరిన్ని వార్తలు