రండి.. పెట్టుబడులు పెట్టండి!

25 May, 2021 03:13 IST|Sakshi

ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీల ఆఫర్ల మోత

పెద్ద ఎత్తున నిధుల సమీకరణ ప్రణాళికలు

కిమ్స్, ఎమ్‌క్యూర్‌ ఫార్మా, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ 

త్వరలో ఐపీవోకు రానున్న ఇష్యూలు

న్యూఢిల్లీ: కరోనా రాకతో ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీల వ్యాపార అవకాశాలు భారీగా పెరిగాయి. ఏడాది కాలంలో వాటి ఆదాయాలు, లాభాలు గణనీయంగా వృద్ధి చెందడాన్ని గమనించొచ్చు. ఆరోగ్య సంరక్షణ పట్ల అవగాహన విస్తృతం కావడంతో భవిష్యత్తులోనూ ఈ కంపెనీలకు వ్యాపార అవకాశాలు పుష్కలమేనని మార్కెట్‌ పండితుల అంచనా. ఇన్వెస్టర్ల నుంచి నిధుల సమీకరణకు ఫార్మా, హెల్త్‌కేర్‌ కంపెనీలకు ఇంతకంటే అనుకూల సమయం ఎప్పుడుంటుంది? అందుకేనేమో చాలా కంపెనీలు ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌ (ఐపీవో/ప్రజలకు తొలిసారిగా వాటాలను ఆఫర్‌ చేయడం) కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నాయి. కరోనా వైరస్‌తో లాభపడే కంపెనీల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్లలో ఆసక్తి ఇతోధికం అయినట్టు గణాంకాలు పరిశీలిస్తే తెలుస్తుంది. ఇదే మద్దతుగా 2021లో సుమారు 12 ఫార్మా, హెల్త్‌ కేర్‌ కంపెనీలు  నిధులను సమీకరించనున్నాయి. గడిచిన ఐదేళ్లలో ఫార్మా, హెల్త్‌కేర్‌ రంగాల నుంచి కేవలం ఏడు కంపెనీలే ఐపీవోకు రాగా.. ఈ ఒక్క ఏడాది రికార్డు స్థాయి ఐపీవోల వర్షం కురవనుందని తెలుస్తోంది.  

కొన్ని ఇప్పటికే దరఖాస్తులు: ఐపీవోకు సంబంధించి ఎనిమిది కంపెనీలు ఇప్పటికే ‘డ్రాఫ్ట్‌ రెడ్‌ హెర్రింగ్‌  ప్రాస్పెక్టస్‌’ (డీఆర్‌హెచ్‌పీ)ను సెబీ వద్ద దాఖలు చేశాయి. ఈ జాబితాలో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్, సుప్రియా లైఫ్‌ సైన్సెస్, క్రస్నా డయాగ్నొస్టిక్స్, కిమ్స్, తత్వ చింతన్‌ ఫార్మా, సిఘాచి ఇండస్ట్రీస్, విండ్లాస్‌ బయోటెక్‌ కంపెనీలు ఉన్నాయి. అలాగే, థర్డ్‌పార్టీ బీమా సేవలు అందించే ప్రముఖ కంపెనీ మెడిఅసిస్ట్‌ సైతం సెబీ వద్ద డీఆర్‌హెచ్‌పీ సమర్పించింది. డీఆర్‌హెచ్‌పీనే ఆఫర్‌ డాక్యుమెంట్‌గానూ పిలుస్తారు. ఐపీవోకు సంబంధించిన వివరాలతో మర్చంట్‌ బ్యాంకర్లు రూపొందించే ప్రాథమిక డాక్యుమెంట్‌ ఇది. అదే విధంగా మిగిలిన కంపెనీల ఐపీవో ప్రణాళికలు సైతం వివిధ దశల్లో ఉన్నాయి. ఇలా ఐపీవో ప్రక్రియను ఆరంభించిన కంపెనీల్లో ఎమ్‌క్యూర్‌ ఫార్మా, వెల్‌నెస్‌ ఫరెవర్, విజయా డయాగ్నోస్టిక్స్, స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌ ఉన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా ఫార్మా, హెల్త్‌కేర్, వాటి అనుబంధ రంగాల్లోని పటిష్టమైన కంపెనీల్లో పెట్టుబడులకు ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరిగినట్టు ఐసీఐసీఐ సెక్యూరిటీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకింగ్‌ హెడ్‌ అజయ్‌ సరఫ్‌ తెలిపారు.  

ఎమ్‌క్యూర్‌ నుంచి పెద్ద ఇష్యూ..
గ్లెన్‌మార్క్‌ ఫార్మా అనుబంధ కంపెనీ అయిన గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌ గత నెలలో ఐపీవోకు సెబీ వద్ద దరఖాస్తు దాఖలు చేయగా.. సుమారు రూ.2,000 కోట్ల మేర నిధులను సమీకరించే ప్రతిపాదనతో ఉంది. పుణేకు చెందిన ఎమ్‌క్యూర్‌ ఫార్మాస్యూటికల్స్‌ జనరిక్‌ డ్రగ్‌ తయారీలో ప్రముఖ కంపెనీ. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.3,500–4,000 కోట్లను సమీకరించాలనుకుంటోంది. ఇందుకు సంబంధించి ఇన్వెస్ట్‌మెంట్‌ బ్యాంకర్లతో సంప్రదింపులు మొదలు పెట్టింది. సిరమ్‌ ఇనిస్టిట్యూట్‌ అధినేత అదర్‌ పూనవాలాకు చెందిన రిటైల్‌ ఫార్మసీ చైన్‌ కంపెనీ వెల్‌నెస్‌ ఫరెవర్‌ రూ.1,200 కోట్లను ఐపీవో ద్వారా సమీకరించే ప్రతిపాదనతో ఉంది.

‘‘కరోనా కారణంగా భారత హెల్త్‌కేర్‌ వ్యవస్థలో భారీ మార్పు చోటు చేసుకుంది. ఔషధాలు, టీకాలు, వ్యాధి నిర్దారణ పరీక్షలు, వైద్య ఉపకరణాలు, హాస్పిటల్స్‌ తదితర కంపెనీల వ్యాపార అవకాశాలు రానున్న కాలంలో ఎన్నో రెట్లు పెరగనున్నాయి. హెల్త్‌కేర్‌ రంగం మొత్తం మీద ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోంది. దీంతో ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖత చూపిస్తున్నారు’’ అని డీఏఎమ్‌ క్యాపిటల్‌ ఎండీ, సీఈవో దర్మేష్‌ మెహతా చెప్పారు. ఈ ఏడాది ఫిబ్రవరి 10 నుంచి కరోనా రెండో విడత మొదలు కాగా.. అప్పటి నుంచి నిఫ్టీ ఫార్మా ఇండెక్స్‌ 7 శాతం ర్యాలీ చేసింది. ఇదే కాలంలో నిఫ్టీ–50లో రాబడులు ఏమీ లేవు. 2020లో ఈ రంగం నుంచి ఐపీవోకు వచ్చిన ఏకైక కంపెనీగా గ్లాండ్‌ ఫార్మాను చెప్పుకోవాలి. ఈ సంస్థ ఐపీవో రూపంలో రూ.5,230 కోట్లను (2020 నవంబర్‌లో) సమీకరించింది. ఐపీవో ఇష్యూ ధర రూ.1,500 కాగా.. ఆరు నెలల్లోనే స్టాక్‌ నూరు శాతం రాబడులను ఇచ్చింది.
పబ్లిక్‌ ఆఫర్‌ బాటలో..
కంపెనీ    ఐపీవో ఇష్యూ
    అంచనా (రూ.కోట్లలో)

ఎమ్‌క్యూర్‌ ఫార్మా    3,500
స్టార్‌ హెల్త్‌ ఇన్సూరెన్స్‌    3,000
గ్లెన్‌మార్క్‌ లైఫ్‌సైన్సెస్‌    2,000
సుప్రియా లైఫ్‌సైన్సెస్‌    1,200
క్రస్నా డయాగ్నొస్టిక్స్‌    1,200
వెల్‌నెస్‌ ఫరెవర్‌    1,200
మెడి అసిస్ట్‌ హెల్త్‌కేర్‌    840
కిమ్స్‌ హాస్పిటల్స్‌    700
విండ్లాస్‌ బయోటెక్‌    600
తత్వ చింతన్‌ ఫార్మా    450

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు