ఫార్మ్‌ఈజీ చేతికి థైరోకేర్‌

26 Jun, 2021 03:01 IST|Sakshi

66 శాతం వాటా కొనుగోలు

డీల్‌ విలువ రూ. 4,546 కోట్లు

వాటాదారులకు ఓపెన్‌ ఆఫర్‌

26 శాతం వాటాకు రూ. 1,788 కోట్లు

మొత్తం రూ. 6,334 కోట్లు వెచ్చింపు

ముంబై: డయాగ్నొస్టిక్‌ సేవల కంపెనీ థైరోకేర్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను కొనుగోలు చేయనున్నట్లు డిజిటల్‌ హెల్త్‌కేర్‌ స్టార్టప్‌ ఫార్మ్‌ ఈజీ తాజాగా పేర్కొంది. ఇందుకు రూ. 4,546 కోట్లు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఇందుకు అనుగుణంగా థైరోకేర్‌ టెక్నాలజీస్‌ చైర్మన్, ఎండీ ఎ.వేలుమణితో ఫార్మ్‌ ఈజీ మాతృ సంస్థ ఏపీఐ హోల్డింగ్స్‌ తప్పనిసరి ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఒప్పందంలో భాగంగా థైరోకేర్‌లో 66.1 శాతం వాటాను యూనికార్న్‌ హోదాను పొందిన ఫార్మ్‌ఈజీ సొంతం చేసుకోనుంది. ఇందుకు ఒక్కో షేరుకి రూ. 1,300 చొప్పున చెల్లించనున్నట్లు ఫార్మ్‌ఈజీ తెలియజేసింది. ఈ నేపథ్యంలో 25 ఏళ్లుగా దేశవ్యాప్త డయాగ్నొస్టిక్‌ సేవలను విస్తరించిన కంపెనీని 7 సంవత్సరాల వయసుగల ఒక స్టార్టప్‌ కొనుగోలు చేస్తుండటం ప్రస్తావించదగ్గ విషయమని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఫార్మ్‌ఈజీ ఇటీవలే మెడ్‌లైఫ్‌ను సైతం సొంతం చేసుకున్న విషయం విదితమే.

26 శాతం వాటాకు  
స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయిన థైరోకేర్‌ టెక్నాలజీస్‌లో మెజారిటీ వాటాను సొంతం చేసుకోనుండటంతో మైనారిటీ వాటాదారులకు ఫార్మ్‌ఈజీ ఓపెన్‌ ఆఫర్‌ను ప్రకటించవలసి ఉంటుంది. సెబీ నిబంధనల ప్రకారం థైరోకేర్‌ వాటాదారుల నుంచి ఫార్మ్‌ఈజీ 26 శాతం వాటాను కొనుగోలు చేయవలసి ఉంటుంది. ఇందుకు మరో రూ. 1,788 కోట్లు వెచ్చించవలసి ఉంటుంది. దీంతో మొత్తం రూ. 6,334 కోట్లు ఇన్వెస్ట్‌ చేయనుంది. ఇక మరోవైపు వేలుమణి ఏపీఐ హోల్డింగ్స్‌లో 5 శాతం వరకూ వాటా తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు