ఫోన్‌పే, గూగుల్‌పే నుంచి పొరపాటున వేరే ఖాతాకు.. ఇలా చేస్తే మీ పైసలు వెనక్కి!

1 Jan, 2023 18:00 IST|Sakshi

గతంలో నగదు చెల్లింపులు జరపాలంటే బ్యాంకులకు వెళ్లడమో లేదా ఇంటర్నెట్‌ బ్యాంకులు వంటివి ఉపయోగించాల్సి వచ్చేది. కానీ టెక్నాలజీ పుణ్యమా అని యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) రావడంతో ప్రజలు అటువైపు మొగ్గుచూపుతున్నారు. ఇది నగదు చెల్లింపుల విధానంలో ఓ విప్లవాత్మక మార్పులను తీసుకొచ్చాయనే చెప్పాలి. ఎంతో సులువుగా అవతలి వాళ్లకు డబ్బులను ఈ విధానాన్ని ఉపయోగించి చిటికెలో పంపతున్నాం. అయితే ప్రజలకు కొన్ని సందర్భాల్లో నగదు పొరపాటున తాము అనుకున్న ఖాతాకు కాకుండా వేరు వారికి బదిలీ చేసిన ఘటనలు బోలెడు ఉన్నాయి. అటువంటి పరిస్థితి మీకు ఎదురైతే ఆ సమస్యకు పరిష్యారం గురించి ఇక్కడ తెలుసుకుందాం.

యూపీఐ పేమెంట్స్‌ను ఉపయోగించి సెకనులో డబ్బులను అవతలి వాళ్ల బ్యాంక్‌ అకౌంట్‌కు పంపవచ్చు. ఈ విధానం సులువుగా ఉండడంతో మొదట్లో యూపీఐని ఉపయోగించే వారి సంఖ్య వేల నుంచి ప్రస్తుతం కోట్లకు చేరింది. అలా ప్రస్తుతం ఇది మాల్స్‌, షాపింగ్‌ కాంప్లెక్స్‌ మాత్రమే కాదు రోడ్‌సైడ్ వెండర్‌ల నుంచి రిటైల్ షాపుల వరకు ఎక్కడ చూసిన ఇదే కనిపిస్తుంది. ఇది సురక్షితమైన చెల్లింపు వ్యవస్థ అయినప్పటికీ కొన్ని సార్లు అనుకోకుండా చేసే పొరపాటు మీ ఆర్థిక నష్టానికి దారితీయవచ్చు. 

వేరే ఖాతాకు నగదు బదిలీ.. వెనక్కి రావాలంటే ఇలా చేయండి
యూపీఐ ఐడీని తప్పుగా నమోదు చేయడం లేదా పొరపాటుగా వేరొకరి బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపడం లాంటివి జరుగుతుంటాయి. మనకో లేదా మనకు తెలిసిన వాళ్లకు ఈ పరిస్థితి ఎదురయ్యే ఉంటుంది. ఆ సమయంలో మీరు భయాందోళనలకు గురికావాల్సిన అవసరం లేదు. భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఈ సమస్యకు పరిష్కారం చూపింది. ఆర్బీఐ ప్రకారం, మీరు సరైన చర్యలు తీసుకోవడం ద్వారా బదిలీ చేసిన మొత్తం నగదు తిరిగి పొందవచ్చు.

డిజిటల్ సేవల ద్వారా అనుకోకుండా లావాదేవీలు జరిగితే, బాధిత వ్యక్తి మొదట ఉపయోగించిన చెల్లింపు వ్యవస్థతో ఫిర్యాదు చేయాలని పేర్కొంది. మీరు పేటీఎం (Paytm), గూగుల్‌ పే (Google Pay), ఫోన్‌పే (PhonePe) వంటి అప్లికేషన్ల కస్టమర్ సర్వీస్ నుంచి సహాయం పొందవచ్చు. వారి ద్వారా నగదు వాపసు కోసం అభ్యర్థించవచ్చు. చెల్లింపు వ్యవస్థ సమస్యను పరిష్కరించలేపోతే, డిజిటల్ లావాదేవీల కోసం ఆర్బీఐ ఏర్పాటు చేసిన అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చని తెలపింది.

చదవండి: అయ్యో! ఎంత కష్టం, ఆఫీసుకు టాయిలెట్‌ పేపర్లు తెస్తున్న ట్విటర్‌ ఉద్యోగులు

మరిన్ని వార్తలు