Alakh Pandey Success Story: నెలకు రూ.3.30 కోట్ల జీతం ఇస్తామన్నా వద్దన్నాడు.. చివరికి..

28 May, 2022 17:16 IST|Sakshi

య్యూట్యూబ్‌లో పాఠాలు చెబితే వేలల్లో చందాదారులు, లక్షల రూపాయల్లో ఆదాయం అని అందరూ అంటూనే విని ఆయన తన లెక్చరర్‌ ఉద్యోగాన్ని పక్కన పెట్టి యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేశారు. ఇక యూట్యూబ్‌లో డబ్బులే డబ్బులు అనుకుంటే ఆరేళ్ల వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కిందామీద పడా అక్కడ డబ్బులొచ్చే సమయంలో ఏడాదికి రూ. 40 కోట్లతో జాబ్‌ ఆఫర్‌ వచ్చింది. కానీ ఆ ఆఫర్‌ను తిరస్కరించాడు. అంత గొప్ప ఆఫర్‌ వదులుకున్న అతని జీవితం చివరికి ఏ మలుపు తీసుకుందంంటే ?

ఉత్తర్‌ ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌కి చెందిన అలఖ్‌ పాండే ఆర్థికంగా అంత గొప్ప కుటుంబం కాదు. ప్రతీ నెల చివర డబ్బుల కోసం జేబులు తడుముకోవాల్సి వచ్చేది. దీంతో తన ఖర్చుల కోసం 9వ తరగతి నుంచే ఐదారు తరగతి పిల్లలకు పాఠాలు చెప్పడం మొదలెట్టారు. అవసరం కోసం మొదలైన ట్యూషన్లు చివరికి వ్యాపకంగా మారిపోయాయి. ఇంటర్‌లో ఉంటూనే టెన్త్‌ స్టూడెంట్లకు పాఠాలు చెప్పాడు. ఐఐటీలో సీటు పొందడం లక్ష్యంగా పెట్టుకున్న ఆర్థిక ఇబ్బందులు, గైడెన్స్‌ లేక ఆ కల నెరవేర్చుకోలేకపోయాడు.

లక్షల్లో జీతం
చిన్న తనం నుంచి టీచింగ్‌ అలవాటై పోవడంతో ఉద్యోగ ప్రయత్నాలు మాని ట్యూషన్లు చెప్పడం మొదలెట్టాడు అలఖ్‌ పాండే. ఆనోటా ఈనోటా అలఖ్‌ పాండే గురించి తెలియడంతో కార్పొరేటు కాలేజీలు కన్నేశాయి. లక్షల రూపాయల వేతనం ఇస్తామంటూ తమ కాలేజీల్లో చేర్చుకున్నాయి. ఇక అప్పటి నుంచి తీరిక లేకుండా క్లాసుల మీద క్లాసులు తీసుకోవడం అలఖ్‌ పాండే దినచర్యగా మారిపోయింది. ఇలా క్లాసుల వారీగా సెక‌్షన్ల వారీగా తీసుకోవడం కంటే ఒకేసారి వేలాది మందికి పాఠాలు చెప్పే వెసులుబాటు ఉందంటూ ఓ స్నేహితుడు చెప్పాడు అలోఖ్‌కి.

యూట్యూబ్‌లో
ఫిజిక్స్‌వాలా పేరుతో 2014లో యూట్యూబ్‌ ఛానల్‌ ఓపెన్‌ చేశాడు అలోఖ్‌ ఆరంభంలోనే 10వేల మంది చందాదారులు. అయితే  ప్రైవేటు కాలేజీలో పాఠాలు బోధించడం మానలేదు. ఏళ్లు గడుస్తున్నా యూట్యూబ్‌ ఛానల్‌కి ఆశించినంత స్పందన రాలేదు. అయితే 2016లో డేటా విప్లవం వచ్చాక ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. దీంతో 2017లో కాలేజీలో వస్తున్న మంచి సంపాదన వద్దనుకుని పూర్తిగా యూట్యూబ్‌కే అంకితమయ్యాడు. ఫిజిక్స్‌వాలా పేరుతో నీట్‌, జేఈఈ విద్యార్థులకు యూట్యూబ్‌లో కోచింగ్‌ షురూ చేశారు. రెండేళ్లు కష్టపడితే కానీ 2019లో యూట్యూబ్‌ ద్వారా ఆదాయం ఆశించినంతగా రాలేదు. 

బంపర్ ఆఫర్‌
ఇదే సమయంలో యూట్యూబ్‌ను నమ్ముకుని ఎన్నాళ్లు ఉంటావ్‌. అరటి పండు ఒలిచినట్టు పాఠాలు చెప్పే సత్తా నీకు ఉంది. మా సంస్థలో చేరమంటూ ఓ ఎడ్‌టెక్‌ కంపెనీ బంపర్‌ ఆఫర్‌ ప్రకటించింది. నెలకు రూ. 3.30 కోట్ల వంతున ఏడాదికి రూ.40 కోట్ల వార్షిక వేతనం అందిస్తామంటూ ఆహ్వానం పలికింది. కానీ ఆ ఆఫర్‌ను 2019 చివర్లో సున్నితంగా తిరస్కరించాడు అలోఖ్‌. అతన్నో పిచ్చోడిలా చూశారంతా ఆ సమయంలో.

ఫిజిక్స్‌వాలకు ప్రాణం
కరోనా మహమ్మారి ప్రపంచాన్ని చుట్టేయడంతో ప్రపంచమంతా స్థంభించి పోయింది. అప్పుడు ఆన్‌లైన్‌ క్లాసులే విద్యార్థులకు దిక్కయ్యాయి. దీంతో 2020 జూన్‌లో ఫిజిక్స్‌వాలా పేరుతో యాప్‌ రిలీజ్‌ చేసి ఎడ్‌టెక్‌ రంగంలోకి అడుగు పెట్టాడు. మిగిలిన ఎడ్‌కంపెనీల కంటే తక్కువ ఫీజు ఆఫర్‌ చేయడం, అప్పటికే మార్కెట్‌లో అలోఖ్‌కి ఉన్న ఇమేజ్‌ తోడవటంతో అనతి కాలంలోనే ఫిజిక్స్‌ వాలా సక్సెస్‌ ట్రాక్‌ పట్టింది. 

త్వరలో యూనికార్న్‌
రెండేళ్లు గడిచే సరికి ఫిజిక్స్‌వాలా స్టార్టప్‌కి పది లక్షల మంది పెయిండ్‌ విద్యార్థులు ఎన్‌రోల్‌ అయ్యారు. గంటల కొద్ది పాఠాలు అప్‌లోడ్‌ అవుతున్నాయి. లాభాల పరంపర మొదలైంది. తొలి ఏడాది రూ.9 కోట్ల లాభం రాగా మలి ఏడాది రూ.24 కోట్ల లాభం నమోదు చేసింది. ఇన్వెస్టర్ల కన్ను పడింది. వెంటనే పెట్టుబడులు వరద మొదలైంది. తాజాగా జరుగుతున్న చర్చలతో గ్లోబల్‌ ఇన్వెస్టర్ల నుంచి వంద మిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు హామీ సాధించింది. ఈ నిధులు కనుక వస్తే యూనికార్న్‌ హోదా సాధించిన ఏడో ఎడ్‌టెక్‌ కంపెనీగా ఫిజిక్స్‌వాలా రికార్డులకెక్కుతుంది. 

ఉద్యోగి కాదు యజమాని
అంతా కలిపితే అలోఖ్‌ పాండే ప్రస్తుత వయస్సు 30 ఏళ్లు మాత్రమే. ఇండియాలో యూనికార్న్‌ హోదా సాధించిన ‍ స్టార్టప్‌లలో నూటికి 90 శాతం ఐఐటీ పూర్వ విద్యార్థులవే ఉన్నాయి. కానీ అలోఖ్‌కి ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్‌ లేదు. చిన్నప్పటి నుంచి పాఠాలు చెప్పాలనే ఆసక్తి. యూట్యూబ్‌లో కామెంట్‌ సెక‌్షన్లలో వచ్చే ప్రతిస్పందన ఆధారంగా తన పాఠాలకు మెరుగులు పెట్టుకుంటో ముందుకు పోయాడు. కోట్లాది రూపాలయ వేతనం ఆఫర్‌ ఉన్నా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేశాడు. దీంతో కోట్ల రూపాయల జీతం తీసుకునే ఉద్యోగిగా కాకుంటా కోట్లాది రూపాయల విలువైన కంపెనీకి యజమానిగా నిలిచాడు. 

చదవండి: వేదాంత డైరీస్‌ 5: ఏ రిస్క్‌ తీసుకోకపోవడమే అతి పెద్ద రిస్క్‌

మరిన్ని వార్తలు