బిల్డర్ల మోసాల నుంచి రక్షణ కల్పించాలి

17 Oct, 2020 05:34 IST|Sakshi

సుప్రీంకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం

న్యూఢిల్లీ: రియల్టీ రంగంలో పారదర్శకత తీసుకొచ్చేందుకు బిల్డర్లు, ఏజెంట్ల మోసాల నుంచి వినియోగదారులను కాపాడేందుకు కేంద్రం నమూనా ఒప్పందాలను సిద్ధం చేసేలా ఆదేశాలివ్వాలని సుప్రీంకోర్టులో శుక్రవారం ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్‌) దాఖలైంది. దేశంలోని అన్ని రాష్ట్రాలూ ఈ ‘మోడల్‌ బిల్డర్‌ బయ్యర్‌ అగ్రిమెంట్‌’, ‘మోడల్‌ ఏజెంట్, బయ్యర్‌ అగ్రిమెంట్‌’లను అమలయ్యేలా చూడాలని కూడా బీజేపీ నేత అశ్విని కుమార్‌ ఉపాధ్యాయ్‌ తన పిల్‌లో కోరారు. ప్రమోటర్లు, బిల్డర్లు, ఏజెంట్లూ ఏకపక్షమైన ఒప్పందాలను ఉపయోగిస్తూంటారని, దీనివల్ల వినియోగదారులు నష్టపోతున్నారని, ఇది రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 14, 15, 21లకు విరుద్ధమని ఆయన ఆరోపించారు. నిర్మాణం పూర్తి చేసి భవనాలను కొనుగోలుదార్లకు అందించడంలో విపరీతమైన జాప్యం చేయడం, వినియోగదారులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎఫ్‌ఐఆర్‌ కూడా నమోదు చేయకపోవడం ఇప్పటికే చాలాసార్లు జరిగాయనీ, ఏకపక్ష ఒప్పందాల్లోని నిబంధనలను సాకుగా చూపుతున్నారని అశ్విని కుమార్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నారు.

‘‘బిల్డర్లు డెలివరీ షెడ్యూల్‌ను పదే పదే జారీ చేస్తూంటారు. అనైతికమైన, ఏకపక్షమైన వ్యాపార కార్యకలాపాలు చేస్తూంటారు. ఇవన్నీ నేరపూరిత కుట్ర కిందకు వస్తుంది. ఫ్రాడ్, మోసం, విశ్వాస ఘాతుకం, నిజాయితీ లేకపోవడం, కార్పొరేట్‌ చట్టాల ఉల్లంఘన, భవనాల విషయంలో అవకతవకలు జరుగుతూంటాయి’’అని వివరించారు. ఈ చర్యలన్నింటి వల్ల వినియోగదారులు మానసిక, ఆర్థిక నష్టాలకు గురవుతున్నారని, అంతేకాకుండా తాము జీవించే, జీవనోపాధి హక్కులను కోల్పోతున్నారని తెలిపారు. అధికారుల నుంచి తగిన అనుమతులు తీసుకోకుండానే సాఫ్ట్‌ లాంచ్‌ చేయడం చట్టాన్ని నేరుగా అతిక్రమించడమేనని ఆరోపించారు. విక్రయానికి ముందుగా నియంత్రణ సంస్థల వద్ద ఆ ప్రాజెక్టును నమోదు చేయడం అవసరమని, బిల్డర్‌ వద్ద అన్ని రకాల ప్రభుత్వ అనుమతులు ఉన్నప్పుడే రిజిస్ట్రేషన్‌ జరిగేలా చూడాలని కూడా ఈ పిటిషన్‌లో కోరారు.   

మరిన్ని వార్తలు