ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు..!

4 Apr, 2022 18:08 IST|Sakshi

దర్శక ధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి దర్శకత్వంలో  రూపొందించిన ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ చిత్రం దేశవ్యాప్తంగా వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రంపై ప్రశంసల జల్లు కురుస్తోంది. సినీ ప్రముఖులే కాకుండా రాజకీయనాయకులు కూడా ఈ చిత్రాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.  కాగా తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాపై కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

దేశ ఎకానమీతో పోల్చిన గోయల్‌..!
2021-22 గాను భారత ఎగుమతులు సరికొత్త రికార్డులను నమోదుచేశాయి. గత ఆర్థిక సంవత్సరంలో దేశ ఎగుమతులు 418 బిలియన్‌ డాలర్లను తాకేశాయి. ఈ నేపథ్యంలో గోయల్‌ మీడియాతో నిర్వహించిన సమావేశంలో...ఆర్‌ఆర్‌ఆర్‌ చిత్రం గురించి ప్రస్తావించారు.750  కోట్ల వ‌సూళ్ల‌తో ఆర్ఆర్ఆర్ ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫిల్మ్ గా నిలిచింద‌ని విన్నాను. ఆర్ఆర్ఆర్ చిత్రం లాగే ఇండియ‌న్ ఎకాన‌మీ కూడా రాకెట్‌లా దూసుకుపోతుందని పీయూష్‌ గోయల్‌ అన్నారు.

గత ఆర్థిక సంవత్సరంలో పెట్రోలియం ఉత్పత్తులు, ఇంజినీరింగ్‌ ఉత్పత్తులు, రత్నాభరణాలు, రసాయనాలు భారత్‌ నుంచి ఇతర దేశాలకు ఎగుమతి అయ్యాయి. 2022 మార్చిలో ఎగుమతులు ఆల్‌టైమ్‌ గరిష్ట స్థాయి 40 బిలియన్‌ డాలర్లకు చేరినట్లు వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియుష్‌ గోయల్‌ వెల్లడించారు.’ఆత్మనిర్భర్‌ భారత్‌’ లక్ష్య సాకారంలో ఎగుమతుల టార్గెట్‌ ఛేదన కీలక మైలురాయిగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు. 

చదవండి: ఎయిర్‌టెల్‌ యూజర్లకు శుభవార్త..!

మంత్రి వ్యాఖ్యలపై స్పందించిన చిత్ర యూనిట్‌..!
ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కలెక్షన్లను దేశ ఎకానమీతో పోల్చిన కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌ వ్యాఖ్యలపై చిత్ర యూనిట్‌ ట్విటర్‌లో స్పందించింది. దేశ అభివృద్ధిలో సినిమాలు ఓ చిన్న భాగంగా నిలుస్తోండడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భ‌విష్య‌త్తులో ప్రపంచస్థాయిలో మరిన్ని భారతీయ సినిమాలు సత్తా చాటుతాయనే నమ్మకం ఉందని చెప్పారు. 

చదవండి: డబ్బులే డబ్బులు...గంటలోనే రూ. 3 లక్షల కోట్లను వెనకేశారు..!

మరిన్ని వార్తలు