నిధుల సమీకరణకు ‘ద్వంద్వ లిస్టింగ్‌’ మార్గం

11 Oct, 2022 04:30 IST|Sakshi
ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్‌ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌, బీఎస్‌ఈ చైర్మన్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్‌ చరణ్‌ బోహ్రా

చిన్న వ్యాపార సంస్థలకు కేంద్ర మంత్రి పీయూష్‌ సూచన

ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గిఫ్ట్‌ సిటీపై దృష్టికి విజ్ఞప్తి  

ముంబై: చిన్న వ్యాపార సంస్థలు (ఎస్‌ఎంఈలు) తమ మూలధన సమీకరణ పక్రియను విస్తృతం చేయడానికి ‘‘ద్వంద్వ లిస్టింగ్‌’’ను పరిగణనలోకి తీసుకోవాలని వాణిజ్య, పరిశ్రమల మంత్రి పియూష్‌ గోయల్‌ విజ్ఞప్తి చేశారు. బొంబాయి స్టాక్‌ ఎక్సే్చంజ్‌ (బీఎస్‌ఈ) ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌తోపాటు గాంధీనగర్‌ గిఫ్ట్‌సిటీలో ఉన్న ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్‌లో లిస్ట్‌ అయ్యే అవకాశాలు, ప్రయోజనాలను పరిశీలించాలని కోరారు. బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌పై 400 కంపెనీల లిస్టింగ్‌ అయిన సందర్భాన్ని పురష్కరించుకుని జరిగిన ఒక కార్యక్రమంలో కేంద్ర మంత్రి మాట్లాడుతూ ఈ సూచన చేశారు. ఇంకా ఆయన ఏమన్నారంటే..

► నిధుల సమీకరణకు సంబంధించి లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో కొన్ని గిఫ్ట్‌ సిటీ ప్లాట్‌ఫామ్‌ లేదా ముంబై బీఎస్‌ఈ ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ లేదా రెండింటిలో  ద్వంద్వ లిస్టింగ్‌ జరగాలని మేము కోరుకుంటున్నాం. ఈ దిశలో మార్గాలను అన్వేషించడానికి కేంద్ర ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ఇవ్వడానికి తగిన చర్యలపై కసరత్తు జరుగుతోంది.  ఉంటుందన్నది పరిశీలించాలి.  
► ద్వంద్వ లిస్టింగ్‌ దేశీయ మూలధన సమీకరణకు దోహదపడుతుంది. అదే విధంగా గిఫ్ట్‌ సిటీలో పెట్టుబడుల యోచనలో ఉన్న అంతర్జాతీయ సంస్థల నిధులను పొందడంలోనూ ఇది సహాయపడుతుందని భావిస్తున్నాం.  
► అంతర్జాతీయ ఫండ్‌లు కూడా ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ల గురించి తెలుసుకునేలా తగిన చర్యలు అవసరం.  విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు, సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లు ఈ ఎక్సే్ఛంజ్‌ల్లో పెట్టుబడులు పెట్టేలా బీఎస్‌ఈ ప్రయత్నాలు జరపాలి.  
► ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌ భారీ సామర్థ్యాన్ని కలిగి ఉంది. మనం దానిని మరింత విస్తృతం చేయాలి. మరింత మంది దేశీయ పెట్టుబడిదారులను పొందాలి. అలాగే అంతర్జాతీయ పెట్టుబడిదారులకు వీటిపై అవగాహన కల్పించాలి.
► ఎస్‌ఎంఈ ప్లాట్‌ఫామ్‌లో మొదట లిస్టయిన 150 చిన్న కంపెనీలు ఇప్పుడు ప్రధాన ప్లాట్‌ఫామ్‌లపై వ్యాపారం చేయడానికి అన్ని అర్హతలూ పొందాయి.
► మహమ్మారి సమయంలో తీవ్రంగా దెబ్బతిన్న చిన్న మధ్య తరహా పరిశ్రలను పునరుద్ధరించడానికి కేంద్రం తగిన అన్ని చర్యలూ తీసుకుంది. ఈ దిశలో ఈసీఎల్‌జీసీ, టీఆర్‌ఈడీఎస్‌సహా పలు పథకాలను, చర్యలను అమలు చేసింది.  
► మనం మహమ్మారిని అధిగమించగలిగాము. ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిస్థితిని, ముఖ్యంగా ఉక్రెయిన్‌–రష్యా మధ్య యుద్ధ పరిణామాలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతున్నాం. ఈ భౌగోళిక ఉద్రిక్తతలు మన పరిశ్రమ విశ్వాసం, స్ఫూర్తిని నిరోధించలేదు.  
► స్టార్టప్‌ల విషయంలో దేశం పురోగమిస్తోంది. భారత్‌ 100 కంటే ఎక్కువ యునికార్న్‌లకు (బిలియన్‌ డాలర్లపైన విలువగలిగిన సంస్థలు),  70–80 ‘సూనికార్న్‌లకు‘ (యూనికార్న్‌లుగా మారడానికి దగ్గరిగా ఉన్న సంస్థలు) నిలయంగా ఉంది. స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌తో అనుసంధానానికి బీఎస్‌ఈ ఒక ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేయాలి. స్టార్టప్స్‌లోకి భారీ దేశీయ పెట్టుబడులు వెళ్లడానికి ఈ వ్యవస్థ దోహదపడుతుందని భావిస్తున్నాం. దేశీయ ఇన్వెస్టర్లు యూనికార్న్స్‌లో పెట్టుబడులకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఈ ధోరణి మారాలి.  
 

 
బీఎస్‌ఈ చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎస్‌ఎంఈ) ప్లాట్‌పామ్‌పై 400 కంపెనీలు లిస్టయిన చరిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని ముంబై ఎక్సే్చంజీ బిల్డింగ్‌లో బుల్‌ వద్ద కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌. కార్యక్రమంలో బీఎస్‌ఈ చైర్మన్‌ ఎస్‌ఎస్‌ ముంద్రా, బీజేపీ ఎంపీ రామ్‌ చరణ్‌ బోహ్రా తదితరులు పాల్గొన్నారు. బీఎస్‌ఈ ఎంఎస్‌ఈ కంపెనీల మార్కెట్‌ క్యాప్‌ రూ. 60,000 కోట్లు దాటింది.

మరిన్ని వార్తలు