పిల్లల భవిష్యత్తు కోసం...

14 Feb, 2022 05:41 IST|Sakshi

మొదటి పుట్టిన రోజు నాటికే ప్రణాళిక

లేదంటే రెట్టింపు భారం 

విద్యా ద్రవ్యోల్బణం ఎక్కువ

అధిక రాబడి మార్గాలు అవసరం

దీర్ఘకాలం ఉన్నప్పుడే రిస్క్‌ తీసుకోగలరు

ఐదేళ్లకు మించితేనే ఈక్విటీలు

ముందస్తు ఆచరణతోనే మార్గం సుగమం

పెట్టుబడులను ఆలస్యం చేయవద్దు

తల్లిదండ్రులకు పిల్లలంటే పంచ ప్రాణాలు. వారి కోసం ఏ త్యాగానికి అయినా సిద్ధంగా ఉంటారు. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తారు. ఇవన్నీ సహజమే. వారి మెరుగైన భవిష్యత్తుకు మీరు ఏమి చేయగలరు? ఇది అత్యంత కీలకమైన విషయం. ‘పిల్లలకు ఇచ్చే గొప్ప ఆస్తి విద్య’ అని వివేకానందుడు ఎప్పుడో చెప్పాడు. కనుక పిల్లలపై ప్రేమతో మీరు ఏం చేసినా అది నాణేనికి ఒక కోణమే. వారికి నాణ్యమైన విద్య అందించడం రెండో కోణం అవుతుంది. దీనికి ముందు చూపు కావాలి. పక్కా ఆచరణతో నడవాలి. మెరుగైన ప్రణాళిక కావాలి. దీనికి క్రమశిక్షణ తోడవ్వాలి. అప్పుడే కల నెరవేరుతుంది.  

భవిష్యత్తుకు సంబంధించి ఏ లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నారు? వాటికి ఎంత వ్యవధి ఉంది? వీటిపై ముందు స్పష్టత తెచ్చుకోవాలి. పిల్లలకు సంబంధించి భవిష్యత్తు లక్ష్యాల్లో ముందుగా వచ్చేది విద్యా అవసరాలే. తర్వాత వివాహం. సాధారణ ద్రవ్యోల్బణం కంటే విద్యా ద్రవ్యోల్బణం మరింత ఎక్కువగా ఉంటోంది. ఫీజులు ఏటా 10–15% చొప్పున పెరుగుతున్నాయి. కనుక ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుని భవిష్యత్తులో విద్యకు అయ్యే వ్యయంపై అంచనాలకు రావాలి. ఉన్నత విద్యా ఖర్చుల కోసం ముందు నుంచి సన్నద్ధం కావాలి. వివాహ ఖర్చు అన్నది మీ చేతుల్లో ఉండేది. పరిస్థితులకు అనుగుణంగా కొంత తగ్గించుకోగలరు.

ముందు విద్యకు ప్రాధా న్యం ఇచ్చి, ఆ తర్వాత వివాహ లక్ష్యంపై దృష్టి పెట్టాలి. విద్యా ఖర్చుకు సంబంధించిన అంచనాల్లో ఎక్కువ మంది బోల్తా పడుతుంటారు. ఆ సమయం వచ్చే సరికి కావాల్సినంత సమకూరదు. కనుక పెరిగే ఖర్చులకు తగ్గట్టు పొదుపు ప్రణాళికలు ఉండాలి. అధిక నాణ్యమైన విద్యను అందించే సంస్థలు, అత్యుత్తమ బోధనా సిబ్బంది, వసతులు, విదేశీ విద్యా సంస్థలతో భాగస్వామ్యాలు కలిగినవి సహజంగానే విద్యార్థులను ఆకర్షిస్తుంటాయి. ఇతర విద్యా సంస్థలతో పోలిస్తే ఈ తరహా విద్యా సంస్థల ఫీజులు అధికంగా ఉంటుంటాయి. డిమాండ్‌ ఎక్కువగా ఉండడంతో ఇవి గరిష్ట ఫీజులను వసూలు చేస్తుంటాయి.

చదువుతోపాటు ఇతర కళలు
విద్యతోపాటే సమాంతరంగా పిల్లలకు నేర్పించే ఇతర నైపుణ్యాలు కూడా ఉంటాయని మర్చిపోవద్దు. క్రీడలు, సంగీతం, కళలు తదితర వాటిల్లో ఏదైనా ఒక విభాగంలో మీ చిన్నారిని చాంపియన్‌గా తీర్చిదిద్దాలనుకోవచ్చు. కనుక ఈ తరహా నైపుణ్యాల కోసం చేసే ఖర్చు అదనంగా ఉంటుంది. దీనికితోడు విడిగా ట్యూషన్‌ చెప్పించాల్సి రావచ్చు. ఆ ఖర్చును కూడా తల్లిదండ్రులు పరిగణనలోకి తీసుకోవాలి.

వ్యయ అంచనాలు
శిశువుగా ఉన్నప్పుడే పిల్లలకు సంబంధించి ప్రణాళిక మొదలు పెడితే.. పెట్టుబడులకు ఎంతలేదన్నా 15–20 ఏళ్ల కాలవ్యవధి మిగిలి ఉంటుంది. ఈ కాలంలో ద్రవ్యోల్బణం సగటున ఎంత ఉంటుందన్న అంచనాకు రావాలి. ఒకవేళ ఉన్నత విద్య కోసం పిల్లలను విదేశీ విద్యా సంస్థలకు పంపించాలనుకుంటే అప్పుడు ద్రవ్యోల్బణంతోపాటు.. రూపాయి మారకం విలువను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. సగటు విద్యా ద్రవ్యోల్బణం 8–10 శాతం మధ్య ఉంటోంది.

ఐదేళ్ల క్రితం ఇది 6 శాతం స్థాయిలోనే ఉంది. కనుక భవిష్యత్తులోనూ 8–10 శాతం వద్దే ఉంటుందని అనుకోవడానికి లేదు. ఇంకాస్త అదనపు అంచనా వేసుకున్నా నష్టం ఉండదు. భవిష్యత్తులో ఏ కోర్సు చేయాలన్నది పిల్లల అభిమతంపైనే ఆధారపడి ఉంటుంది. అది ముందుగా తెలుసుకోలేరు. కనుక తల్లిదండ్రులు తమ ఇష్టానుసారం ఒక కోర్సును అనుకుని దానికి సంబంధించి ప్రణాళిక రూపొందించుకోవచ్చు. ఈ అంచనాకు 10 శాతం అదనంగా సమకూర్చుకునే ప్రణాళికతో ముందుకు సాగిపోవాలి.

విదేశీ విద్య అయితే..
గతంతో పోలిస్తే విదేశాల్లో గ్రాడ్యుయేషన్, ప్రోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ చేసే వారి సంఖ్య పెరిగింది. విదేశీ విద్యతో విదేశాల్లోనే మెరుగైన అవకాశాలు సొంతం చేసుకుని అక్కడే స్థిరపడాలన్న ధోరణి కూడా పెరుగుతోంది. తల్లిదండ్రులుగా మీ పిల్లలను విదేశాలకు పంపించాలనుకుంటే.. లేదా పిల్లలు భవిష్యత్తులో విదేశీ ఆప్షన్‌ కోరుకునే అవకాశం ఉందనుకుంటే.. అందుకోసం పెద్ద నిధి అవసరం పడుతుంది. ఐఐఎంలో చేసే కోర్సు వ్యయంతో పోలిస్తే హార్వర్డ్‌ లాంటి ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో కోర్సు వ్యయం నాలుగైదు రెట్లు అధికంగా ఉంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కోర్సులను అందించే దేశీయ ప్రైవేటు విద్యా సంస్థల్లోనూ కోర్సుల వ్యయాలు అధికంగానే ఉన్నాయి. విదేశీ విద్య అయితే అక్కడ నివాస వ్యయాలు కూడా కలుస్తాయి. ఇవి ఎక్కువగా ఉంటాయి. దేశీయంగా అయితే నివాస వ్యయాలు తక్కువగా ఉంటాయి.

పేరున్న విద్యా సంస్థల్లో అధిక ఫీజులు
ప్రైవేటు విద్యా సంస్థల్లో కోర్సులకు అధిక ఫీజులు చెల్లించాలి. ప్రభుత్వ విద్యా సంస్థల్లో చౌకగా పూర్తవుతుందనే అభిప్రాయం ఉంటే దాన్ని తీసివేయండి. ప్రభుత్వంలోనూ ప్రతిష్టాత్మకమైన విద్యా సంస్థలు చాలానే ఉన్నాయి. వీటిల్లో కోర్సుల వ్యయాలు ప్రైవేటుకు ఏ మాత్రం తీసిపోవు. ఐఐటీలు, నిట్‌లు, ఏఐఐఎంఎస్, ఐఐఎస్‌సీ, ఐఐఎంల్లో ప్రవేశాలకు ఏటా డిమాండ్‌ పెరుగుతూనే ఉంది. ఇక్కడ సరఫరా తక్కువ డిమాండ్‌ ఎక్కువ. కాకపోతే వీటిల్లో కోర్సులకు ‘హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ ఫైనాన్సింగ్‌ ఏజెన్సీ’ నుంచి రుణాలు పొందే అవకాశం ఉంటుంది. వీటిల్లో చాలా ఇనిస్టిట్యూషన్స్‌ సొంతంగానే వనరులను సమకూర్చుకోవాల్సి ఉంటుంది. కనుకనే ఎప్పటికప్పుడు ఇవి ఫీజులను సవరిస్తున్నాయి.

ప్రాథమిక విద్య నిర్లక్ష్యం వద్దు..
పిల్లల భవిష్యత్తు విద్యా అవసరాలకు ప్రణాళిక వేసుకునే సమయంలో పాఠశాల విద్యను తక్కువ అంచనా వేసుకోవద్దు. కొన్ని ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు ఉన్నత విద్యా కోర్సుల స్థాయిలో ఫీజులు వసూలు చేస్తున్నాయి. పిల్లల విద్య ఖర్చు భరించలేక అప్పులు చేసే వారు చాలా మంది ఉన్నారు. ముందు చూపు లేకపోవడం వల్ల వచ్చే సమస్యే ఇది. ముందు నుంచే కావాల్సినంత మేర పొదుపు, మదుపు చేస్తూ వస్తే రుణాల అవసరం ఏర్పడదు. ఒకవేళ కొంచెం అంచనాలు తప్పినా పెద్ద ఇబ్బంది ఏర్పడదు. విద్యా రుణాలను ఉన్నత విద్య సమయంలో తీసుకోవడం తప్పు కాదు. అది పూర్తగా వారికొచ్చే వేతనం నుంచి చెల్లింపులు చేసే వెసులుబాటు ఉంటుంది. కానీ, పాఠశాల విద్యకు సొంత వనరులే మార్గం కావాలి. మొదటి నుంచే రుణ బాట పడితే.. 15 ఏళ్ల తర్వాత భారీ వ్యయాలు అయ్యే కోర్సుల్లో చేరటం కష్టమవుతుంది.  

పెట్టుబడుల పోర్ట్‌ఫోలియో
పిల్లల విద్యకు సంబంధించి పెట్టుబడుల విషయంలో భావోద్వేగాలకు చోటు ఇవ్వొద్దు. తమ అవసరాలకు సరిపడే ఉత్పత్తులను ఎక్కువ మంది ఎంపిక చేసుకోకపోవడాన్ని గమనించొచ్చు. పిల్లల కోసం పెట్టుబడి, తమకు ఏదైనా జరగరానికి జరిగితే బీమా రక్షణ కలగలసిన ఉత్పత్తులను ఎంపిక చేసుకుంటుంటారు. కానీ, బీమా, ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ఈ రెండూ విడిగా లభించే సాధనాలు. అటువంటప్పుడు రెండింటినీ కలపాల్సిన అవసరం ఏముంటుంది? అందుకుని ముందుగా టర్మ్‌ ఇన్సూరెన్స్‌ను తగినంత కవరేజీతో తీసుకోవాలి. ఏదైనా ఊహించనిది జరిగితే ఎంతో ప్రేమించే తమ కుటుంబం ఇబ్బందుల్లో పడకుండా టర్మ్‌ ప్లాన్‌ ఆదుకుంటుంది.

కుటుంబ వ్యయాలు, పిల్లల విద్యా వ్యయాలు, ఇతర అవసరాలను కలిపి టర్మ్‌ కవరేజీ  ఎంతన్నది నిర్ణయించుకోవాలి. ఆరోగ్య అవసరాలు, రుణ అవసరాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ముందే ఆరంభిస్తే కాంపౌండింగ్‌ కలిసొస్తుంది. రిస్క్‌ తీసుకుని ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే వెసులుబాటు లభిస్తుంది. ఎక్కువ పెట్టుబడులను ఈక్విటీకే కేటాయించుకోవచ్చు. తద్వారా అధిక రాబడులు అవకాశం ఉంటుంది. ఈక్విటీల్లో స్వల్ప కాలంలోనే (3–5ఏళ్లు) రిస్క్‌. దీర్ఘకాలంలో కళ్లు చెదిరే రాబడులు ఉంటాయి. అదే ఆలస్యంగా మొదలు పెడితే రిస్క్‌కు అవకాశం ఉండదు. కనుక డెట్‌ సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేయాలి. వీటిల్లో రాబడి 8 శాతం మించదు.

ద్రవ్యోల్బణం కూడా ఇదే స్థాయిలో ఉంటుంది కనుక నికరంగా వచ్చే రాబడి ఏమీ ఉండదు. కనీసం ఐదేళ్లకు పైబడిన కాలానికే ఈక్విటీలను ఎంపిక చేసుకోవచ్చు. ఐదేళ్లలోపు కోసం అయితే ఈక్విటీలు సూచనీయం కాదు. సిస్టమ్యాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ ద్వారా ఇన్వెస్ట్‌ చేసుకుంటూ వెళ్లాలన్నది నిపుణుల సూచన. బీమా, ఈక్విటీలతో కూడిన ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. కానీ, వీటిల్లో వ్యయాలు ఎక్కువ. రాబడులను సమీక్షించుకోవడం మ్యూచువల్‌ ఫండ్స్‌ పథకాలతో పోలిస్తే కొంచెం క్లిష్టం. కనుక మెరుగైన ఈక్విటీ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవడమే మంచి మార్గం అవుతుంది. ఒకవేళ పిల్లల విదేశీ విద్య కోసం అయితే.. విదేశీ ఈక్విటీల్లో ఇన్వెస్ట్‌ చేసే మ్యూచువల్‌ ఫండ్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. తద్వారా కరెన్సీ మారకం విలువ మార్పులకు హెడ్జ్‌ చేసుకున్నట్టు అవుతుంది. డెట్‌ సాధనాల్లో అయితే సుకన్య సమృద్ధి యోజన (కుమార్తెల కోసం), పబ్లిక్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌), లాంగ్‌ డ్యురేషన్‌ ఫండ్స్‌ను పరిగణనలోకి తీసుకోవచ్చు. 

పొదుపు... చిన్న అడుగులు
పొదుపు ముందే ప్రారంభిస్తే లక్ష్యం సులభం అవుతుంది. ఆలస్యం చేసిన కొద్దీ అది భారంగా మారుతుంది. 5 ఏళ్లు ఆలస్యం చేసినా, చేయాల్సిన పొదుపు రెట్టింపు అయిపోతుంది. అందుకనే చిన్నారి జన్మించిన వెంటనే పొదుపు, పెట్టుబడి ఆరంభించాలి. ఆలస్యం చేసినా మొదటి పుట్టిన రోజు నుంచి అయినా ఈ ప్రణాళికను అమలు చేయాలి. అప్పుడే అనుకున్నంత సమకూర్చుకోగలరు. ఉన్నత విద్య కోసం సాధారణంగా 18 ఏళ్లు ఉంటుంది. ప్రాథమికోన్నత పాఠశాల విద్య కోసం 10 ఏళ్ల వ్యవధి ఉంటుంది. అందుకని ఉన్నతవిద్య, ప్రాథమిక విద్యకు వేర్వేరుగా ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిది.   

విద్యా రుణం
ఇది చివరి ఎంపికగానే ఉండాలి. విద్యా రుణం చాలా సులభంగా లభిస్తుంది. ఫీజులకు చాలకపోతే రుణం తీసుకోవచ్చులేనన్న భరోసాతో పెట్టుబడులను నిర్లక్ష్యం చేయవద్దు. నిజాయితీ పెట్టుబడులు చేస్తూ, చివర్లో కావాల్సిన మొత్తానికి తగ్గితే (రాబడుల అంచనాలు మారి) లేదా అంచనాలకు మించి కోర్సుల వ్యయాలు పెరిగిపోతే అప్పుడు ఎలానూ అదనంగా సమకూర్చుకోవాలి. అటువంటి పరిస్థితుల్లో విద్యారుణం బాట పట్టొచ్చు. లేదా ఉద్యోగం లేదా ఉపాధి పరంగా సమస్యలతో ఆర్థిక ఇబ్బందులు ఎదురుకావచ్చు. అటువంటి పరిస్థితుల్లో విద్యా రుణాన్ని ఆశ్రయించొచ్చు. అది కూడా ఉద్యోగం పొందిన తర్వాత పిల్లలు చెల్లించే సౌలభ్యం పరిధిలోనే ఉండేలా చూసుకోవడం మర్చిపోవద్దు.  

మరిన్ని వార్తలు