ఇల్లు కొనాలని ప్లాన్‌ చేస్తున్నారా...అయితే మీకో శుభవార్త!

12 Apr, 2021 09:15 IST|Sakshi

ఇంటిపై పెట్టుబడి.. బోలెడు పన్ను ఆదా.. 

రెండో ఇంటిపైనా పన్ను ప్రయోజనం 

సెక్షన్‌ 80సీ, 24, 80ఈఈఏ కింద అనుమతి 

కొన్ని పరిమితుల మేరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు 

ఇల్లు కొనుగోలు అన్నది చాలా మంది విషయంలో అత్యంత ఖరీదైన వ్యవహారం. మధ్యతరగతి నుంచి సంపన్నుల వరకు.. ఇంటి కొనుగోలుతో తమకు ఓ స్థిరమైన నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడమే కాదు.. బోలెడు పన్ను ప్రయోజనాలను అందుకోవచ్చు. దేశవ్యాప్తంగా చాలా మార్కెట్లలో ఇళ్ల ధరలు స్తబ్దుగానే ఉన్నాయి. గతేడాది కరోనా ప్రవేశించినప్పటి నుంచి ఇళ్ల ధరలు పెద్దగా పెరిగింది లేదు. సొంతింటి కోసం ప్రణాళిక వేసుకునే వారికి ఇది అత్యంత అనుకూల సమయంగా మార్కెట్‌ నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే వడ్డీ రేట్లు చాలా కనిష్ట స్థాయిలకు వచ్చేశాయి. పైగా పన్ను ఆదాను కలిపి చూసుకుంటే ఇంటి కొనుగోలు మంచి లాభసాటే అవుతుంది. ఇంటిపై పన్ను ప్రయోజనాలు ఎన్నిరకాలుగా ఉన్నాయనే వివరాలను ఈ కథనంతో తెలుసుకుందాం.. 

మొదటి ఇంటి కొనుగోలు.. 
మొదటి సారి ఇంటిని కొనుగోలు చేస్తున్నట్టయితే.. ఆదాయపన్ను చట్టంలోని మూడు సెక్షన్ల కింద ప్రయోజనాలకు అర్హులు. ఉదాహరణకు రూ.40 లక్షల ఇంటిని 80 శాతం రుణంతో (రూ.36 లక్షలు) కొనుగోలు చేస్తున్నారనుకుంటే.. 20 ఏళ్ల కాలానికి వడ్డీ రేటు 7 శాతం అనుకుంటే నెలవారీ ఈఎంఐ రూ.31,000 అవుతుంది. మొదటి ఏడాదిలో రూ.3,72,000 చెల్లించాల్సి వస్తుంది. ఇందులో రూ.2.77 లక్షలు రుణంపై వడ్డీ కింద జమ అవుతుంది. రూ.95,000 రుణానికి అసలు కింద జమ అవుతుంది. రుణ గ్రహీత వార్షిక ఆదాయం రూ.15 లక్షలు అనుకుంటే ఈ కేసులో.. రూ.95,000 అసలు చెల్లింపులను సెక్షన్‌ 80సీ కింద చూపించుకోవచ్చు.

ఒక ఆర్థిక సంవత్సరంలో సెక్షన్‌ 80సీ కింద రూ.1.50 లక్షల మొత్తంపై పన్ను ఆదాకు అవకాశం ఉంటుంది. కనుక మిగిలిన రూ.55,000ను ఇంటి కొనుగోలు కోసం చెల్లించిన స్టాంప్‌ డ్యూటీ చార్జీలను మొదటి ఏడాది కింద మినహాయింపుగా చూపించుకోవచ్చు. ఇక వడ్డీ భాగం కింద రూ.2.77 లక్షల చెల్లింపుల్లో రూ.2,00,000ను సెక్షన్‌ 24 కింద చూపించుకోవడం ద్వారా ఆ మొత్తంపై రూపాయి పన్ను చెల్లించక్కర్లేదు. మిగిలిన రూ.77,000ను సెక్షన్‌ 80ఈఈఏ కింద క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అంటే మొదటి ఏడాదిలో రూ.4.27లక్షల మొత్తంపై పన్ను మినహాయింపును క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే, ప్రిన్సిపల్‌ (అసలు), వడ్డీ భాగం అన్నది ఏటా మారుతుంటుంది. కనుక పన్ను మినహాయింపుల విషయమై ఏటా ముందే ఓ స్పష్టతకు రావాలి. 

రెండో ఇంటిపై పెట్టుబడి పెడుతుంటే..? 
అందరూ మొదటిసారే ఇళ్లను కొనుగోలు చేస్తారని అనుకోవడానికి లేదు. రెండో ఇంటిపైనా ఇన్వెస్ట్‌ చేసే వారు ఉంటారు. కనుక రెండో ఇంటి కొనుగోలుకు రుణం తీసుకున్నట్టయితే.. వడ్డీ చెల్లింపుల భాగాన్ని సెక్షన్‌ 24(బి) కింద చూపించుకునే అవకాశం ఉంది. కానీ, ఇక్కడొక పరిమితి ఉంది. రెండు ఇళ్లకూ కలిపి సెక్షన్‌ 24(బి) కింద గరిష్టంగా రూ.2లక్షల వడ్డీ చెల్లింపులకే పన్ను మినహాయింపు పొందగలరు. 2019–20 నుంచి రెండో ఇల్లు, సొంతంగా ఉండే ఇంటిపై నోషనల్‌ రెంట్‌ ఎత్తి వేశారు.

అంటే 2019–20 ముందు వరకు ఒక్క ఇంటినే సొంతానికి వినియోగిస్తున్నట్టు చూపించుకునే అవకాశం ఉండగా.. ఆ తర్వాత నుంచి రెండు ఇళ్లను సైతం సొంత వినియోగం కింద చూపించుకునే అవకాశం కల్పించారు. దీంతో నోషనల్‌ రెంట్‌ రూపంలో పన్ను చెల్లించాల్సిన ఇబ్బంది తప్పింది. రెండు ఇళ్లనూ స్వీయ వినియోగానికే కేటాయించుకుంటే.. గరిష్టంగా రూ.2,00,000 వడ్డీ చెల్లింపులను సెక్షన్‌ 24 (బి) కింద.. సెక్షన్‌ 80సీ కింద రూ.1,50,000 వరకు అసలు చెల్లింపులపై పన్ను లేకుండా చేసుకోవచ్చు. ఒకవేళ ఇంటిని అద్దెకు ఇచ్చారనుకుందాం.. అప్పుడు అద్దె ఆదాయం నుంచి 30 శాతాన్ని ప్రామాణిక మినహాయింపు కింద చూపించుకోవచ్చు.

అదే సమయంలో ఇంటి అద్దె ఆదాయన్ని కూడా వార్షిక ఆదాయానికి కలిపి చూపిస్తూ.. అదే ఇంటి రుణానికి చేసే వడ్డీ చెల్లింపులు మొత్తంపైనా (పరిమితి లేకుండా) పన్ను మినహాయింపు పొందొచ్చు. అలాగే, ఇతర ఆదాయ నష్టం రూ.2,00,000 వరకు సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. ఇలా సర్దుబాటు చేసుకున్న తర్వాత ఏదైనా మిగులు ఉంటే దాన్ని తదుపరి ఎనిమిది సంవత్సరాలకు క్యారీ ఫార్వార్డ్‌ చేసుకోవచ్చని ఎన్‌ఏ షా అండ్‌ అసోసియేట్స్‌ పార్ట్‌నర్‌ అశోక్‌ షా పేర్కొన్నారు. 


జాయింట్‌గా ఇంటి కొనుగోలుపై.. 
భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేస్తే.. వారు విడివిడిగా పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హులు. అయితే, ఇక్కడ పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునేందుకు స్త్రీ, పురుషులు ఇరువురూ ఆదాయ వనరు కలిగి ఉండడం తప్పనిసరి. అలా కాకుండా.. భార్యా, భర్త ఉమ్మడిగా ఇంటిని కొనుగోలు చేసినప్పటికీ.. భార్యకు ఎటువంటి ఆదాయ వనరు లేకపోతే.. పన్ను ప్రయోజనాలకు భర్త ఒక్కరే అర్హులవుతారు. పన్ను ప్రయోజనాలను భార్యా, భర్తలు ఇద్దరూ విడిగా క్లెయిమ్‌ చేసుకునేట్టు అయితే.. వారు ఎంత మేరకు వాటా కలిగి ఉన్నారన్నదానిపై ఇది ఆధారపడి ఉంటుంది. ఇద్దరి ఆదాయాన్ని కలిపితే అర్హత ఎక్కువ లభిస్తుంది. రుణం సాఫీగా మంజూరవుతుంది. మహిళా దరఖాస్తుదారులకు కొన్ని బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లపై గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి. దీంతో చెల్లించాల్సిన ఈఎంఐ కూడా తక్కువగా ఉంటుంది. అలాగే, చాలా రాష్ట్రాలలో మహిళా కొనుగోలుదారులకు స్టాంప్‌డ్యూటీ రేటు తక్కువ అమలవుతోంది. ‘‘సెక్షన్‌ 80సీ కింద గృహ రుణం అసలు చెల్లింపులు రూ.1.50లక్షలు.. సెక్షన్‌ 24 కింద గృహ రుణంపై వడ్డీ రూ.2,00,000 వరకు మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. భార్యా భర్తలు ఉమ్మడిగా గృహ రుణం తీసుకుంటే ఎవరికి వారు గరిష్టంగా ఈ మేరకు పన్ను మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకునేందుకు అర్హులు’’అని నిస్‌ ఫైనాన్స్‌ ఎండీ, సీఈవో అమిత్‌గోయంకా తెలిపారు.  

ఉదాహరణ: ఇప్పుడు ఒక జంట ఉమ్మడిగా గృహ రుణం తీసుకుని రూ.కోటి విలువైన ఇంటిని కొనుగోలు చేశారని అనుకుందాం. ఇందు కోసం రూ.90,00,000 రుణాన్ని బ్యాంకు నుంచి 7 శాతం వడ్డీ రేటుపై తీసుకున్నారు. స్టాంప్‌డ్యూటీ, రిజిస్ట్రేషన్‌ చార్జీల రూపేణా వీరు రూ.3,00,000 చెల్లించారు. ఇలా చూస్తే ఈ జంట మొదటి ఏడాది రూ.5,50,000ను వడ్డీ రూపంలో చెల్లించాల్సి వస్తుంది. అలాగే, రూ.2,00,000ను ప్రిన్సిపల్‌గా జమ చేయాలి. ఇటువంటి సందర్భంలో.. వీరు ఎవరికి వారే విడిగా.. సెక్షన్‌ 24 (బి) కింద గరిష్టంగా రూ.2లక్షలను వడ్డీ రూపంలో మినహాయింపులను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. ఒకవేళ అద్దెకు ఇస్తే ఈ పరిమితి రూ.2,75,000కు పెరుగుతుంది. సెక్షన్‌ 80సీ కింద ఎవరికి వారు రూ.1.50 వరకు క్లెయిమ్‌ చేసుకోవచ్చు. 

మహిళ కొనుగోలుదారుగా ఉంటే.. 
ఆదాయపన్ను చట్టం కింద మహిళలకు ఎటువంటి ప్రత్యేక ప్రయోజనాలు ఇంటిపై లేవు. పురుషులతో సమానంగా ఆదాయపన్ను చట్టం కింద పైన పేర్కొన్న అన్ని ప్రయోజనాలను క్లెయిమ్‌ చేసుకోవచ్చు. అయితే, కొన్ని రాష్ట్రాలు మహిళలు ఇంటి కొనుగోలుదారులుగా ఉంటే స్టాంప్‌ డ్యూటీ చార్జీల్లో 1–2 శాతం వరకు తగ్గింపును ఆఫర్‌ చేస్తున్నాయి. రాజస్తాన్‌లో స్టాంప్‌ డ్యూటీ చార్జీ 8.8 శాతంగా ఉంటే.. 
మహిళలకు 7.5 శాతమే అమలు చేస్తున్నారు. ఇటువంటి ప్రయోజనాలు ఉంటే వాటిని 
ఉపయోగించుకోవచ్చు.  

మరిన్ని వార్తలు