ఇన్‌ఫ్రా ప్రాజెక్టులు.. ప్రజల నెత్తిన రూ 4.38 లక్షల కోట్ల భారం!

27 Dec, 2021 08:07 IST|Sakshi

ఆలస్యం కారణంగా పెరిగిన  నిర్మాణ వ్యయం

కేంద్ర ప్రణాళిక సంఘం వెల్లడి  

న్యూఢిల్లీ: ఒకటో వంతు మౌలిక రంగ ప్రాజెక్టులు అధిక వ్యయ భారంతో, జాప్యంతో కొనసాగుతున్నట్టు కేంద్ర ప్రణాళికలు, కార్యక్రమాల అమలు శాఖ తెలిపింది. రూ.150 కోట్ల వ్యయాలకు మించి 1,679 కోట్ల ప్రాజెక్టులకు గాను సుమారు 439 ప్రాజెక్టులు.. మొత్తం మీద రూ.4.38 లక్షల కోట్ల అధిక వ్యయ భారంతో నెట్టుకొస్తున్నాయని పేర్కొంది. ‘‘1,679 ప్రాజెక్టుల వాస్తవ వ్యయం రూ.22,29,544 కోట్లు. కానీ, వీటిని పూర్తి చేసేందుకు రూ.26,67,594 కోట్లు అవసరమవుతుంది. అదనంగా రూ.4,38,049 కోట్లు కావాలి. ఇది 19.65 శాతం అధికం’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది.

2021 నవంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టుల కోసం చేసిన ఖర్చు రూ.12,88,558 కోట్లు కాగా, మొత్తం అంచనా వ్యయాల్లో 48.30 శాతమని వివరించింది. ‘‘నిర్ణీత కాలవ్యవధికి అనుగుణంగా కాకుండా, ఆలస్యంగా నడుస్తున్న 541 ప్రాజెక్టుల్లో.. 90 ప్రాజెక్టులు 1–12 నెలలపాటు ఆలస్యం కాగా, 113 ప్రాజెక్టులు 13–24 నెలలుగా జాప్యంతో నడుస్తున్నాయి. 212 ప్రాజెక్టులు 25–60 నెలలుగా పూర్తికాకుండా ఉన్నాయి. మరో 126 ప్రాజెక్టులు 61 నెలల జాప్యంతో ఉన్నాయి’’ అని ప్రణాళిక శాఖ తెలిపింది.   
 

చదవండి:ఏఏఐకు ఎయిర్‌లైన్స్‌ బకాయిలు రూ.2,636 కోట్లు

మరిన్ని వార్తలు