టెలికాం రంగంలోకి పెట్టుబడుల జోరు

4 Jun, 2021 14:24 IST|Sakshi

పీఎల్‌ఐ స్కీమ్‌  నమోదు ప్రక్రియ ప్రారంభం..

జూలై 30 దాకా గడువు

న్యూఢిల్లీ: దేశీయంగా టెలికం పరికరాల తయారీకి ఊతమిచ్చేందుకు ఉద్దేశించిన రూ.12,195 కోట్ల ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహకాల (పీఎల్‌ఐ) స్కీముకు సంబంధించిన మార్గదర్శకాలను కేంద్రం గురువారం విడుదల చేసింది. టెలికం శాఖ(డాట్‌) జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం పథకంలో నమోదు చేసుకునే ప్రక్రియ శుక్రవారం (జూన్‌ 4న) ప్రారంభమై జూలై 3 దాకా కొనసాగుతుంది. అర్హత పొందిన కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం నుంచి 2025-26 దాకా పెట్టే పెట్టుబడులు, విక్రయాలపై ఈ స్కీము కింద ప్రోత్సాహకాలు పొందవచ్చు. ఏప్రిల్‌ 1 నుంచి దీన్ని వర్తింపజేస్తారు. అధునాతన టెక్నాలజీ ఊతంతో దేశీ కంపెనీలు అంతర్జాతీయ దిగ్గజాలుగా ఎదిగేందుకు తోడ్పాటు అందించడం స్కీము ప్రధాన లక్ష్యమని డాట్‌ వెల్లడించింది. 

ఈ పథకం ఊతంతో వచ్చే అయిదేళ్లలో దేశీయంగా రూ. 2.44 లక్షల కోట్ల విలువ చేసే టెలికం పరికరాల ఉత్పత్తి జరగగలదని అంచనా. టెలికం పీఎల్‌ఐ ద్వారా సుమారు 40,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభించనుంది. దీనితో దాదాపు రూ.3,000 కోట్ల మేర పెట్టుబడులు రానుండగా, రూ.17,000 కోట్ల మేర ప్రభుత్వానికి పన్ను రూపంలో ఆదాయం సమకూరగలదని అంచనాలు ఉన్నాయి. దేశ, విదేశ కంపెనీలు.. చిన్న, మధ్య తరహా సంస్థలు దీని కింద దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస పెట్టుబడి పరిమితి.. ఎంఎస్‌ఎంఈలకు రూ.10 కోట్లుగాను, ఇతర సంస్థలకు రూ.100 కోట్లుగాను ఉంటుంది. స్థలం, నిర్మాణ వ్యయాలను పెట్టుబడి కింద పరిగణించరు. ఎరిక్సన్, నోకియా, హెచ్‌ఎఫ్‌సీఎల్‌ వంటి అంతర్జాతీయ టెలికం పరికరాల తయారీ సంస్థలు భారత్‌లో కార్యకలాపాలు విస్తరించడంపై ఆసక్తిగా ఉన్నాయి. 

స్టీల్, ఆటో, జౌళి రంగాలు త్వరలో నోటిఫై
ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి రంగాల్లో అమలుకుగాను ఉత్పాదకత ఆధారిత ప్రోత్సాహక పథకాన్ని(పీఎల్‌ఐ) కేంద్రం త్వరలో నోటిఫై చేయనుంది. తద్వారా ఈ పథకం కింద ఆయా రంగాల్లో పెట్టుబడులకు సంబంధిత సంస్థలకు వీలుకలుగుతుంది. పథకం అమలుకు సంబంధించి ప్రకటించిన నోటిఫికేషన్‌ విధివిధానాలకు అనుగుణంగా  సంస్థలు కేంద్రానికి దరఖాస్తు చేసుకోగలుగుతాయి. అనంతరం దరఖాస్తుల ఎంపిక ప్రక్రియ ఉంటుంది. ఇప్పటికే ఫార్మా, ఐటీ హార్డ్‌వేర్‌ వంటి రంగాలకు పీఎల్‌ఐ నోటిఫై జరిగింది. ఆటో విడిభాగాలు, స్టీల్, జౌళి వంటి రంగాలకు సంబంధించి నోటిఫికేషన్‌ జారీ విషయాన్ని పరిశీలిస్తున్నట్లు డీపీఐఐటీ(పారిశ్రామిక, అంతర్గత వాణిజాభివృద్ధి శాఖ) అదనపు కార్యదర్శి సుమితా దావ్రా గురువారం జరిగిన ఇండస్ట్రీ చాంబర్‌ పీహెచ్‌డీసీసీఐ వెబినార్‌లో వెల్లడించారు. 

భారత్‌ తయారీ రంగాన్ని అంతర్జాతీయ స్థాయిలో పటిష్టం చేయడానికి వీలుగా కేంద్రం ఐదేళ్ల కాలపరిమితికిగాను రూ.2 లక్షల కోట్ల విలువైన పీఎల్‌ఐ పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. మొత్తం 13 రంగాలకు ఈ పథకం కింద రాయితీలు వర్తిస్తాయి. ఏసీసీ బ్యాటరీ, సోలార్‌ మాడ్యూల్స్‌ విభాగాలకు కూడా ఈ పథకాన్ని విస్తరించాలని కూడా కేంద్రం ఇటీవలే నిర్ణయించింది. సప్లై చైన్‌ సవాళ్ల పరిష్కారం, తయారీ రంగంలోకి భారీ విదేశీ పెట్టుబడులకు కూడా తగిన వ్యూహ రచన చేస్తున్నట్లు వెబినార్‌లో సుమితా దావ్రా పేర్కొన్నారు. దేశీయ, అంతర్జాతీయ పెట్టుబడులను ఆకర్షించడానికి పీఎల్‌ఐ స్కీమ్‌ దోహదపడుతుందన్నారు.

చదవండి: భారీగా పెరుగుతున్న ఇంటర్నెట్‌ సగటు వినియోగం

మరిన్ని వార్తలు