భారత్‌లో అవకాశాలను సొంతం చేసుకోండి

21 Oct, 2021 05:47 IST|Sakshi

అంతర్జాతీయ గ్యాస్, చమురు కంపెనీలకు ప్రధాని పిలుపు

న్యూఢిల్లీ: భారత్‌లో సహజవాయువు, చమురు అన్వేషణ అవకాశాలను సొంతం చేసుకోవాలంటూ అంతర్జాతీయ చమురు, గ్యాస్‌ కంపెనీలకు ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వనం పలికారు. చమురు, గ్యాస్‌ రంగంలో అన్వేషణ, అభివృద్ధి కార్యకలాపాలకు భారత్‌తో చేతులు కలపాలని కోరారు. అంతర్జాతీయ చమురు కంపెనీల సీఈవోలు, ఈ రంగానికి చెందిన నిపుణులతో ప్రధాని మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ముచ్చటించారు. ఇంధన వనరుల పెంపు, అందుబాటు ధరలు, ఇంధన భద్రత దిశగా భారత్‌ చేపట్టిన చర్యలను పరిశ్రమకు చెందిన వారు మెచ్చుకున్నట్టు ప్రభుత్వం ఓ ప్రకటనలో తెలిపింది.

గత ఏడేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు, గ్యాస్‌ రంగంలో చేపట్టిన సంస్కరణల గురించి వారికి ప్రధాని వివరంగా తెలియజేసినట్టు ప్రకటించింది. ఈ రంగంలో భారత్‌ను స్వావలంబన దిశగా తీసుకెళ్లడమే ఈ సంస్కరణల లక్ష్యమని తెలియజేసినట్టు.. ముడి చమురు నిల్వ సదుపాయాలను పెంచుకోవాల్సిన అవసరాన్ని ప్రధాని ప్రస్తావించినట్టు తెలిపింది. దేశంలో పెరుగుతున్న గ్యాస్‌ అవసరాలను తీర్చేందుకు వీలుగా గ్యాస్‌ పైపులైన్ల నిర్మాణం, పట్టణ గ్యాస్‌ పంపిణీ, ఎల్‌ఎన్‌జీ రీగ్యాసిఫికేషన్‌ యూనిట్ల ఏర్పాటు చర్యలను వారికి తెలియజేసినట్టు ప్రభుత్వం తన ప్రకటనలో పేర్కొంది.

మరిన్ని వార్తలు