ఇ–రూపీ వచ్చేసింది..!

2 Aug, 2021 23:59 IST|Sakshi

ప్రారంభించిన ప్రధాని మోదీ...

ప్రత్యేకమైన డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్‌...

ప్రభుత్వ పథకాల్లో పారదర్శకతను పెంచడం, వృధాను అరికట్టడమే లక్ష్యం

ప్రైవేటు సంస్థలు సైతం ఉపయోగించుకునే అవకాశం

న్యూఢిల్లీ: ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాల్లో పారదర్శకతను మెరుగుపరచడం, ప్రయోజనాలను నేరుగా లక్ష్యిత సేవలకు అందించడం లక్ష్యంగా కేంద్రం ‘ఇ–రూపీ’ని తీసుకొచ్చిం ది. వ్యక్తులు అలాగే నిర్దిష్ట ప్రయోజనాల కోసం వినియోగించే ఈ డిజిటల్‌ పేమెంట్‌ సొల్యూషన్‌ను సోమవారమిక్కడ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రస్తుతానికి ఇ–రూపీ సదుపాయం ఆరోగ్య సేవలకు అందుబాటులో ఉంటుంది, రానున్న కాలంలో ఇతర విభాగాలకు కూడా దీన్ని విస్తరించనున్నారు. ఆయుష్మాన్‌ భారత్, ఎరువుల సబ్సిడీ వంటి వాటికి కూడా కూడా దీన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంది.

‘ఇ–రూపీ ద్వారా డిజిటల్‌ పాలనలో దేశం సరికొత్త ప్రమాణాలను నెలకొల్పుతోంది. డిజిటల్‌ లావాదేవీలు అలాగే ప్రత్యక్ష నగదు బదిలీ (డీబీటీ)ని మరింత సమర్థవంతంగా మార్చడంలో ఇ–రూపీ వోచర్‌ అద్భుతమైన పాత్రను పోషించబోతోంది. లక్ష్యిత వర్గాలందరికీ పారదర్శకమైన, లీకేజీ రహిత ప్రయోజనాలు అందించడంలో దోహదం చేస్తుంది‘ అని ఇ–రూపీ ప్రారంభం సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు. 

లీకేజీలకు అడ్డుకట్ట... 
ప్రభుత్వ ప్రయోజనాలను నిర్దేశిత లబ్ధిదారులకు, వృథా (లీకేజీ) రహితంగా. లక్ష్యిత వర్గాలకు చేరేవిధంగా పలు పథకాలను గత కొన్నేళ్లుగా కేంద్రం ప్రవేశపెడుతూనే ఉంది. ఇప్పుడు అందుబాటులోకి తెచ్చిన ఎలక్ట్రానికల్‌ వోచర్‌ అనేది సుపరిపాలన విజన్‌ను పెంపొందించడంలో మరింత తోడ్పాటును అందించనుంది. ఇది ఒక్క ప్రభుత్వానికి మాత్రమే సంబంధించినది కాదని, ప్రైవేటు సంస్థలు లేదా ఎవరికైనా తమ వైద్య చికిత్సలు, విద్య లేదా ఇతరత్రా ఎలాంటి పనులకైనా సరే సహాయం చేయాలనుకుంటున్న సంస్థలు నగదుకు బదులు ఇ–రూపీ రూపంలో ఇవ్వవచ్చని ప్రధాని వివరించారు.

దీనివల్ల ఏ ప్రయోజనం కోసమైతే డబ్బును ఇచ్చారో, అదే పని కోసం కచ్చితంగా అది వినియోగించబడేందుకు వీలవుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాక్సినేషన్‌ వంటి నిర్దిష్ట ప్రయోజనాలను అవసరమైన వారికి చేరువ చేసేందుకు ప్రభుత్వం, ప్రైవేటు సంస్థలు ఈ లీకేజీ రహిత యంత్రాంగాన్ని ఉయోగించుకోవచ్చని వివరించారు. రాష్ట్రాలు కూడా సంక్షేమ పథకాలను నిర్దేశిత లబ్ధిదారులకు చేరువ చేసేందుకు ఇ–వోచర్‌ను వినియోగించుకోవాల్సిందిగా ప్రధాని సూచించారు. ప్రైవేటు రంగం సైతం తమ ఉద్యోగుల సంక్షేమం, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యకలాపాలకు ఈ డిజిటల్‌ వోచర్ల ప్రయోజనాలను వాడుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.

వంట గ్యాస్, రేషన్‌ సరుకులు అలాగే ఇతరత్రా సంక్షేమ పథకాలకు సంబంధించి సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంక్‌ ఖాతాల్లోకి వేయడం (డీబీటీ) ద్వారా భారీగా లీకేజీలకు అడ్డుకట్ట వేయగలిగామని, అదేవిధంగా నకిలీ లబ్ధిదారులను ఏరివేయగలిగామని ప్రధాని పేర్కొన్నారు. ప్రభుత్వం రూ.1.78 లక్షల కోట్ల మొత్తాన్ని ఆదా చేయడంలో ఇది ఎంతగానో తోడ్పడిందని ఆయన చెప్పారు. కరోనా లాక్‌డౌన్‌ సమయంలో డీబీటీ ఎంతగా ఉపయోగపడిందనేది ప్రధాని వివరిస్తూ... జామ్‌ (జన్‌ధన్‌ ఖాతా, మొబైల్‌ ఫోన్, ఆధార్‌ కార్డు)తో డిజిటల్‌ ఇండియా అనుసంధానం వల్ల ఒక్క క్లిక్‌తో నేరుగా కోట్లాది మంది లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదును బదిలీ చేసేందుకు తోడ్పడిందని చెప్పారు.

అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా ఇప్పటికీ దీని కోసం భౌతిక వ్యవస్థను ఉపయోగించుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. డీబీటీ ప్లాట్‌ఫామ్‌ ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటివరకూ కేంద్రం అందిస్తున్న 300కు పైగా స్కీములకు రూ.17.5 లక్షల కోట్లను నేరుగా బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు ప్రధాని వెల్లడించారు. ‘వంట గ్యాస్‌ సబ్సిడీ, పెన్షన్లు, పీఎం కిసాన్‌ యోజన, స్కాలర్‌షిప్‌లు వంటి వాటి కోసం దాదాపు 90 కోట్ల మంది ఈ డీబీటీ ప్లాట్‌ఫామ్‌ ద్వారా ప్రయోజనం పొందుతున్నారు. దీనివల్ల ప్రభుత్వం అందిస్తున్న సబ్సిడీ సొమ్ము అక్రమార్కుల జేబుల్లోకి వెళ్లకుండా అడ్డుకట్ట వేయడం ద్వారా రూ.1.78 లక్షల కోట్లు ఆదా అయింది’ అని చెప్పారు. సేవల కల్పనలో నవకల్పనలు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం విషయానికొస్తే, ప్రపంచవ్యాప్తంగా సంపన్న దేశాలన్నింటితో పాటు భారత్‌ కూడా ప్రపంచ నాయకత్వాన్ని అందించే సత్తాను సొంతం చేసుకుందని ప్రధాని పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు