ఒకప్పుడు 1జీబీ డేటా రూ.300..మరి ఇప్పుడు ఎంతుందో తెలుసా?

1 Oct, 2022 17:38 IST|Sakshi

ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో తొలిసారి 5జీ నెట్‌ వర్క్‌ సర్వీసుల్ని ప్రారంభించారు. ఢిల్లీ ప్రగతి మైదాన్‌లో అక్టోబర్‌ 1 నుంచి 4 తేదీల మధ్య జరిగే 6వ ఇండియా మొబైల్‌ కాంగ్రెస్‌–2022 కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని..దీంతో పాటు 5జీ సేవలకు శ్రీకారం చుట్టారు. అనంతరం 5జీ నెట్‌ వర్క్‌ల వినియోగంపై మాట్లాడుతూ.. దేశంలో ఒక కొత్త శకం మొదలైందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. 

చదవండి👉 మీ స్మార్ట్‌ ఫోన్‌ 5జీ నెట్‌ వర్క్‌కు సపోర్ట్‌ చేస్తుందా? లేదో? ఇలా చెక్ చేసుకోండి!

5 జీ నెట్‌ వర్క్‌ ప్రారంభం అవ్వడం 130 కోట్ల మంది భారతీయులకు గొప్ప బహుమతి. దేశ అపరిమిత  సామర్ధ్యాలు ప్రపంచ దేశాలకు సాక్షాత్కారంగా నిలుస్తాయి. 

ప్రపంచ సాంకేతిక విప్లవంలో భారతదేశం కీలక పాత్ర పోషిస్తుంది. 5జీతో టెలికాం టెక్నాలజీలో భారతదేశం అగ్రగామిగా, ప్రపంచ స్థాయి ప్రమాణాల్ని వినియోగదారులకు అందిస్తుంది. ఈ కొత్త టెక్నాలజీ యువతకు అనేక ఉపాధి అవకాశాల్ని అందిస్తుంది.  

పొడక్ట్‌ ధర, డిజిటల్ కనెక్టివిటీ, డేటా ఖర్చులు, డిజిటల్‌ ఫస్ట్‌ అప్రోచ్‌లు అనే నాలుగు స్తంభాలపై  డిజిటల్ ఇండియా విజయం ఆధారపడి ఉంది. మనం ఆత్మ నిర్భర్ అయినప్పుడే ఎలక్ట్రానిక్స్ ధరలు తగ్గుతాయి. 2014లో కేవలం రెండు మొబైల్ తయారీ కేంద్రాలు మాత్రమే ఉన్నాయి. కానీ నేడు వాటి సంఖ్య 200కు పెరిగింది. న్యూ ఇండియా ప్రపంచంలోనే మొబైల్ ఫోన్‌ల తయారీలో రెండవ స్థానంలో ఉంది.

కమ్యూనికేషన్ రంగంలో కనెక్టివిటీ చాలా ముఖ్యం. 2014 లో బ్రాడ్‌ బ్యాండ్ వినియోగదారులు ఆరు కోట్ల మంది ఉంటే ప్రస్తుతం 80 కోట్లకు మందికి పైగా ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కనెక్టివిటీ 100 గ్రామ పంచాయతీల నుండి ఇప్పుడు 170,000 పంచాయతీలు ఆప్టికల్ ఫైబర్‌తో అనుసంధానించ బడి ఉన్నాయి. 

డిజిటల్ ఫస్ట్ విధానంతో మనం ఆన్‌లైన్ చెల్లింపుల వంటి పౌర కేంద్రీకృత సేవల (robust network) నెట్‌వర్క్‌ను నిర్మించడంలో విజయం సాధించాం. డిజిటల్ ఇండియా ప్రతి పౌరుడికి అనేక అవకాశాల్ని అందించింది. చిన్న వీధి వ్యాపారులు సైతం యూపీఐ సౌకర్యాన్ని ఉపయోగిస్తున్నారు.

ఇంతకుముందు 1జీబీ డేటా ధర సుమారు రూ. 300. ఇప్పుడు అది రూ.10. టెక్నాలజీ - టెలికాం అభివృద్ధితో, భారతదేశం పరిశ్రమ 4.0 విప్లవానికి నాయకత్వం వహిస్తుంది. ఇది భారతదేశ దశాబ్దం కాదు, భారతదేశ శతాబ్దం’ అంటూ ప్రధాని మోదీ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.

చదవండి👉 ‘కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ సెటైర్లు’

మరిన్ని వార్తలు