మన టెక్నాలజీ వైపు.. ప్రపంచం చూపు.. 

9 Dec, 2021 01:21 IST|Sakshi

చౌకైన సాంకేతికతల కోసం భారత్‌పై ఆశాభావం 

సానుకూల మార్పులు తెచ్చే ఆవిష్కరణలు చేయాలి 

ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌లో ప్రధాని మోదీ సందేశం

న్యూఢిల్లీ: వివిధ రంగాలకు సంబంధించి చౌకైన, మెరుగైన టెక్నాలజీ పరిష్కార మార్గాల కోసం యావత్‌ ప్రపంచం భారత్‌ వైపు చూస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పారు. ఈ నేపథ్యంలో ప్రజల జీవితాల్లో సానుకూల మార్పులు తెచ్చేందుకు ఉపయోగపడే ఆవిష్కరణలను రూపొందించడంపై ప్రధానంగా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. ‘‘5జీ టెక్నాలజీ నుంచి కృత్రిమ మేథ, వర్చువల్‌ రియాలిటీ, క్లౌడ్, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్, రోబోటిక్స్‌ వరకూ.. ఇలా అనేక అంశాల్లో చౌకైన, సుస్థిరమైన టెక్నాలజీ ఆధారిత పరిష్కార మార్గాలను కనుగొనగలదని భారత్‌ వైపు ప్రపంచం ఆశాభావంతో చూస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు.

భారత డిజిటల్‌ సామర్థ్యాలు అసమానమైనవని, దేశ డిజిటల్‌ వ్యవస్థ అత్యంత భారీ స్థాయిదని ఆయన చెప్పారు. టెక్నాలజీ వేగంగా మారిపోతున్న పరిస్థితుల్లో .. వైద్యం, విద్య, వ్యవసాయం, చిన్న..మధ్య తరహా సంస్థలు (ఎంఎస్‌ఎంఈ) వంటి రంగాలను మెరుగుపర్చేందుకు మన ఆవిష్కరణలు, ప్రయత్నాలు ఎంత మేర ప్రభావం చూపగలవన్నది ఆలోచించుకోవాల్సిన అవసరం ఉందని మోదీ తెలిపారు. బుధవారం ఇండియన్‌ మొబైల్‌ కాంగ్రెస్‌ సదస్సు (ఐఎంసీ) ప్రారంభం సందర్భంగా ప్రధాని ఈ మేరకు తన సందేశాన్ని పంపారు. మరోవైపు, టెలికం రంగంలో మరిన్ని సంస్కరణలు అమలు చేసేందుకు, నియంత్రణ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యుత్తమమైనదిగా తీర్చిదిద్దేందుకు తీసుకోతగిన చర్యలపై పరిశ్రమ వర్గాలు తగు సలహాలు, సూచనలు చేయాలని కేంద్ర టెలికం శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ సూచించారు. సమ్మిళిత వృద్ధి సాధించే దిశగా ప్రభుత్వం పని చేస్తోందని, అట్టడుగు వర్గాలకు కూడా డిజిటల్‌ కనెక్టివిటీ ప్రయోజనాలను అందుబాటులోకి తెచ్చేందుకు అమలు చేయతగిన ప్రణాళికలను కేంద్రం దృష్టికి తీసుకురావాలని కోరారు. 

స్మార్ట్‌ఫోన్లపై సబ్సిడీకి యూఎస్‌వో నిధులు ఇవ్వాలి: ముకేశ్‌ అంబానీ 
దేశీయంగా డిజిటల్‌ విప్లవం మరింత ఊపందుకునేలా నిర్దిష్ట వర్గాలకు సబ్సిడీపై స్మార్ట్‌ఫోన్లను అందించేందుకు యూఎస్‌వో ఫండ్‌ నిధులను వినియోగించాలని టెలికం దిగ్గజం రిలయన్స్‌ జియో అధినేత ముకేశ్‌ అంబానీ సూచించారు. 5జీ సేవల విస్తరణను జాతీయ ప్రాధాన్యతాంశంగా పరిగణించాలని ఐఎంసీ సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన పేర్కొన్నారు. గ్రామీణ, మారుమూల ప్రాంతాల వారికి టెలికం సేవలు అందుబాటులోకి తెచ్చే లక్ష్యంతో యూనివర్సల్‌ సర్వీస్‌ ఆబ్లిగేషన్‌ (యూఎస్‌వో) ఫండ్‌ ఏర్పాటైంది. టెల్కోలు ప్రభుత్వానికి కట్టే లైసెన్సు ఫీజులో సుమారు 5% మొత్తం ఈ నిధిలోకి వెడుతుంది. ఈ నేపథ్యంలో అంబానీ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. 

లిటిగేషన్లు తగ్గాలి: ఎయిర్‌టెల్‌ మిట్టల్‌ 
భారీ స్థాయి లిటిగేషన్లు.. టెలికం రంగానికి సమస్యగా మారాయని భారతి ఎయిర్‌టెల్‌ చైర్మన్‌ సునీల్‌ మిట్టల్‌ వ్యాఖ్యానించారు. వీటి పరిష్కారంతో పాటు కొత్త వివాదాలు తలెత్తకుండా నియంత్రణ విధానాలు సరళతరంగా ఉండాలని అభిప్రాయపడ్డారు. పోటీ సంస్థలు కలిసి పనిచేయడం, సుంకాలు.. స్పెక్ట్రం ధర తగ్గింపు తదితర అంశాలు టెలికం రంగం పూర్తి సామర్థ్యాలతో పనిచేసేందుకు దోహదపడగలవని మిట్టల్‌ చెప్పారు. ప్రభుత్వం ఈ అంశాలపై దృష్టి సారించాలని కోరారు.  

బ్యాంకింగ్‌ మద్దతు ఉండాలి: బిర్లా 
టెలికం రంగానికి ఊతం ఇచ్చేందుకు కేంద్రం ఇప్పటికే విధానాలపరమైన సంస్కరణలు ప్రవేశపెట్టిందని ఆదిత్య బిర్లా గ్రూప్‌ చైర్మన్‌ కుమార మంగళం బిర్లా పేర్కొన్నారు. వ్యాపారాల నిర్వహణను సులభతరం చేసేందుకు మరిన్ని చర్యలు తీసుకోవడంతో పాటు బ్యాంకింగ్‌ రంగం నుంచి కూడా మద్దతు లభిస్తే టెలికం రంగం గణనీయంగా కోలుకోగలదని ఆయన చెప్పారు. అంతర్జాతీయ టెక్నాలజీలను అందిపుచ్చుకోవడంలో భారత్‌ ముందుండేందుకు ఇవి తోడ్పడగలవని తెలిపారు.  

మరిన్ని వార్తలు