అసమాన పెట్టుబడి కేంద్రంగా భారత్‌

9 Oct, 2020 04:50 IST|Sakshi

ప్రైవేటు భాగస్వామ్యం పెంపునకే సంస్కరణలు

ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్‌

ఇన్వెస్ట్‌ ఇండియా సదస్సులో ప్రధాని మోదీ వ్యాఖ్యలు


న్యూఢిల్లీ: ఇటీవల చేపట్టిన కార్మిక, వ్యవసాయ సంస్కరణలు భారత్‌లో వ్యాపారం చేయడాన్ని మరింత సులభతరం చేస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మార్కెట్‌ను ఎంచుకోవడానికి రైతులకు హక్కు కల్పిస్తోందని, అలాగే ఎగుమతులు పెరిగేందుకు దోహదం చేస్తుందని చెప్పారు. ఇన్వెస్ట్‌ ఇండియా–2020 సదస్సులో ఆయన వీడియో ద్వారా  కీలకోపన్యాసం చేశారు. భారత్‌–కెనడా మధ్య వ్యాపార సంబంధాలు మరింత బలోపేతం లక్ష్యంగా ఈ సదస్సు జరిగింది. శక్తివంతమైన ప్రజాస్వామ్యం, రాజకీయ స్థిరత్వం, వ్యాపారానికి అనుకూలమైన విధానాలతో విదేశీ వ్యాపారులకు భారత్‌ అసమాన పెట్టుబడి కేంద్రంగా నిలిచిందని ప్రధాని అన్నారు.

పెద్ద ఎత్తున సంస్కరణలు..
ప్రైవేటు రంగ భాగస్వామ్యాన్ని మెరుగుపరిచేందుకే విద్య, వ్యవసాయం, కార్మిక వంటి ప్రధాన రంగాల్లో సంస్కరణలు చేపట్టామని మోదీ తెలిపారు. ‘కార్మిక చట్టాల సంస్మరణలతో లేబర్‌ కోడ్స్‌ తగ్గుతాయి. ఇవి సంస్థలకు, ఉద్యోగులకు స్నేహపూర్వకంగా ఉంటాయి. అలాగే ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణానికి దోహదం చేస్తాయి. విద్యా రంగంలో సంస్కరణలతో యువత నైపుణ్యం మెరుగవుతుంది. విదేశీ యూనివర్సిటీలు భారత్‌కు వస్తాయి. విద్య, తయారీ, సేవలు, వ్యవసాయ రంగాల్లో భాగస్వామ్యం, పెట్టుబడి, సహకారానికి భారత్‌ సరైన వేదిక’ అని వివరించారు.  

అవకాశాలను అందుకున్నాయి..
మౌలిక రంగ పెట్టుబడిలో ఉన్న పెద్ద సంస్థలకు కెనడా కేంద్రంగా ఉందని ప్రధాని గుర్తు చేశారు. ‘కెనడాకు చెందిన పెన్షన్‌ ఫండ్స్‌ తొలుత ఇక్కడ పెట్టుబడులు పెట్టాయి. హైవేస్, ఎయిర్‌పోర్టులు, లాజిస్టిక్స్‌ రంగాల్లో కెనడా సంస్థలు ఇక్కడి అవకాశాలను అందుకున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ నేడు బలంగా ఉంది. రేపు మరింత శక్తివంతమవుతుంది. ఎయిర్‌పోర్టులు, రైల్వేలు, హైవేలు, పవర్‌ ట్రాన్స్‌మిషన్‌ లైన్స్‌లో ప్రైవేటు పెట్టుబడులను పెద్ద ఎత్తున ఆహ్వానిస్తున్నాం. ఎఫ్‌డీఐ విధానాలను సరళీకరించాం. సార్వభౌమ సంపద, పెన్షన్‌ ఫండ్స్‌ విషయంలో స్నేహపూర్వక పన్నుల విధానం అనుసరిస్తున్నాం. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రత్యేక విధానాన్ని అమలుచేశాం. పేదలు, చిన్న వ్యాపారుల కోసం ఉద్దీపన ప్యాకేజీ ఇచ్చాం. నిర్మాణాత్మక సంస్కరణలకు దీనిని అవకాశంగా తీసుకున్నాం’ అని చెప్పారు.  

ఔషధ కేంద్రంగా భారత్‌..
ప్రపంచానికి ఔషధ కేంద్రంగా భారత్‌ నిలిచిందని నరేంద్ర మోదీ తెలిపారు. ‘150కిపైగా దేశాలకు భారత్‌ మందులు అందించింది. 2019లో అంతర్జాతీయంగా ఎఫ్‌డీఐల రాక 1 శాతం తగ్గితే, భారత్‌ విషయంలో ఇది 20 శాతం వృద్ధి నమోదైంది. అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు భారత్‌ పట్ల నమ్మకం కొనసాగుతోందనడానికి ఇది నిదర్శనం. ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో 20 బిలియన్‌ డాలర్లకుపైగా ఎఫ్‌డీఐలను భారత్‌ స్వీకరించింది. అంతర్జాతీయంగా కోవిడ్‌ తీవ్ర స్థాయిలో ఉన్నప్పటికీ ఇది సాధించాం’ అని వివరించారు. కాగా, భారత్‌లో విదేశీ పెట్టుబడుల్లో కెనడా 20వ స్థానంలో ఉంది. 600లకుపైగా కెనడా కంపెనీలు భారత్‌లో కార్యకలాపాలు సాగిస్తున్నాయి. ఇప్పటి వరకు ఇవి 50 బిలియన్‌ డాలర్లకుపైగా పెట్టుబడులు చేశాయి.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు