విలువైన సంస్థలను సృష్టించాలి

18 Feb, 2021 04:52 IST|Sakshi

ప్రపంచ స్థాయి ఉత్పత్తులు రూపొందించాలి

అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పాలి

స్టార్టప్‌లకు ప్రధాని మోదీ సూచన

న్యూఢిల్లీ: వేల్యుయేషన్లు, నిష్క్రమించే వ్యూహాలే లక్ష్యంగా పనిచేయకుండా .. శతాబ్దాల పాటు మనుగడ సాగించే సంస్థలను సృష్టించడంపై దృష్టి పెట్టాలని స్టార్టప్‌ సంస్థలకు ప్రధాని నరేంద్ర మోదీ సూచించారు. అంతర్జాతీయంగా అత్యుత్తమ ప్రమాణాలు నెలకొల్పగలిగే ప్రపంచ స్థాయి ఉత్పత్తులను రూపొందించాలని పేర్కొన్నారు. 130 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశీ మార్కెట్‌ను సంస్థలు ఎంతో విలువైన ఆస్తిగా పరిగణించాలని ప్రధాని అభివర్ణించారు. ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ నిర్వ హించిన టెక్నాలజీ, లీడర్‌షిప్‌ ఫోరం 29వ వార్షిక సదస్సులో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ విషయాలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల బాలల్లో సమస్యలను పరిష్కరించే నైపుణ్యాలను పెంపొందించే విధంగా కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాలపైనా ఐటీ కంపెనీలు దృష్టి పెట్టాలని ఆయన సూచించారు. కొత్త ఐడియాలకు దేశంలో కొదవ లేదని, కానీ అవి వాస్తవ రూపం దాల్చేలా సరైన మార్గంలో నడిపించే దిశా నిర్దేశకులు అవసరమని మోదీ అభిప్రాయపడ్డారు.

ఆప్టికల్‌ ఫైబర్‌ లక్ష్యాలు సాధిస్తాం..
ఇంటర్నెట్‌ సేవలను విస్తృతంగా అందుబాటులోకి తెచ్చే దిశగా ఆప్టికల్‌ ఫైబర్‌ కేబుల్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు లక్ష్యాలు సాధించడంపై తాను వ్యక్తిగతంగా దృష్టి పెడతానని ప్రధాని తెలిపారు. అదే సమయంలో విస్తృతమైన నెట్‌వర్క్‌ ఊతంతో సమాజానికి ప్రయోజనం చేకూర్చే పరిష్కార మార్గాలను కనుగొనేందుకు ఐటీ పరిశ్రమ కృషి చేయాలని చెప్పారు. కరోనా వైరస్‌ కష్టకాలంలోనూ దేశీ ఐటీ రంగం అవిశ్రాంతంగా కృషి చేసిందని ఆయన కితాబిచ్చారు. నిబంధనలపరమైన అడ్డంకుల కారణంగా గతంలో భారతీయ ఐటీ పరిశ్రమ .. అనేక అవకాశాలను పూర్తి స్థాయిలో వినియోగించుకోలేకపోయిందని ప్రధాని చెప్పారు. దీనివల్ల డిజిటల్‌ అంతరాలు పెరిగిపోయాయని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో భారత్‌ను అంతర్జాతీయ స్థాయిలో డిజిటల్‌ ఉత్పత్తుల హబ్‌గా తీర్చిదిద్దేందుకు నేషనల్‌ డిజిటల్‌ కమ్యూనికేషన్‌ పాలసీని రూపొందించినట్లు ఆయన వివరించారు. కనిష్ట స్థాయి ప్రభుత్వ యంత్రాంగంతో గరిష్టంగా పాలనను అందించడంలో సాంకేతిక ఆవిష్కరణలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయని ప్రధాని చెప్పారు.  

దూసుకెళ్తున్న భారత్‌ ..
చెక్కుచెదరని ఆత్మవిశ్వాసంతో భారత్‌ ముందుకు దూసుకెడుతోందని.. సరిహద్దుల్లోని పరిణామాలు, జియోస్పేషియల్‌ డేటా నిబంధనలను సరళతరం చేయాలన్న ప్రభుత్వ నిర్ణయమే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు.

రిస్కులు తీసుకోగలగాలి: ఐబీఎం చైర్మన్‌ అరవింద్‌ కృష్ణ
నూతన ఆవిష్కరణలకు అంతర్జాతీయ హబ్‌గా భారత్‌ ఎదగాలంటే విధానాలు, రిస్కు తీసుకునే సామర్థ్యాలు, కొత్త సాంకేతికతలను అందిపుచ్చుకోవడం వంటి అంశాలు కీలకంగా ఉంటాయని ఐబీఎం చైర్మన్‌ అరవింద్‌ కృష్ణ అభిప్రాయపడ్డారు. మూడు ఐడియాలొస్తే ఒక్కటి మాత్రమే విజయవంతమయ్యే అవకాశం ఉంటుందని, నవకల్పనల ఆవిష్కరణల్లో ఇలాంటి రిస్కులు తప్పవని నాస్కామ్‌ సదస్సులో ఆయన పేర్కొన్నారు. డేటా భద్రతకు సంబంధించి నిబంధనలు, విధానాలు ఇటు దేశ ఎకానమీకి ప్రయోజనకరంగా ఉండటంతో పాటు అటు సర్వీసులు, సాఫ్ట్‌వేర్‌ ఎగుమతుల వృద్ధికి కూడా అనువైనవిగా ఉండాలని తెలిపారు. సైబర్‌ సెక్యూరిటీ అనేది ఈ దశాబ్దంలోనే అత్యంత పెద్ద రిస్కని ఆయన చెప్పారు.

మీ అభిప్రాయాలను కింద తెలపండి

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments

మరిన్ని వార్తలు