రూ.1,000 కోట్లతో స్టార్టప్‌ సీడ్‌ ఫండ్‌

18 Jan, 2021 05:56 IST|Sakshi

అంకుర సంస్థలకు మూలధన నిధులు

ప్రధాని మోదీ ప్రకటన

న్యూఢిల్లీ: వినూత్నమైన ఆలోచనలతో ముందుకు వచ్చే స్టార్టప్‌లకు వెన్నుదన్నుగా నిలిచేందుకు కేంద్రం మరో విడత ప్రత్యేక నిధిని ప్రకటించింది. రూ.1,000 కోట్లతో ‘స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌’ను ఏర్పాటు చేస్తున్నట్టు.. ప్రధాని నరేంద్ర మోదీ ‘స్టార్టప్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సు’ ప్రారంభం సందర్భంగా వెల్లడించారు. 2016లో మోదీ సర్కారు స్టార్టప్‌ ఇండియా అంతర్జాతీయ సదస్సును ఆరంభించగా.. ఇది ఈ ఏడాదితో ఐదో వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకుంది. స్టార్టప్‌ల వృద్ధితో ఎన్నో ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయని, ప్రజల జీవితాల ఉన్నతికి తోడ్పడుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ‘‘స్టార్టప్‌లకు నిధులు అందించేందుకు రూ.1,000 కోట్లతో స్టార్టప్‌ ఇండియా సీడ్‌ ఫండ్‌ను ఏర్పాటు చేస్తున్నాము. ఇది నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు, వాటి వృద్ధికి సాయపడుతుంది’’ అని మోదీ ప్రకటించారు. ఈ ఫండ్‌ ఆఫ్‌ ఫండ్‌ పథకాన్ని స్టార్టప్‌లకు మూలధన నిధులు అందించేందుకు వినియోగించనున్నట్టు చెప్పారు. ఇకపై స్టార్టప్‌ల రుణ సమీకరణకూ మద్దతు ఉంటుందని ప్రకటించారు. భారత్‌ ప్రపంచంలోనే మూడో అతిపెద్ద స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌ (సదుపాయాలు)గా ఉందని తెలియజేస్తూ.. వినూత్నమైన టెక్నాలజీలు, ఆలోచనల తో వచ్చి, పెద్ద సంస్థలుగా అవతరించేందుకు ఇది తోడ్పడుతుందని చెప్పారు.

మరిన్ని వార్తలు