టెక్నాలజీలో స్వయం సమృద్ధి కావాలి

3 Mar, 2022 05:02 IST|Sakshi

వెబినార్‌లో ప్రధాని మోదీ అభిలాష

న్యూఢిల్లీ: టెక్నాలజీ రంగాలలో దేశం స్వయంసమృద్ధిని సాధించాలని ప్రధాని నరేంద్ర మోదీ అభిలషించారు. చివరి అంచెవరకూ సర్వీసుల అందజేత, భారీ  ఉపాధి కల్పనలో ఇవి కీలక పాత్ర పోషించనున్నట్లు తెలియజేశారు. సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ విడివడి ఉండదని, డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థతో దగ్గరగా కనెక్టయి ఉండే రంగమని ‘సాంకేతిక ఆధార అభివృద్ధి’పై నిర్వహించిన వెబినార్‌లో ప్రధాని పేర్కొన్నారు.

ప్రస్తుతం వేగవంత డెలివరీ, పౌరులకు సాధికారత కల్పిస్తున్న డిజిటల్‌ ఎకానమీ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ ఆధారితమై ఉన్నట్లు వివరించారు. సాధారణంగా టెలికమ్యూనికేషన్, అందులోనూ 5జీ టెక్నాలజీ ప్రధానంగా వృద్ధికి ఊతమివ్వడమేకాకుండా ఉద్యోగ అవకాశాలను కల్పించగలదని మోదీ పేర్కొన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో 5జీ మొబైల్‌ సర్వీసులు ప్రారంభమయ్యేందుకు వీలుగా అవసరమైన స్పెక్ట్రమ్‌ వేలాన్ని 2022లో నిర్వహించనున్నట్లు తెలియజేశారు. వెబినార్‌లో ప్రభుత్వ, ప్రయివేట్‌ రంగంలోని వివిధ శాఖల ప్రతినిధులు పాలుపంచుకున్నారు.

మెడికల్‌ పరికరాలపై
టెక్నాలజీ కీలక పాత్ర పోషించే మెడికల్‌ పరికరాలను తయారు చేయడంపై దృష్టిపెట్టవలసి ఉన్నదని మోదీ వెబినార్‌లో గట్టిగా చెప్పారు. తద్వారా డిమాండుకు అనుగుణంగా పరికరాలను సరఫరా చేయగలమని తెలియజేశారు. దేశీ స్టార్టప్‌ పరిశ్రమకు ప్రభుత్వం వివిధ దశలలో సహకరిస్తుందని అభయమిచ్చారు. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టుల ద్వారా నైపుణ్యాభివృద్ధి దగ్గర నుంచి తయారీ వరకూ అవాంతరాలు లేని పురోగతికి వీలు కల్పించనున్నట్లు తెలియజేశారు. యూఎస్‌ ప్రెసిడెంట్‌ జో బైడెన్‌ సైతం కాంగ్రెస్‌ నుద్దేశించి చేసిన తన ప్రసంగంలో స్వయం సమృద్ధి ప్రాధాన్యతను నొక్కి చెప్పినట్లు ప్రస్తావించారు.

కొత్తగా ఆవిర్భవిస్తున్న ప్రపంచ వ్యవస్థలో ఆత్మనిర్భరతపై దృష్టి పెట్టడం ద్వారా ముందుకుసాగడం కీలకమని వ్యాఖ్యానించారు. దేశంలో తయారీ రంగానికి దన్నునిచ్చే బాటలో 14 కీలక రంగాలకు రూ. 2 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల పథకాన్ని తీసుకువచ్చినట్లు ప్రస్తావించారు. పౌర సేవలలో ఆప్టికల్‌ ఫైబర్‌ వినియోగం, ఈవేస్ట్‌ మేనేజ్‌మెంట్, సర్క్యులర్‌ ఎకానమీ, ఎలక్ట్రిక్‌ మొబిలిటీ అంశాలలో ఆచరణసాధ్యమైన సలహాలు ఇవ్వవలసిందిగా ఆహ్వానించారు. మౌలిక సదుపాయాల పురోగమనం టెక్నాలజీ ఆధారితమని, ప్రజా పంపిణీ వ్యవస్థ సైతం డిజిటల్‌ ప్లాట్‌ఫామ్స్‌తో కనెక్టయి ఉన్నదని వివరించారు.

మరిన్ని వార్తలు