దేశానికి స్టార్టప్‌లే వెన్నెముక

17 Jan, 2022 06:32 IST|Sakshi

ప్రధాని ఉద్ఘాటన

ఏటా జనవరి 16 స్టార్టప్‌డే

న్యూఢిల్లీ: దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు పరిష్కారంగా భారత్‌ నుంచి భారత్‌ కోసం ఆవిష్కరణలు చేయాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ స్టార్టప్‌లకు పిలుపునిచ్చారు. స్టార్టప్‌ల ప్రతినిధులతో శనివారం ప్రధాని వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం తీసుకున్న చర్యలను ప్రస్తావించారు. ‘‘మన స్టార్టఫ్‌లు ఆట (పోటీ) నిబంధనలను మార్చేస్తున్నాయి.

భారత్‌కు స్టార్టప్‌లు వెన్నెకముగా నిలుస్తాయన్న నమ్మకం ఉంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. భారత్‌లో 60,000 స్టార్టప్‌లు, 42 యూనికార్న్‌లు ఉన్నట్టు చెప్పారు. ‘‘ప్రభుత్వం మూడింటిపై దృష్టి సారించి పనిచేస్తోంది. ప్రభుత్వ చట్రం నుంచి, అధికారిక అడ్డుగోడల నుంచి వ్యవస్థాపకత, ఆవిష్కరణలకు విముక్తి కల్పించడం. ఆవిష్కరణలకు ప్రోత్సహించేందుకు సంస్థాగత యంత్రాగాన్ని ఏర్పాటు చేయడం. యువ ఆవిష్కర్తలు, యువ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మద్దతుగా నిలవడం’’ అని ప్రధాని వివరించారు.

ఎంతో పురోగతి..   
2013–14లో కేవలం 4,000 పేటెంట్లు భారత సంస్థలకు మంజూరు అయితే, గతేడాది 28,000 పెటెంట్లు మంజూరైన విషయాన్ని ప్రధాని మోదీ గుర్తు చేశారు. 2013–14లో 70,000 ట్రేడ్‌మార్క్‌లు సంఖ్య వృద్ధి చెందినట్టు చెప్పారు. అలాగే 2013–14లో 4,000 కాపీరైట్‌లు మంజూరు అయితే, 2021–22 మంజూరైనవి 16,000గా ఉన్నట్టు తెలిపారు. అంతర్జాతీయ ఆవిష్కరణల సూచీలో భారత్‌ స్థానం 2015లో 81 ఉంటే, అది ఇప్పుడు 46కు మెరుగుపడినట్టు పేర్కొన్నారు.  

స్టార్టప్‌లు ప్రదర్శన..
150కుపైగా స్టార్టప్‌లు ఆరు రకాల గ్రూపులుగా ఏర్పడి ఈ సందర్భంగా ఆరు రకాల థీమ్‌లపై ప్రదర్శన ఇచ్చాయి. సాగు రంగంలో విస్తృతమైన డేటా సమీకరణకు యంత్రాంగం, భారత్‌ను వ్యవసాయానికి ప్రాధాన్య కేంద్రంగా మార్చడం, టెక్నాలజీ సాయంతో హెల్త్‌కేర్‌కు మద్దతునివ్వడం, మానసిక ఆరోగ్య సమస్యకు పరిష్కారం, వర్చువల్‌ టూర్స్‌ ద్వారా రవాణా, పర్యాటకానికి ప్రోత్సాహాన్నివ్వడం, ఎడ్యుటెక్, ఉపాధి అవకాశాల గుర్తింపు, ఆఫ్‌లైన్‌ రిటైల్‌ దుకాణాలను ఈ కామర్స్‌తో అనుసంధానించడంపై స్టార్టప్‌లు తమ ఆలోచనలను ప్రధానితో పంచుకున్నాయి.

ఉపాధి అవకాశాలకు వేదిక
స్టార్టప్‌లు ఆవిష్కరణలు తీసుకురావడే కాదు భారీ ఉపాధి అవకాశాలకు వేదికగా నిలుస్తాయని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. దేశంలో కింది స్థాయి వరకు స్టార్టప్‌ సంస్కృతి ఫరిడవిల్లేందుకు వీలుగా ఏటా జనవరి 16న ‘నేషనల్‌ స్టార్టప్‌ డే’గా జరుపుకోనున్నట్టు ప్రకటించారు. స్టార్టప్‌లకు 2022 ఎన్నో అవకాశాలు, మార్గాలను తీసుకొచ్చినట్టు పేర్కొన్నారు. దేశం ఎదుర్కొంటున్న సవాళ్ల పరిష్కారానికి ఆవిష్కరణలు, టెక్నాలజీ ఆధారిత పరిష్కారాలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఉంటుందని ప్రకటించారు.  

స్టార్టప్‌లకు ప్రోత్సాహాన్నిస్తుంది..
నేషనల్‌ స్టార్టప్‌ డే అన్నది దేశ జీడీపీ వృద్ధిలో స్టార్టప్‌ల పాత్రను గుర్తించడమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. అంతర్జాతీయంగా భారత్‌ స్థానాన్ని బలోపేతం చేస్తుందని, యువ నిపుణులు ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా అడుగులు వేసేందుకు ప్రోత్సాహంగా నిలుస్తుందని బోలోలైవ్‌ (షార్ట్‌ వీడియోల ప్లాట్‌ఫామ్‌) వ్యవస్థాపకుడు, సీఈవో వరుణ్‌ సక్సేనా పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు