ఉత్పాదకతకు మరిన్ని రుణాలు

30 Jul, 2020 04:43 IST|Sakshi

బ్యాంకర్లకు ప్రధాని మోదీ విజ్ఞప్తి

3 గంటల పాటు వీడియో సదస్సు  

న్యూఢిల్లీ: కోవిడ్‌–19 మహమ్మారితో కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి ఉత్పాదక రంగాలకు తగిన రుణ సదుపాయం సకాలంలో అందించేలా బ్యాంకింగ్, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్స్‌ కంపెనీలు (ఎన్‌బీఎఫ్‌సీ)  చర్యలు తీసుకోవాలని ప్రధానమంత్రి నరేంద్రమోదీ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగ బ్యాంకుల సీఈఓలు, ఎన్‌బీఎఫ్‌సీల చీఫ్‌లతో ప్రధాని బుధవారం మూడు గంటలపాటు సుదీర్ఘ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఉన్నత స్థాయి వర్గాలు అందించిన సమాచారం ప్రకారం  సదస్సుకు సంబంధించి కొద్ది ముఖ్యాంశాలు చూస్తే...

► ఆత్మనిర్భర్‌ భారత్‌ అభియాన్‌ (స్వావలంబన భారత్‌), దేశం స్వయం సమృద్ధి లక్ష్యాల సాధన వంటి కీలక అంశాలను ఆయన ఈ సమావేశంలో ప్రస్తావించారు. ఈ విషయంలో ఫైనాన్షియల్‌ రంగం ప్రాముఖ్యతను వివరించారు. లక్ష్యాల సాధన దిశలో ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అన్నింటినీ అందిస్తుందని పేర్కొన్నారు.  

► రుణ సదుపాయాలు, లక్ష్యాల సాధనలో అనుసరించాల్సిన మార్గాలు, టెక్నాలజీ ద్వారా ఫైనాన్షియల్‌ రంగంలో సాధికారత,  ఈ విభాగం స్థిరత్వానికి అనుసరించాల్సిన అత్యున్నత ప్రమాణాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయి.  

► ఎస్‌బీఐ చైర్మన్‌ రజ్‌నీష్‌ కుమార్, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌ ఎస్‌ఎస్‌ మల్లిఖార్జున రావు, ఐసీఐసీఐ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ భక్షీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అదిత్య పురి, హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రేణూ సూద్‌ కర్నాడ్‌ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  
► 2019 మేలో బ్యాంక్‌ రుణ వృద్ధి 11.5 శాతం ఉంది. 2020 మేలో ఇది 7 శాతం క్షీణతకు పడిపోయింది. కోవిడ్‌–19 తీవ్రత దీనికి నేపథ్యం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణతలోకి వెళుతుందన్న సందేహాలూ ఉన్నాయి. రుణాలకు సంబంధించి అటు రుణ దాతల నుంచీ ఇటు రుణ గ్రహీతల నుంచీ సానుకూల స్పందన కనబడ్డం లేదు. ఈ నేపథ్యంలో ప్రధాని నిర్వహించిన సదస్సుకు ప్రాధాన్యత సంతరించుకుంది.  నిజానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో చరిత్రాత్మక కనిష్టస్థాయి 4 శాతానికి దిగివచ్చింది. అయినా కార్పొరేట్, రిటైల్‌ రుణ గ్రహీతలు రుణాలు తీసుకోవడానికి వెనుకంజ వేస్తున్నారు. దీనితో బ్యాంకులు రివర్స్‌ రెపో మార్గంలో తమ డబ్బును ఆర్‌బీఐ వద్ద ఉంచుతున్నాయి.  

► వ్యవస్థలో డిమాండ్‌ను పునరుద్ధరింపజేయడానికిగాను మేలో ఆర్థికమంత్రి ప్రకటించిన రూ.20.97 లక్షల కోట్ల ప్యాకేజీ అంశాల అమలుకు బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్‌ సంస్థలు ప్రాధాన్యత ఇస్తున్నాయి.  

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు