పన్ను చెల్లింపుదారుల గుర్తింపునకు పోర్టల్‌

13 Aug, 2020 04:38 IST|Sakshi

నేడు ప్రారంభించనున్న ప్రధాని మోదీ

న్యూఢిల్లీ: దేశంలో నిజాయితీగా పన్నులు చెల్లించేవారిని గుర్తించి ప్రోత్సహించే లక్ష్యంతో ‘‘పారదర్శక పన్ను విధానం–నిజాయితీపరులకు గౌరవం’’ పేరుతో ఏర్పాటైన ఓ ప్లాట్‌ఫార్మ్‌ను ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ప్రారంభించనున్నారు. ఈ ప్లాట్‌ఫార్మ్‌ ద్వారా ప్రత్యక్ష పన్నుల విధానాల్లో సంస్కరణలను అమలు చేస్తామని బుధవారం వెలువడిన ఒక అధికారిక ప్రకటన తెలిపింది.

ప్రధాని ఆన్‌లైన్‌ పద్ధతిలో ప్లాట్‌ఫార్మ్‌ను ప్రారంభిస్తారని,  ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, సహాయ మంత్రి అనురాగ్‌ సింగ్‌ ఠాకూర్‌లతోపాటు దేశంలోని వాణిజ్య సంస్థలు, చార్టర్డ్‌ అకౌంటెంట్లు, గణనీయమైన పన్ను చెల్లింపుదారుల అసోసియేషన్లు పాల్గొంటాయని ఆ ప్రకటన తెలిపింది. ద సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ ఇటీవలి కాలంలో ప్రత్యక్ష పన్నుల విధానంలో పలు మార్పులు తీసుకొచ్చిందని, గత ఏడది కార్పొరేట్‌ ట్యాక్స్‌ రేట్లను 30 శాతం నుంచి 22 శాతానికి తగ్గించామని, కొత్త తయారీ సంస్థలకు దీన్ని పదిహేను శాతం చేశామని ఈ ప్రకటనలో వివరించారు. డివిడెండ్‌ డిస్ట్రిబ్యూషన్‌ పన్నును కూడా రద్దు చేసినట్లు తెలిపింది. పన్నుల రేట్లు తగ్గింపు, నిబంధనల సరళీకరణలే లక్ష్యంగా ప్రత్యక్ష పన్నుల విధానంలో సంస్కరణలు తీసుకువస్తున్నట్లు తెలిపారు.

Read latest Business News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు