పీఈ, వీసీ ఇన్వెస్టర్లతో ప్రధాని భేటీ

18 Dec, 2021 05:05 IST|Sakshi

పెట్టుబడులను ఆకర్షించేందుకు తీసుకోతగిన చర్యలపై చర్చ

న్యూఢిల్లీ: భారత్‌ను పెట్టుబడులకు ఆకర్షణీయ కేంద్రంగా మార్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి తెలుసుకునేందుకు ప్రైవేట్‌ ఈక్విటీ (పీఈ)/వెంచర్‌ క్యాపిటల్‌ (వీసీ) ఇన్వెస్టర్లతో ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం సమావేశమయ్యారు. దేశీయంగా వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, పెట్టుబడులను ఆకర్షించేందుకు, సంస్కరణల ప్రక్రియను ముందుకు తీసుకెళ్లేందుకు తగు సలహాలు ఇవ్వాలని సూచించారు.

పరిశ్రమ ప్రతినిధులు ఇచ్చిన ఆచరణాత్మక సిఫార్సులను ప్రశంసించిన ప్రధాని .. వారు లేవనెత్తిన సవాళ్లను పరిష్కరించేందుకు కేంద్రం కట్టుబడి ఉందని హామీ ఇచ్చినట్లు ప్రభుత్వం ఒక అధికారిక ప్రకటనలో పేర్కొంది. సమావేశం సందర్భంగా మరిన్ని సంస్కరణలు ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మోదీ వివరించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.   

పెట్టుబడులకు సానుకూల పరిస్థితులు ..
దేశీయంగా వ్యవస్థాపక సామర్థ్యాలు పుష్కలంగా ఉన్నాయని, భారత స్టార్టప్‌లు అంతర్జాతీయ స్థాయికి ఎదిగేందుకు వీటిని ఉపయోగించుకోవచ్చని పీఈ, వీసీ ఫండ్‌ల ప్రతినిధులు ఈ సందర్భంగా తెలిపారు. భారత్‌లో పెట్టుబడుల వాతావరణం మరింత సానుకూలంగా మారిందని సాఫ్ట్‌బ్యాంక్‌ ప్రతినిధి మునీష్‌ వర్మ చెప్పారు. దేశంలోకి పెట్టుబడులు పుష్కలంగా వస్తుండటం, ఎదుగుతున్న ఎంట్రప్రెన్యూర్లు, స్టాక్‌ ఎక్సే్చంజీల్లో కంపెనీలు పెద్ద సంఖ్యలో లిస్టవుతుండటం తదితర అంశాలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. భారత్‌లో మరింతగా ఇన్వెస్ట్‌ చేసేందుకు ఇటువంటి సమావేశాలు స్ఫూర్తినిస్తాయని జనరల్‌ అట్లాంటిక్‌ ప్రతినిధి సందీప్‌ నాయక్‌ తెలిపారు. భారత్‌లో ఇప్పటికే 5 బిలియన్‌ డాలర్లు ఇన్వెస్ట్‌ చేశామని, వచ్చే పదేళ్లలో 10 నుంచి 15 బిలియన్‌ డాలర్ల వరకూ పెట్టుబడులు కూడా పెట్టుబడులు పెట్టవచ్చని ఆయన వివరించారు. అంకుర సంస్థలకు తోడ్పాటునిచ్చేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రస్తావిస్తూ మోదీని ’స్టార్టప్‌ ప్రధానమంత్రి’ అంటూ 3వన్‌4 ప్రతినిధి సిద్ధార్థ్‌ పాయ్‌ అభివర్ణించారు.  

>
మరిన్ని వార్తలు