PMJDY: పీఎంజేడీవై ఖాతాదారులకు రూ.10 వేల ఓవర్ డ్రాఫ్ట్

29 Aug, 2021 19:39 IST|Sakshi

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీవై) ఏడేళ్లు పూర్తి చేసుకుంది. ఆగస్టు 18, 2021 నాటికి ఈ పథకం కింద 430 మిలియన్లకు పైగా ఖాతాలను తెరిచినట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం "ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేయుత కార్యక్రమాలలో ఒకటి" అని కేంద్రం పేర్కొంది. ఈ పథకం వల్ల దేశంలోని పేద, అణగారిన వర్గాలకు చెందిన వారు కోట్లాది మంది ఈ పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో అకౌంట్లను ఓపెన్ చేసుకున్నారు. ప్రస్తుతం ఈ పథకం కింద ఓపెన్ చేసిన ఖాతాల డిపాజిట్ల విలువ మొత్తం రూ.1.46 లక్షల కోట్లున్నట్లు కేంద్రం ఆర్థిక శాఖ వెల్లడించింది. 

రూ.10,000 వరకు ఓవర్ డ్రాఫ్ట్
దిగువ మధ్య తరగతి, పేద కుటుంబాలకు చెందిన వారు జీరో బ్యాలెన్స్‌తో బ్యాంకుల్లో అకౌంట్లను తెరవడానికి ఉద్దేశించినదే ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన(పీఎంజేడీవై) పథకం. పీఎంజేడీఐ కింద ఖాతా ఓపెన్ చేసిన వారికి ఓవర్ డ్రాఫ్ట్  సదుపాయం కూడా లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ అంటే.. ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేనప్పటికీ అతడి/ఆమె బ్యాంకు ఖాతా నుంచి(పొదుపు లేదా కరెంట్) నిర్ణీత మొత్తం వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు.

ఇతర క్రెడిట్ ఫెసిలిటీ వలే, ఖాతాదారుడు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ద్వారా నగదు విత్ డ్రా చేసినప్పుడు కొంత వడ్డీ కట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక రుణం రూపంలో జన్ ధన్ ఖాతాదారులు ₹10,000 వరకు డబ్బును విత్ డ్రా చేసుకోవచ్చు. ఈ పరిమితి ఇంతకు ముందు ₹5,000 వరకు ఉండేది, కానీ ప్రభుత్వం గత సంవత్సరం ఈ మొత్తాన్ని రెట్టింపు చేసింది.(చదవండి: ఐటీ రిటర్న్స్ దాఖలు చేసే వారికి ఊరట..!)

ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఏవిధంగా పనిచేస్తుంది?
పీఎంజేడీవై ఖాతాదారులు తమ ఖాతాల్లో ఉన్న దానికంటే ఎక్కువ డబ్బును అప్పు తీసుకోవడానికి ప్రభుత్వం అనుమతిస్తోంది. ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవడానికి కొన్ని ప్రమాణాలను నిర్దేశించింది. ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలంటే పీఎంజేడీవై ఖాతా యజమాని కనీసం ఆరు నెలల పాటు దానిని ఆపరేట్ చేసి ఉండాలి. అదే విధంగా, ఒక నిర్ధిష్ట కుటుంబంలోని ఒక సభ్యుడు మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీకి అర్హులు. సాధారణంగా మహిళా సభ్యులకు అవకాశం ఉంటుంది. ఖాతాదారునికి మంచి క్రెడిట్ చరిత్ర ఉండాలి. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద ₹2,000 వరకు ఎలాంటి గ్యారెంటీ అవసరం లేదు. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కూడా ప్రభుత్వం 60 నుండి 65 సంవత్సరాలకు పెంచింది.

మరిన్ని వార్తలు