రూ.50 లక్షల కోట్లకు పీఎంఎస్, ఏఐఎఫ్‌ ఆస్తులు.. ఎప్పుడంటే ?

7 Dec, 2021 08:43 IST|Sakshi

2031 నాటికి చేరుకుంటుంది పీఎంఎస్‌ బజార్‌ అంచనా 

న్యూఢిల్లీ: సంప్రదాయ రిటైల్‌ సాధనాలకు ప్రత్యామ్నాయంగా.. పోర్ట్‌ఫోలియో మేనేజ్‌మెంట్‌ సర్వీసెస్‌ (పీఎంఎస్‌), ఆల్టర్నేటివ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్స్‌ (ఏఐఎఫ్‌) వైపు ఇన్వెస్టర్లు చూస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో వీటికి మరింత ఆదరణ రానుందని పీఎంఎస్‌ బజార్‌ పేర్కొంది. పీఎంఎస్, ఏఐఎఫ్‌ల నిర్వహణలోని ఆస్తులు (ఏయూఎం) ఏటా 20 శాతం కాంపౌండెడ్‌గా వృద్ధి చెందుతూ 2031 నాటికి రూ.50లక్షల కోట్లకు చేరుకోవచ్చని అంచనా వేసింది. పీఎంఎస్, ఏఐఎఫ్‌లలో పెట్టుబడుల సేవలను పీఎంఎస్‌ బజార్‌ ఆఫర్‌ చేస్తుంటుంది. నియంత్రణల పరంగా ఈ సాధనాలకు సానుకూలత నెలకొందని, మెరుగైన రాబడులను ఇస్తున్నట్టు తెలిపింది.
 

అధికారిక గణాంకాల ఆధారంగా చూస్తే.. పీఎంఎస్‌ (నాన్‌ ఈపీఎఫ్‌వో) ఆస్తులు ఈ ఏడాది అక్టోబర్‌ నాటికి రూ.3.97 లక్షల కోట్లుగా ఉన్నట్టు పీఎంఎస్‌ బజార్‌ పేర్కొంది. ‘‘ఇది ఆరు రెట్లు పెరిగి 2031 నాటికి రూ.24 లక్షల కోట్లకు చేరుకోవచ్చు. అదే విధంగా ఏఐఎఫ్‌ సాధనాల నిర్వహణలోని ఆస్తులు రూ.4.87 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఇవి సైతం ఆరు రెట్లకు పైగా పెరిగి రూ.30 లక్షల కోట్లకు వచ్చే పదేళ్లలో వృద్ధి చెందుతాయి’’ అని పీఎంఎస్‌ బజార్‌ అంచనా వేసింది. సంపద సృష్టిలో ఈ సాధనాలు ముఖ్య పాత్ర పోషిస్తాయని ‘పీఎంఎస్‌ బజార్‌’ నిర్వహించిన సదస్సులో భాగంగా వైట్‌ఓక్‌ క్యాపిటల్‌ మేనేజ్‌మెంట్‌ సీఈవో ఆశిష్‌ పీ సోమయ్య అభిప్రాయపడ్డారు. ఇటీవలి కాలంలో ప్రత్యామ్నాయ పెట్టుబడి సాధనాలు వేగంగా వృద్ధి చెందుతున్నట్టు ఎమ్కే ఇన్వెస్ట్‌మెంట్‌ మేనేజర్స్‌ సీఈవో వికాస్‌ ఎం సచ్‌దేవ చెప్పారు. రాబడులను పెంచుకోవడం, వైవిధ్యాన్ని విస్తృతం చేసుకోవడం వల్లే వీటికి ఆదరణ పెరుగుతున్నట్టు ఆయన విశ్లేషించారు.   
 

మరిన్ని వార్తలు