Interest Rates On Home Loans: ఖాతాదారులకు పీఎన్‌బీ షాక్‌!

2 Jun, 2022 09:01 IST|Sakshi

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగంలోని పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ (పీఎన్‌బీ) నిధుల సమీకరణ ఆధారిత (ఎంసీఎల్‌ఆర్‌) రుణ రేటును అన్ని కాలపరిమితులపై 15 బేసిస్‌ పాయింట్లు లేదా 0.15 శాతం (100 బేసిస్‌ పాయింట్లు ఒకశాతం) పెంచింది. కొత్త రేట్లు జూన్‌ 1 నుంచి అమల్లోకి వస్తాయి.

తాజా సవరణతో ఏడాది ఎంసీఎల్‌ఆర్‌ 7.25 శాతం నుంచి 7.40 శాతానికి చేరింది. ఓవర్‌నైట్, నెల, మూడు నెలల రేట్లు వరుసగా 6.75 శాతం, 6.80 శాతం, 6.90 శాతానికి పెరిగాయి. ఆరు నెలల ఎంసీఎల్‌ఆర్‌ 7.10 శాతానికి పెరిగింది. ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన బ్యాంక్‌ ఈఎంఐల భారం వినియోగదారులపై పెరగనుంది.  

హెచ్‌డీఎఫ్‌సీ.. నెలలో ‘మూడవ’ వడ్డింపు 
కాగా, హెచ్‌డీఎఫ్‌సీ గత నెల రోజుల్లో మూడవసారి రుణ రేటును పెంచింది. గృహ రుణాలపై రిటైల్‌ ప్రైమ్‌ లెండింగ్‌ రేటును (ఆర్‌పీఎల్‌ఆర్‌) స్వల్పంగా ఐదు బేసిస్‌ పాయింట్లు పెంచింది. కొత్త, పాత రుణ గ్రహీతలకు జూన్‌ 5వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. తాజా పెంపు అనంతరం క్రెడిట్‌ స్కోర్, రుణ మొత్తం ప్రాతిపదికన  కొత్త రుణ గ్రహీతలకు రుణ రేట్లు 7.05 శాతం నుంచి 7.50 శాతం శ్రేణిలో ఉంటాయి. ప్రస్తుత కస్టమర్లకు  ఈ రేట్లు 7–7.45 శాతం శ్రేణిలో ఉంటుంది. ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా ఆర్‌బీఐ కఠిన ద్రవ్య విధానానికి నిర్ణయించిన నేపథ్యంలో బ్యాంకులు తాజా వడ్డీరేట్ల పెంపునకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు