పీఎన్‌బీ ఖాతాదారులకు అలర్ట్.. మరో కొత్త రూల్..!

1 Mar, 2022 19:59 IST|Sakshi

చెక్కు మోసాల నుంచి బ్యాంకు ఖాతాదారులను రక్షించడం కోసం పంజాబ్ నేషనల్ బ్యాంక్(పీఎన్‌బీ) పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలకు ఏప్రిల్ 4 నుంచి పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్)ను తప్పనిసరి చేస్తామని నేడు తెలిపింది. ₹10 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కుల కోసం వచ్చే నెల నుంచి పీపీఎస్ తప్పనిసరి చేయనున్నట్లు రుణదాత తెలిపారు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) మార్గదర్శకాల ప్రకారం.. 1 జనవరి 2021 నుంచి సీటీఎస్ క్లియరింగ్ సమయంలో ₹50,000, అంతకంటే విలువ కలిగిన చెక్కుల కోసం పీపీఎస్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చింది.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్‌పీసీఐ) అభివృద్ధి చేసిన పాజిటివ్ పే సిస్టమ్(పీపీఎస్) కింద పెద్ద మొత్తం గల చెక్కును క్రాస్ చెక్ చేసే సమయంలో కొన్ని వివరాలను తప్పక తిరిగి ధృవీకరించాల్సి ఉంటుంది. పీఎన్‌బీ కస్టమర్లు అకౌంట్ నెంబరు, చెక్ నెంబరు, చెక్ ఆల్ఫా కోడ్, జారీ తేదీ, మొత్తం, లబ్ధిదారుపేరు వంటి వివరాలను తెలపాల్సి ఉంటుంది. చెక్ క్లియరింగ్ కోసం కనీసం 24 పనిగంటల ముందు చెక్ వివరాలను బ్యాంకుతో పంచుకోవాలి. కస్టమర్లు తన ఇంటర్నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ బ్యాంకింగ్ లేదా తమ హోమ్ బ్రాంచీకి వెళ్ళి వివరాలను పంచుకోవచ్చు. ₹5 లక్షలు, అంతకంటే ఎక్కువ విలువ కలిగిన చెక్కులను క్లియర్ చేయడం కోసం పాజిటివ్ పే సిస్టమ్ వేసులుబాటును ఆర్బీఐ బ్యాంకులకు కల్పించింది. 

(చదవండి: ఎలక్ట్రిక్ స్కూటర్ కొనేవారికి అదిరిపోయే శుభవార్త.. సింగిల్ ఛార్జ్ @ 300కిమీ!)

మరిన్ని వార్తలు