జూమ్‌ కాల్‌లో 800 మంది ఉద్యోగుల తొలగింపు! మరి ఇంత దుర్మార్గమా..ప్రధాని ఆగ్రహం!

19 Mar, 2022 11:45 IST|Sakshi

మీకు బెటర్‌ డాట్‌ కామ్‌ సీఈఓ విశాల్‌ గార్గ్‌ చేసిన నిర‍్వాకం తెలిసే ఉంటుంది. భారత సంతతికి చెందిన విశాల్‌ గార్గ్‌ 2016నుంచి 'బెటర్‌ డాట్‌ కామ్‌' అనే సంస్థ ద్వారా మోర్టగేజ్‌ లెండింగ్‌ కార్యకాలాపాల్ని నిర్వహిస్తున్నాడు. గతేడాది డిసెంబర్‌ నెలలో జూమ్‌ మీటింగ్‌లో కేవలం మూడే నిమిషాల్లో 900 మందికి ఉద్యోగాల నుంచి తీసేస్తున్నట్లు ప్రకటించి తీవ్ర విమర్శల పాలయ్యారు. తాజాగా మరో కంపెనీ సీఈఓ 3నిమిషాల జూమ్‌ కాల్‌లో 800మంది ఉద్యోగాల నుంచి తొలగించాడు. ప్రస్తుతం ఈ అంశం యూకే వ్యాప్తంగా హాట్‌ టాపిగ్గా మారింది. ఆ దేశ ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ సైతం ఉద్యోగుల పట్ల సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.  

పీ&ఓ ఫెర్రీస్‌ అనే బ్రిటీష్‌ షిప్పింగ్‌ కంపెనీ యూకే, ఐర్లాండ్‌, యూరప్‌ దేశాల్లో వ్యాపార కార్యకలాపాల్ని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో సంస్థలో పనిచేస్తున్న 800 మందిని జూమ్‌ కాల్‌లో  విధుల నుంచి తొలగిస్తున్నట్లు ఆ సంస్థ సీఈఓ జానెట్ బెల్ ప్రకటించారు.

నిధుల దుర్వినియోగం
కరోనా కారణంగా విధించిన లాక్‌ డౌన్‌లో 1100 మంది ఉద్యోగులకు జీతాలిచ్చేందుకు పీ&ఓ యాజమాన్యం యూకే ప్రభుత్వం నుంచి 10 మిలియన్లను అప్పుగా తీసుకుంది. అయితే కోవిడ్‌  దెబ్బతో గత రెండేళ్లలో కంపెనీ 200 మిలియన్‌ డాలర్ల నష్టాల్ని చవిచూసింది. అదే సమయంలో యూకే ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని దుర్వినియోగం చేయడం, తీసుకున్న మొత్తాన్ని తిరిగి చెల్లించకపోవడం వంటి అంశాలు తెరపైకి వచ్చాయి. అందుకే నష్టాల్ని కారణంగా చూపిస్తూ జానెట్‌ బెల్‌ జూమ్‌ కాల్‌ మీటింగ్ లో విధుల నుంచి ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు చెప్పారు. 

ప్రధాని ఆగ్రహం 
ఉద్యోగుల పట్ల పీ&ఓ ఫెర్రీస్‌ సంస్థ వ్యవహరిస్తున్న తీరుపై యూకే ప్రధాని బోరిస్ జాన్సన్ స్పందించారు. ఉద్యోగం నుంచి తీసివేస్తున్నామని ఇలా ప్రకటించడం సరైన పద్దతి కాదు. సంవత్సరాలుగా కష్టపడి పనిచేస్తూ, సంస్థను అలాగే అంటి పెట్టుకొని, కరోనా కష్టకాలంలో సంస్థకు వెన్నంటే ఉన్నారు. అలాంటి ఉద్యోగుల పట్ల మర్యాదగా మెలగాలి. ఇలా దుర్మార్గంగా వ్యవహరించకూడదు అంటూ యూకే ప్రధాని కార్యాలయం స్పోక్‌ పర‍్సన్‌ తెలిపారు. అంతేకాదు ఉద్యోగుల వ్యవహారంలో కంపెనీ తీసుకున్న నిర్ణయం వెనక్కి తీసుకోవాలని, లేదంటే యూకే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరించారు.

చదవండి: విశాల్‌ గార్గ్‌ ఎంత దుర్మార్గంగా ఆలోచించాడంటే..

మరిన్ని వార్తలు