ఉద్యోగుల్లో తరుముకొస్తున్న..మానసిక ముప్పు, భయపెట్టిస్తున్న షాకింగ్ రిపోర్ట్!

10 Sep, 2022 06:59 IST|Sakshi

14 బిలియన్‌ డాలర్ల మేర నష్టం 

పనికి వచ్చినా ఉత్పాదకత తక్కువే 

డెలాయిట్‌ నివేదిక   

న్యూఢిల్లీ: ఉద్యోగుల మానసిక సమస్యలు సంస్థలపై పెద్ద భారాన్నే మోపుతున్నాయి. ఏ స్థాయిలో అంటే 14 బిలియన్‌ డాలర్ల మేర (రూ.1.2 లక్షల కోట్లు). డెలాయిట్‌ తూచ్‌ తోమత్సు ఇండియా ఇందుకు సంబంధించి ఒక నివేదిక విడుదల చేసింది. మానసిక అనారోగ్యం కారణంగా విధులకు గైర్హాజరు కావడం, తక్కువ ఉత్పాదకత, వలసలు కలసి కంపెనీలు ఈ స్థాయిలో నష్టపోతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా అంతర్జాతీయంగా ఉద్యోగుల్లో మానసిక అనారోగ్య సమస్యలు పెరుగుతూ పోతున్నట్టు ఈ నివేదిక తెలిపింది.

అంతర్జాతీయంగా మానసిక అనారోగ్యం వల్ల పడే భారంలో భారత్‌ వాటా 15 శాతంగా ఉన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) గణాంకాలు చెబుతున్నాయి. భారత ఉద్యోగుల్లో మానసిక ఆరోగ్యం ఎలా ఉంది, సంస్థలపై దాని ప్రభావం ఏ మేరకు అనే విషయాలను తెలుసుకునేందుకు డెలాయిట్‌ ఈ సర్వే నిర్వహించింది. 

పని ఒత్తిళ్లు ఎక్కువే..  
పనిలో ఉండే ఒత్తిళ్లు తమ మానసిక ఆరోగ్యానికి దెబ్బతీస్తున్నట్టు 47 శాతం మంది నిపుణులు చెప్పారు. ఆ తర్వాత ఆర్థిక సమస్యలు, కరోనా మహమ్మారిని వారు కారణాలుగా పేర్కొన్నారు. ఈ ఒత్తిళ్లు అన్నవి వ్యక్తిగతంగా, వృత్తి పరంగా, సామాజికంగానూ ఉద్యోగులపై చూపిస్తున్నాయి. ఒకవేళ ఉద్యోగులు పనికి వచ్చినా, వారు ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల వల్ల కారణంగా ఉత్పాదకత తక్కువే ఉంటున్న విషయాన్ని ఈ నివేదిక ఎత్తి చూపింది. 

గడిచిన ఏడాది కాలంలో 80 శాతం ఉద్యోగులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్టు చెప్పారు. గణాంకాలు భయపెట్టే విధంగా ఉన్నా.. 39 శాతం మంది సామాజిక నిందల భయంతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి వెనుకాడుతున్న పరిస్థితి నెలకొంది. పని ప్రదేశాల్లో మానసిక అనారోగ్యం ఉన్నప్పటికీ 33 శాతం మంది తాము ఎప్పటిమాదిరే విధులకు హాజరవుతున్నామని చెప్పగా.. 29 శాతం మంది కొంత సెలవు తీసుకోవడం చేస్తున్నట్టు చెప్పారు. ఇక 20 శాతం మంది రాజీనామా చేసి ఒత్తిడి తక్కువగా ఉండే మెరుగైన ఉద్యోగం కోసం అన్వేషిస్తున్నట్టు డెలాయిట్‌ సర్వేలో వెల్లడించారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని ప్రాధాన్య అంశంగా సంస్థలు పరిగణించాలని.. మానసిక అనారోగ్యానికి మూల కారణాలను తెలుసుకుని పరిష్కారాలపై దృష్టి పెట్టాలని డెలాయిట్‌ సూచించింది.

మరిన్ని వార్తలు