టెస్లాకి షాకిచ్చిన పోర్షే... ఇండియా మార్కెట్‌లోకి లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారు

12 Nov, 2021 15:53 IST|Sakshi

ఇండియా మార్కెట్‌కి వస్తాం.. మాకు పన్నుల్లో రాయితీ ఇవ్వడంటూ కోర్రీలే వస్తున్న టెస్లా ఓనర్‌ ఎలన్‌ మస్క్‌కి పోర్షే గట్టి షాక్‌ ఇచ్చింది. చడీ చప్పుడు లేకుండా ఇండియా మార్కెట్‌లో లగ్జరీ ఎలక్ట్రిక్‌ కారుని రిలీజ్‌ చేసింది.

రూ. 1.5 కోట్లు
లగ్జరీ కార్ల తయారీ సంస్థ పోర్షే ఇండియాలో టేక్యాన్‌ పేరుతో ఎలక్ట్రిక్‌ కారుని మార్కెట్‌లోకి తెచ్చింది.  టేక్యాన్‌, టేక్యాన్‌ 4 ఎస్‌,  టర్బో, టర్బో ఎస్‌లు ఉన్నాయి. ఆ తర్వాత వేరియంట్లలో ఈ కారుని ఇండియాకి తీసుకు వచ్చింది. ఈ కారు ప్రారంభం ధర రూ.1.50 కోట్లుగా ఉంది. ఈ స్పోర్ట్స్‌ లగ్జీరీ కారు జెట్‌ స్పీడ్‌తో దూసుకుపోగలదని పోర్షే చెబుతోంది. హై ఎండ్‌ వేరియంట్‌ కారు కేవలం 2.9 సెకన్లలోనే వంద కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకుంటుందని పేర్కొంది.  

సింగిల్‌ ఛార్జ్‌తో 484 కి.మీ మైలేజ్‌
టైక్యాన్‌ మోడల్‌లో ఎంట్రీ లెవల్‌ కారు 408 పీఎస్‌(హెచ్‌పీ)తో  వస్తుండగా హై ఎండ్‌ వేరియంట్‌ 761 పీఎస్‌ (హెచ్‌పీ)తో వస్తోంది. ఈ కారు టాప్‌ స్పీడ్‌ సగటు గంటకి 240 కిలోమీటర్లుగా ఉంది. పోర్షే టేక్యాన్‌ మోడల్‌ బ్యాటరీ సామర్థ్యం 79.2  కేడబ్ల్యూహెచ్‌గా ఉంది. ఒక​‍్కసారి ఛార్జ్‌ చేస్తే స్టాండర్డ్‌ మోడ్‌లో 484 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయవచ్చని కంపెనీ చెబుతోంది. హై ఎండ్‌ వేరియంట్‌లో 93.4 కేడబ్ల్యూహెచ్‌గా (కిలో వాట్‌ పర్‌ అవర్‌)గా ఉంది.

టెస్లా నాన్చుడు
టెస్లా సంస్థ ఇటీవల మార్కెట్లోకి ఎస్‌ ప్లెయిడ్‌ మోడల్‌ని రిలీజ్‌ చేయగా గ్లోబల్‌ మార్కెట్‌లో ఆ కార్లు హాట్‌కేకుల్లా అమ్ముడయ్యాయి.ఈ పరంపరలో ఇండియాలో టెస్లా కార్లు తెస్తామంటూ ఎలన్‌మస్క్‌ ప్రకటించారు. అయితే కాలుష్యం తగ్గించే కార్లు కావడం వల్ల తమకు దిగుమతి సుంకం తగ్గించాలంటూ మెలిక పెట్టారు. దీనిపై స్పందించిన భారత అధికారులు మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ పెడితే పన్ను రాయితీ విషయంపై ఆలోచిస్తామన్నారు. దీంతో టెస్లా కార్లు ఇండియా మార్కెట్‌లోకి వచ్చే విషయంపై ఒక అడుగు ముందుకు అయితే రెండు అడుగులు వెనక్కి అన్నట్టుగా పరిస్థితి మారింది.

పోర్షే దూకుడు
భారత ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ వాహనాలకు ఫేమ్‌ పథకం ద్వారా ప్రోత్సహాం అందిస్తోంది. పెరుగుతున్న ఫ్యూయల్‌ ధరలతో ప్రజలు సైతం ఈవీలకు మళ్లుతున్నారు. ఈ క్రమంలో టెస్లా కారుకి ఇండియా డిమాండ్‌ ఉండవచ్చనే అంచనాల నెలకొన్నాయి. అయితే ఇండియాలో తమ కార్లు ప్రవేశపెట్టే విషయంలో టెస్లా ఈసీవో ఎలన్‌మస్క్‌ నాన్చుడు ధోరణి అవలంభించారు. ఇదే సమయంలో టెస్లాకు పోటీ ఇవ్వగలిగే పోర్షే సంస్థ లగ్జరీ, స్పోర్ట్స్‌ ఫీచర్ల కలయితో టేక్యాన్‌ కారుని ఇండియాలోకి తెచ్చింది. 

చదవండి షేర్ల అమ్మకం.. ఆ వెంటనే షేర్‌ వాల్యూ ఢమాల్‌! టెస్లాకు గట్టి దెబ్బే!

మరిన్ని వార్తలు