కోటి రూపాయల పోర్షే లగ్జరీ స్పోర్ట్స్‌ కారు రూ. 14 లక్షలకే! కంపెనీ పరుగులు

2 Feb, 2023 18:22 IST|Sakshi

న్యూఢిల్లీ: జర్మన్  లగ్జరీ కార్‌మేకర్‌  పోర్షే  భలే చిక్కుల్లో పడింది.  కంపెనీ అతిపెద్ద మార్కెట్  చైనాలో ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే  అక్కడి  చైనా డీలర్‌ ఒకరు  148,000 డాలర్ల(రూ. 1.21 కోట్లు) విలువ చేసే స్పోర్ట్స్ కారును కేవలం 18 వేల డాలర్లు (రూ. 14 లక్షల కంటే కొంచెం ఎక్కువ) అంటూ తప్పుగా లిస్ట్‌ చేశారు.  వాస్తవ ధరలో ఎనిమిదో వంతు  తగ్గేసరికి  లగ్జరీ కార్‌ లవర్స్‌ ముందస్తు  బుకింగ్‌కు ఎగబడ్డారు.  చివరికి  విషయం తెలిసి ..ఇదెక్కడి చోద్యం రా మామా అంటూ ఉసూరుమన్నారట.!

బ్లూమ్‌బెర్గ్  కథనం ప్రకారం ప్రముఖ 2023 పనామెరా మోడల్‌ విక్రయంలో ఉత్తర చైనా పట్టణంలోని యిన్‌చువాన్‌లోని పోర్షే డీలర్  ఇచ్చిన ఆన్‌లైన్ ప్రకటన కంపెనీని పరుగులు పెట్టించింది. అతి తక్కువ ధరకే తమ ఫ్యావరెట్‌ కారు అనేసరికి ఊరుకుంటారా? వందలాది మంది ఔత్సాహిక కొనుగోలుదారులు  911 యువాన్లను ముందుగానే చెల్లింపుతో  కారును బుక్‌  చేసేశారు.   

ఈ బుకింగ్‌లు చూసి ఆశర్చర్యపోయిన కంపెనీ  ఏం జరిగిందా? అని ఆరా తీస్తే అసలు విషయం బైటపడింది. దీంతో "లిస్టెడ్ రిటైల్ ధరలో తీవ్రమైన పొరపాటు జరిగింది" అని పోర్షే  ప్రకటించాల్సి వచ్చింది. బుకింగ్‌లు చేసి, అడ్వాన్స్‌ను చెల్లించిన మిగతా వారందరికీ కంపెనీ క్షమాపణలు చెప్పింది. 48 గంటల్లోగా రీఫండ్ ఇస్తామని పేర్కొంది. దీంతో భంగపడిన కస్టమర్లు, ఇతర వినియోగదారులు చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ వీబోలో పోర్షేను విపరీతంగా  ట్రోల్ చేశారు.

కాగా పోర్షే 2022 మొదటి అర్ధ భాగంలోనే చైనాలో 6.2 బిలియన్‌ డార్లు విలువైన  సేల్స్‌ సాధించింది.  46,664 వాహనాలను విక్రయించింది. ప్రీమియం కార్ బ్రాండ్‌  పోర్షే ప్రపంచ విక్రయాలలో 30 శాతమట.

మరిన్ని వార్తలు